ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగమే దృఢమైన పునాది

27 Nov, 2021 03:57 IST|Sakshi

దేశ సమైక్యత, సమగ్రతకు మూలస్తంభం

రాజ్యాంగ దినోత్సవంలో గవర్నర్‌ తమిళిసై

సాక్షి, హైదరాబాద్‌: స్వాతంత్య్రం సాధించిన తర్వాత దేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా రాజ్యాంగమే మన ప్రజాస్వామ్య వ్యవస్థకు దృఢమైన పునాదిలా నిలిచిందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. దేశసమైక్య త, సమగ్రత, వైవిధ్యాన్ని కాపాడటంలోనూ రాజ్యాంగం మూలస్తంభంగా పనిచేసిందన్నారు. రాజ్‌భవన్‌లో శుక్రవారం జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో గవర్నర్‌ మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ ఆలోచనల మేరకు రాజ్యాంగంలో హక్కులు, బాధ్యతలకు ప్రాధాన్యం ఇచ్చారని, బాధ్యతగా పనిచేస్తేనే హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని అన్నారు.

రాజ్యాంగ విలువలను పెంపొందించేందుకు అందరూ కలసి పనిచేయాలని, చట్టాలను పరిరక్షిస్తూనే ప్రజల హక్కులను కూడా కాపాడాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం ఆచరణలోకి రావడంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌తోపాటు రాజ్యాంగసభ సభ్యుల పాత్ర మరవలేనిదని పొగిడారు. కరోనా సంక్షోభంలో చట్టాలతోపాటు మానవత్వ విలువలను కూడా కాపాడుకోవాలని గవర్నర్‌ సూచించారు. దేశ ప్రజల సమస్యలన్నింటికీ రాజ్యాంగంలో పరిష్కారాలున్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్‌ చంద్రశర్మ అన్నారు. రాజ్యాం గం ప్రాముఖ్యత, అంబేడ్కర్‌ ఆలోచనలు ప్రచారం చేసేందుకు రాజ్యాంగ దినోత్సవం ఉపయోగపడుతుందని తెలిపారు. 

మరిన్ని వార్తలు