కాంగ్రెస్‌ ఉక్కిరిబిక్కిరి: ఇటు మునుగోడు.. అటు భారత్‌ జోడో

17 Oct, 2022 02:00 IST|Sakshi

ఏకకాలంలో భారత్‌ జోడో యాత్ర, మునుగోడు ఉపఎన్నికతో కాంగ్రెస్‌ ఉక్కిరిబిక్కిరి

అధిష్టానం ఆదేశంతో ఉపఎన్నిక ప్రచారాన్ని 20 వరకు పొడిగించుకున్న రేవంత్‌

ఆ తర్వాత సైతం మునుగోడు నుంచే రాహుల్‌ యాత్ర ఏర్పాట్ల పర్యవేక్షణ

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉపఎన్నికతోపాటు రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రను దాదాపు ఏకకాలంలో సమన్వయం చేసుకోవాల్సి రావడంతో టీ కాంగ్రెస్‌ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నెల 23 నుంచి 15 రోజులపాటు జరగనున్న రాహుల్‌ పాదయాత్రను విజయవంతం చేయాల్సి ఉండటం, సిట్టింగ్‌ స్థానమైన మునుగోడును ఎట్టిపరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉండటంతో నేతలంతా ఉరుకులుపరుగులు పెడుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి ఈ నెల 6 నుంచి 14 వరకు మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొని ఆ తర్వాత భారత్‌జోడో యాత్ర ఏర్పాట్లు చూసుకోవాలని తొలుత షెడ్యూల్‌ చేసుకున్నారు. అయితే ఏఐసీసీ ఆదేశాల మేరకు 17వ తేదీ నుంచి 20 వరకు మునుగోడు ప్రచారంలో పాల్గొననున్నారు. మునుగోడు నుంచే రేవంత్‌ భారత్‌ జోడో యాత్ర ఏర్పాట్లను కూడా చూసుకుంటారని గాంధీ భవన్‌ వర్గాలు తెలిపాయి.

ఇక భారత్‌ జోడో యాత్ర ఏర్పాటు బాధ్యతలు తీసుకున్నట్లుగా చెబుతున్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ సోమవారం జరగనున్న ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసేందుకు తమిళనాడు వెళ్లారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌ తిరిగి వచ్చి యాత్ర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు కర్ణాటక వెళ్లగా మరో ఇద్దరు కార్యదర్శులు నదీమ్‌ జావెద్, రోహిత్‌ చౌదరి యాత్ర ఏర్పాట్లు చూసుకుంటున్నారు. వారిద్దరూ గాంధీ భవన్‌లోనే ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసేందుకు అనుమతి తీసుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, వి. హనుమంతరావు, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, సంపత్‌కుమార్, హర్కర వేణుగోపాల్‌ తదితరులు రాహుల్‌ యాత్ర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

మునుగోడులో కేడర్‌ నిమగ్నం..
అన్ని జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు సమయాన్ని బట్టి మునుగోడు ఉపఎన్నిక ప్రచారం నిర్వహించేందుకు, భారత్‌ జోడో యాత్రలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదేవిధంగా పార్టీ అనుబంధ సంఘాలైన ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్‌లు కూడా ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. ప్రజాస్వామ్యానికి పాదాభివందనం పేరుతో రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో వందలాది మంది ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు నియోజకవర్గవ్యాప్తంగా గ్రామ గ్రామానికి వెళ్లి ఓటర్ల కాళ్లు మొక్కి పార్టీకి ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు.

రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేనారెడ్డి నేతృత్వంలోని బృందం కూడా ఉపఎన్నిక ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటోంది. భారత్‌ జోడో యాత్ర విజయవంతం కోసం రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు సైతం యాత్ర జరిగే జిల్లాల మహిళా నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మునుగోడు ఉపఎన్నిక కోసం ఇన్‌చార్జీలుగా నియమితులైన నేతలంతా నియోజకవర్గంలోనే ఉండి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వారంతా నవంబర్‌ 3 తర్వాత రాహుల్‌ యాత్రలో పాల్గొననున్నారు.  

మరిన్ని వార్తలు