మాఫీ.. వారంతా హ్యాపీ

9 Aug, 2021 08:09 IST|Sakshi

సాక్షి, చేవెళ్ల( రంగారెడ్డి): రుణమాఫీ రెండో విడతకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈనెల 16వ తేదీ నుంచి రూ.50వేల రుణాలు ఉన్నవారికి మాఫీ వర్తింపచేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన మంత్రల కేబినెట్‌ సమాశంలో రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. జిల్లాలో అర్హత సాధించిన రైతుల్లో 30–40 శాతానికిపైగా రెండో విడతలో లబ్ధి పొందే అవకాశం ఉంది. ఎన్నో రోజులుగా ఊరిస్తున్న రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. 
► ప్రభుత్వం ఎన్నికలకు ముందు 2014 ఏప్రిల్‌ 1 నుంచి 2018 డిసెంబర్‌ 11 నాటికి బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన రైతులకు కుటుంబానికి రూ.లక్ష వడ్డీతో కలుపుకొని నాలుగు విడుతల్లో మాఫీ చేస్తామని ప్రకటించింది.   
► దీని ప్రకారం గత ఏడాది తొలివిడత రూ.25వేల లోపు రుణం ఉన్న రైతులకు వర్తింపచేశారు.  
► ఇది జిల్లాలోని 10 శాతం మంది రైతులకు మాత్రమే వర్తించింది.  కొంతమంది అర్హులైన వారికి పలు కారణాలతో వర్తించ లేదు. 
► రుణాలు పొందిన రైతులు మాఫీ వస్తుందని బ్యాంకులకు బాకీలు కట్టడం మానేశారు.  
► ప్రభుత్వం రుణమాఫీ ఎప్పుడిస్తోందో తెలియక బ్యాంకర్లు బాకీలు కట్టాలని రైతులపై ఒత్తిడి చేయడం పరిపాటిగా మారింది. 
► రెండో విడత రుణమాఫీపై ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చింది ప్రభుత్వం.  
► ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతుండటంతో వెంటనే రెండో విడత రుణమాఫీ విడుదలపై నిర్ణయం తీసుకుంది.   
► ఈ నెల 16నుంచి రైతుల ఖాతాల్లోకి పంట రుణమాఫీ డబ్బులు జమ చేయనున్నట్లు ప్రకటించడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.  

ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత..  
► జిల్లాలో మొత్తం 1,46,417 మంది రైతులు రుణమాఫీ పొందేందుకు అర్హులని అధికారులు గుర్తించారు.   
► ఇందులో మొదటి విడతలో రూ.25వేల లోపు రుణాలున్న పది శాతం మందికి మాత్రమే వర్తించింది. 
► ఇప్పుడు రెండో విడతలో రూ.50వేల లోపు రుణాలున్న రైతులకు మాఫీ చేసేందుకు నిర్ణయించడంతో 30 నుంచి 40 శాతం మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుందని అంచనా వేస్తున్నారు.  
► రూ.50 వేల లోపు ఉన్న రైతులకు సంబంధించి రెండో విడతలో అమలు చేసేందుకు బ్యాంకర్ల నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు.  
► ఒకటి, రెండు రోజుల్లో జిల్లావ్యాప్తంగా పక్కా సమాచారం అందుతుందని జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి తెలిపారు.   
► జిల్లాలో మొదటి విడతలో రూ.25వేల లోపు రుణాలున్న వారిని 17,943 మందిగా గుర్తించగా ఇందులో 10,928 మందికిగాను రూ.16.73కోట్లు విడుదల చేసింది.  
► మిగతావారికి వివిధ కారణాలతో రుణమాఫీ వర్తించలేదు. వారికి ఇప్పుడు రెండో విడతలో వడ్డీతో కలుపుకొని రూ.50వేలలోపు రుణమాఫీ కానుందని అధికారులు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు