Telangana: ‘జంగ్‌ సైరన్‌’ ఉద్రిక్తం

3 Oct, 2021 03:33 IST|Sakshi
ఎల్బీనగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహం వద్ద ఆందోళన నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు

ఉద్రిక్తతలకు దారితీసిన కాంగ్రెస్‌ ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌’ 

అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు... ప్రతిఘటించిన కార్యకర్తలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ చేపట్టిన ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌’తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. దీనికి అనుమతి లేదంటూ పోలీసులు కాంగ్రెస్‌నేతలు, కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేయడం.. పోలీసుల కళ్లుగప్పి కార్యక్రమ నిర్వహణకు కాంగ్రెస్‌ శ్రేణులు యత్నించడంతో హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్‌లో రెండున్నర గం టలపాటు హైడ్రామా నడిచింది. టీపీసీసీ పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న పలువురిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.

టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డిని మధ్యాహ్నం నుంచే గృహ నిర్బంధం చేయడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. తన ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపిన రేవంత్‌ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, పోలీసులపై మండిపడ్డారు. దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్‌లోని ఇందిరా, రాజీవ్, శ్రీకాంతాచారి విగ్రహాలకు నివాళి అర్పించేందుకు పలుమార్లు కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. లాఠీ దెబ్బలు లెక్కచేయకుండా కాంగ్రెస్‌ శ్రేణులు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం గమనార్హం. 

పార్టీ యోచన ఇది... 
విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌లో భాగంగా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు దిల్‌సుఖ్‌నగర్‌ రాజీవ్‌గాంధీ చౌరస్తా నుంచి రేవంత్‌రెడ్డి నేతృత్వం లో పాదయాత్ర ప్రారంభం కావాలి. అక్కడి నుంచి కాలినడకన ఎల్బీనగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహం వరకు చేరుకుని నివాళులర్పించి విద్యార్థి, నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి ప్రతిజ్ఞ చేయాలి.  


లాఠీచార్జీ చేసి కార్యకర్తలను చెదరగొడుతున్న

అనుమతి లేదంటూ...  
అయితే కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీ సులు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ శ్రేణులు అంతా సిద్ధం చేసుకున్న తర్వాత మధ్యాహ్నం 2 గం. సమయంలో దిల్‌సుఖ్‌నగర్‌ ఇందిరా, రాజీవ్‌ విగ్రహ ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. అక్కడికి వచ్చిన కార్యకర్తలను వచ్చినట్లు అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. ఎల్బీనగర్‌ వరకు మోహరించిన పోలీసులు శ్రీకాంతా చారి విగ్రహం వద్ద కూడా అడ్డుకునే ఏర్పాట్లుచేశా రు. మధ్యాహ్నం 4 గంటల సమయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్‌ పోలీసుల కళ్లుగప్పి దిల్‌సుఖ్‌నగర్‌ రాజీవ్‌ చౌరస్తాకు చేరుకుని నినాదాలు చేయడంతో ఆయన్ను అరెస్టు చేశారు.  

ఎల్బీనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత... 
సాయంత్రం 4:30 గంటల సమయంలో దాదాపు 2వేల మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు ఒక్కసారిగా శ్రీకాంతాచారి విగ్రహం వద్దకు చేరుకున్నారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, మాజీ ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, యూత్‌కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, జాతీయ అధ్యక్షుడు పి.బి.శ్రీనివాస్, జాతీయ కార్యదర్శి అనిల్‌కుమార్‌యాదవ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వేంనరేందర్‌రెడ్డి తదితరులు అక్కడ కు చేరుకున్నారు.

వీరందరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తోపులాట జరగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో యూత్‌కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్‌ తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ నేతృత్వంలో పలువురు శ్రీకాంతాచారి విగ్రహం వద్దకు వచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో టీపీసీసీ అధికార ప్రతినిధి విజయ్‌కుమార్‌ మూర్చపోయారు. అక్కడే కల్యాణ్‌ అనే ఢిల్లీకి చెందిన కార్యకర్త కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకునే ప్రయ త్నం చేశారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం మీద ఎల్బీనగర్‌లో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు హైడ్రామా నడిచింది.   


ఆత్మాహుతికి యత్నించిన కల్యాణ్‌

రేవంత్‌ నిర్బంధం.. 
బాపూఘాట్‌లో గాంధీ విగ్రహానికి నివాళులర్పించి ఇంటికి చేరుకున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేయడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. పోలీసులు వెళ్లిపోవాలంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు తోపులాట జరిగింది. ఆ తర్వాత బయటికి వచ్చిన రేవంత్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఆయన తన ఇంటి ముందే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్‌లను తప్ప ఎవరినీ స్మరించకూడదా.. శ్రీకాంతాచారిని స్మరించడంపై నిషేధం విధించారా అని ఆయన ప్రశ్నించారు. అయితే పోలీసులు సర్దిచెప్పి రేవంత్‌ను ఇంట్లోకి పంపించారు. 

మరిన్ని వార్తలు