నేటి నుంచి ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సిబ్బందికి టీకా

25 Jan, 2021 03:01 IST|Sakshi

ఒక్కో ప్రైవేట్‌ ఆసుపత్రికి ఒక్కో నోడల్‌ ఆఫీసర్‌

‘ప్రైవేట్‌’లో 50 మందికిపైగా వైద్య సిబ్బంది ఉంటే వ్యాక్సిన్‌ సెంటర్‌

మరోవైపు ప్రభుత్వ సిబ్బందికి సోమవారం మాప్‌అప్‌ రౌండ్‌ టీకామార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ 

టీకా వేసే అవకాశం ఉన్న కేంద్రాలు- 400

మొత్తం వ్యాక్సిన్‌ తీసుకోనున్న ‘ప్రైవేట్‌’ సిబ్బంది- 1,90,000

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోని వైద్య సిబ్బందికి కరోనా టీకా వేసే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. అందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రైవేట్‌లో టీకా కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ఒక్కో ఆసుపత్రికి ఒక నోడల్‌ ఆఫీసర్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం మార్గదర్శకాలు జారీచేసింది. గతంలో 100 మందికిపైగా సిబ్బంది ఉన్న ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో మాత్రమే టీకా కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించగా, తాజా మార్గదర్శకాల్లో 50 మందికి పైగా ఉన్న ఆసుపత్రుల్లోనూ టీకా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

ప్రభుత్వ సిబ్బందిలో 64 శాతం మందికి టీకా
ఈ నెల 16న ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమంలో భాగంగా మొదటగా ప్రభుత్వ వైద్య సిబ్బందికి టీకా వేసిన విషయం విదితమే. అందులో 1.10 లక్షల మంది ప్రభుత్వ సిబ్బందికి ఇప్పటిదాకా టీకాలు వేశారు. అంటే మొత్తం ప్రభుత్వ సిబ్బందిలో 64 శాతం మంది మాత్రమే టీకా తీసుకున్నారు. కొందరు టీకాను తిరస్కరించగా, కొందరు తర్వాత వేయించుకునేందుకు సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో వేయించుకోని ప్రభుత్వ సిబ్బందికి సోమవారం మాప్‌అప్‌ రౌండ్‌లో టీకా వేస్తారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో టీకా కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసేలా చూడాలని ఆసుపత్రి వర్గాలను ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు అవగాహన కల్పించాలని, టీకా సురక్షితమని తెలియజెప్పాలని సూచించింది. మొత్తం 1.90 లక్షల మంది ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి టీకా వేయనున్నారు. అందుకోసం 400 ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. 

ఇవీ మార్గదర్శకాలు...
– కోవిన్‌ పోర్టల్‌లో చేరిన అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో టీకా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అక్కడికి అవసరమైన సుశిక్షిత ప్రభుత్వ వైద్య సిబ్బందిని పంపిస్తారు. 
– ఏదైనా ప్రైవేటు ఆసుపత్రిలో 50 మంది కంటే తక్కువ సిబ్బంది ఉంటే వారికి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రులు సహా ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా వేస్తారు. అలాగే వాటికి సమీపంలో పెద్ద ప్రైవేట్‌ ఆసుపత్రి ఉంటే వాటిల్లోనూ టీకాలు వేస్తారు. 
– ప్రతీ టీకా కేంద్రంలో 100 మందికంటే ఎక్కువగా టీకా వేయకూడదు. ఆ మేరకే ప్రణాళిక రచించాలి. 
– కోవిన్‌ పోర్టల్‌లో నమోదు చేసిన తర్వాతే టీకాలు వేయాలి. ఆఫ్‌లైన్‌ పద్దతిలో వ్యాక్సినేషన్‌కు అనుమతి లేదు. 
– వ్యాక్సినేషన్‌ను ముందుగానే ప్రారంభించాలి. మధ్యాహ్నం 3 గంటలకే పూర్తి చేయాలి. అలా చేయడం వల్ల కోవిన్‌ యాప్‌లో వివరాలను నమోదు చేయడానికి సమయం దొరుకుతుంది. 
– టీకాలను బుధ, శనివారం (ఆదివారం సెలవు) మినహా మిగిలిన అన్ని రోజుల్లో వేసేలా ప్రణాళిక రూపొందించాలి. 
– ప్రతి ప్రైవేట్‌ ఆసుపత్రికి నియమితులయ్యే నోడల్‌ ఆఫీసర్‌ టీకాల కేంద్రాన్ని, తేదీలను, ఇతర సమాచారాన్ని సమన్వయం చేయాలి. అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు బాధ్యత ఆయనదే. 
– ప్రతి టీకా కేంద్రంలో సైడ్‌ఎఫెక్టŠస్‌ తలెత్తితే చికిత్స చేసేలా మెడికల్‌ కిట్‌ను అందుబాటులో ఉంచుకోవాలి.
– ప్రజా ప్రతినిధులు, ఐఎంఏ ప్రతినిధులు, ప్రైవేట్‌ ఆసుపత్రుల సంఘాలు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. 

మరిన్ని వార్తలు