అలర్ట్‌: రాష్ట్రంలో వ్యాక్సిన్‌ నిల్వలు రెండ్రోజులకే..

12 Apr, 2021 08:10 IST|Sakshi

కరోనా వ్యాక్సినేషన్‌ ఎలాగన్న ఆందోళనలో అధికారులు 

30లక్షల టీకాల కోసం కేంద్రానికి విజ్ఞప్తి 

సకాలంలో రాకుంటే వ్యాక్సినేషన్‌కు బ్రేక్‌ 

రెండో డోస్‌ టీకా వేసుకునే వారికి ఇబ్బందులు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ నిల్వలు ఖాళీ అయ్యాయి. హైదరాబాద్‌ కోఠిలో ఉన్న స్టేట్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌లో ఒక్క కరోనా టీకా కూడా నిల్వ లేదు. ఉన్నవాటిని మొత్తంగా జిల్లాలకు పంపించారు. అవి మరో రెండ్రోజుల వరకు లబ్ధిదారులకు వేయడానికి సరిపోతాయి. వెంటనే కేంద్రం నుంచి వ్యాక్సిన్లు అందకుంటే.. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి బ్రేక్‌ పడే పరిస్థితి కనిపిస్తోంది. వ్యాక్సిన్ల కోసం జిల్లాల నుంచి కలెక్టర్లు, వైద్యాధికారులు ఉన్నతాధికారులకు ఫోన్లు చేస్తున్నారు. దీనిపై ఏం చేయాలో వారికి అంతుపట్టడం లేదు. ఓ వైపు పరిస్థితి ఇలా ఉంటే.. మరోవైపు ఆదివారం నుంచి 14వ తేదీ వరకు ‘టీకాల ఉత్సవం’ చేపట్టాలని ప్రధాని మోదీ ప్రకటించడం ఏమిటని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఎన్నికలున్న రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్న రాష్ట్రాలకు వ్యాక్సిన్లు ఎక్కువగా సరఫరా అవుతున్నాయని.. ఇతర రాష్ట్రాలకు సరిగా పంపడం లేదని ఆరోపించారు.  

ఉన్నవి 4.78 లక్షల వ్యాక్సిన్లు 
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4.78లక్షల మేర వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని.. అవి రెండ్రోజుల వరకు సరిపోతాయని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు రోజూ లక్షన్నర మందికిపైగా టీకాలు వేస్తున్నారు. ఈ సంఖ్యను పెంచేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది. ఈ లెక్కన రెండు రోజులు ఓకేనని, ఆలోపు కేంద్రం టీకాలను సరఫరా చేయకపోతే.. తర్వాతి రోజు నుంచి టీకా కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయక తప్పదని అంటున్నారు. 

ఇప్పటివరకు 20 లక్షల టీకాలు 
రాష్ట్రానికి ఇప్పటివరకు 26.78 లక్షల వరకు కరోనా వ్యాక్సిన్లు వచ్చాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన సం గతి తెలిసిందే. మొదట వైద్య సిబ్బందికి, తర్వాత ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన అందరికీ టీకా వేస్తున్నారు. మరోవైపు రెండో డోస్‌ టీకా కార్యక్రమం కొనసాగుతుంది. శనివారం ఒక్కరోజు 1,53,295 మందికి మొదటి డోస్‌ వేయగా.. 9,090 మందికి రెండో డోస్‌ వేశారు. మొత్తం గా రికార్డు స్థాయిలో 1,62,385 మందికి ఒకే రోజు టీకాలు వేశారు. రాష్ట్రంలో జనవరి 16వ తేదీ నుంచి శనివారం వరకు మొత్తంగా 20,61,395 టీకాలు వేశారు. అందులో మొదటి డోస్‌ 17,61,653 టీకాలు వేయగా.. రెండో డోస్‌ 2,99,742 టీకాలు వేశారు. ఆదివారం సాయంత్రానికి మొత్తంగా 22 లక్షల మందికి టీకా వేసినట్టు అంచనా. 

టీకా కోసం క్యూలు 
కరోనా కేసులు పెరుగుతుండటంతో జనం టీకాల కోసం క్యూలు కడుతున్నారు. మొదట్లో అయిష్టత చూపిన కొందరు వైద్య సిబ్బంది కూడా టీకా కోసం ముందుకు వస్తున్నారు. దీంతో కరోనా టీకాలకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ప్రస్తుతం ప్రభుత్వంలో 944, ప్రైవేట్‌లో 232 సెంటర్లు కలిపి మొత్తంగా 1,176 కేంద్రాల్లో టీకా కార్యక్రమం జరుగుతోంది. రోజూ రెండు లక్షల టీకాలు వేయాలన్న లక్ష్యంతో వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. మొత్తం 2 వేల కేంద్రాల్లో వేసేలా ప్రణాళిక రచించింది. 

రెండో డోస్‌కూ తప్పని ఇక్కట్లు 
సర్కారు వ్యాక్సినేషన్‌ పెంచేందుకు అన్ని ఏర్పా ట్లుచేసినా.. టీకాలు లేకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. పైగా రెండో డోస్‌ టీకా కోసం ఇప్పటికే గడువు సమీపించిన లబ్దిదారుల్లో ఆందోళన కనిపిస్తోంది. కొన్నిచోట్ల రెండో డోస్‌ కోసం వచ్చే వారిని వెనక్కి పంపుతున్నారు. వ్యాక్సిన్‌ స్టాక్‌ రాకపోవడంతో కొన్ని ప్రైవేట్‌ ఆస్పపత్రుల్లో టీకా కేంద్రాలు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా 30 లక్షల టీకాలు వెంటనే వస్తే.. వ్యాక్సినేషన్‌ ఎలాంటి విఘాతం కలగకుండా మరో 15 రోజులపాటు కొనసాగుతుం దని అంటున్నారు. అయితే ప్రస్తుతం 3 లక్షల మేర టీకాలు వస్తాయన్న సమాచారం ఉందని, అందులో 2 లక్షల కోవాగ్జిన్, 1.09 లక్షల కొవిషీల్డ్‌ టీకాలు ఉన్నట్టు తెలిసిందని ఒక కీలకాధికారి తెలిపారు. అవి వచ్చినా మరో రెండ్రోజులు అదనంగా ఇవ్వొచ్చని, ఆ తర్వాత పరిస్థితి ఏమిటని పేర్కొన్నారు. కాగా ఉగాది రోజున టీకా కార్యక్రమం ఉండదని, ఆ మరుసటి రోజు నుంచి యథాతథంగా కొనసాగుతుందని నిలిపివేసినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

చదవండి: మా వ్యాక్సిన్లకు సామర్థ్యం తక్కువ.. అంగీకరించిన చైనా 

మరిన్ని వార్తలు