కరోనా తెచ్చిన కష్టం!

28 Mar, 2021 09:42 IST|Sakshi

సాక్షి, మహదేవ్‌పూర్‌: కరోనా మహమ్మారి ఆ గ్రామాన్ని వణికిస్తోంది. ఐదు రోజుల వ్యవధిలో 21 కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు ఈనెల 22న కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడపల్లి గ్రామానికి చెందిన ఒక విద్యార్థినికి పాజిటివ్‌గా తేలింది. మరునాడు గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధులు అనుమానంతో పీహెచ్‌సీకి వచ్చి పరీక్షలు చేయించుకోగా వారికి కూడా పాజిటివ్‌ అని నిర్ధారించారు.

దీంతో వైద్య సిబ్బంది ఈనెల 25న గ్రామానికి వెళ్లి 38 మందికి పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి, శనివారం 65 మందికి పరీక్షలు చేయగా 13 మందికి పాజిటివ్‌గా తేలింది. కాగా, ఇటీవల గ్రామంలో ‘రామాయణ కథ’ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శన చూసేందుకు మహారాష్ట్ర నుంచి వచ్చిన వారితోనే వైరస్‌ వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది.

ఊరి చివర గుడిసె.. ఒంటరిగా బాలిక
ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం తేజాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని సాలె గూడకు చెందిన ఓ గిరిజన బాలికకు కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో వైరస్‌ వ్యాప్తి చెందకుండా గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. కుటుంబ సభ్యుల సహకారంతో గ్రామ శివారులో ప్రత్యేకంగా ఓ గుడిసెను ఏర్పాటు చేసి బాలికకు అక్కడ ఆశ్రయం కల్పించారు.  
– సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్‌

మరిన్ని వార్తలు