కూలుతున్న అక్రమ కట్టడాలు

19 Jan, 2022 01:02 IST|Sakshi

అనుమతిలేని నిర్మాణాలపై సర్కారు సీరియస్‌  

కొత్త మున్సిపాలిటీల్లో అడ్డగోలు నిర్మాణాల దందాకు చెక్‌ 

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపాలిటీలుగా మారిన గ్రామ పంచాయతీలలో సరైన అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ కట్టడాలపై సర్కారు కన్నెర్ర చేసింది. వాటిని కూల్చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీల అనుమతి పేరు చెప్పి కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గత మూడేళ్లుగా భారీ ఎత్తున నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. నెలక్రితం దుండిగల్‌లో పంచాయతీ అనుమతితో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడం విషయం వెలుగుచూడడంతో పురపాలక శాఖ సీరియస్‌ అయింది.

మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ ఇతర అధికారులు సమావేశమై రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. గ్రామ పంచాయతీ నుంచి గతంలో నిర్మాణ అనుమతి పొందినప్పటికీ, మున్సిపాలిటీలు లేదా కార్పొరేషన్లుగా మారాక ఆయా ప్రాంతాల్లో తిరిగి సంబంధిత విభాగాల అనుమతి పొందాలని, లేని పక్షంలో కూల్చివేస్తామని ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

ఈ క్రమంలో సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే పురపాలక శాఖ అధికారులు అక్రమ భవన నిర్మాణాలపై చర్యలు ప్రారంభించారు. ఆయా జిల్లాల టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు సోమవారం నుంచే భవన నిర్మాణాల కూల్చివేతకు శ్రీకారం చుట్టాయి. హైదరాబాద్‌ శివార్లలోని జిల్లాల్లో ముందుగా 600 చదరపు గజాల విస్తీర్ణానికి మించి ఉన్న అక్రమ నిర్మాణాలపై ఆయా జిల్లాల టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు చర్యలకు దిగాయి. కూల్చివేతలను మంగళవారం సైతం కొనసాగించారు.  

ఇతర జిల్లాల్లో సైతం భారీగా అక్రమ కట్టడాలు 
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల్లో రెండేళ్ల కాలంలో నిర్మించిన, నిర్మిస్తున్న కట్టడాల డేటాను అధికారులు సేకరించారు. ఈ మేరకు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, రామగుండం, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు వాటికి ఆనుకొని ఉన్న కొత్త మున్సిపాలిటీల్లో కూడా గ్రామ పంచాయతీ అనుమతి పేరిట భారీగా నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు.

వ్యక్తిగత నివాస భవనాలతో పాటు కళాశాలలు, హాస్టళ్లు, స్కూళ్లను బహుళ అంతస్తుల్లో నిర్మించినట్లు కనుగొన్నారు. వీటిలో స్థానిక పట్టణ అథారిటీ, డీటీసీపీ అనుమతి లేకుండా సాగిన నిర్మాణాలన్నింటినీ కూల్చివేయాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు పురపాలక శాఖ అధికారి ఒకరు తెలిపారు.  

మరిన్ని వార్తలు