తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్‌.. డోసులు 4 కోట్లు

10 Dec, 2021 04:06 IST|Sakshi

రాష్ట్రంలో ముమ్మరంగా కరోనా వ్యాక్సినేషన్‌

94 శాతం మందికి తొలి డోస్, 51 శాతం మందికి రెండో డోస్‌ పూర్తి

ప్రజలు, వైద్య సిబ్బందికి మంత్రి హరీశ్‌రావు అభినందనలు  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నాలుగు కోట్ల మైలురాయిని చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నాటికి మొదటి, రెండో డోస్‌లు కలిపి అర్హులైన లబ్ధిదారులకు 4,02,79,015 కరోనా టీకాల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు, వైద్య సిబ్బందికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ఇప్పటికీ ఇంకా టీకాలు తీసుకోని లబ్ధిదారులు వెంటనే తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో టీకాలు తీసుకునేందుకు 18 ఏళ్లు వయసు పైబడిన అర్హులు 2.77 కోట్ల మంది ఉండగా అందులో 2.62 కోట్లమంది (94 శాతం)కి మొదటి డోస్, 1.40 కోట్ల మంది (51 శాతం)కి రెండో డోస్‌ అందించినట్లు వేసినట్లు ప్రజారోగ్య సంచాల కుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో నూరు శాతం మొదటి డోస్‌ వ్యాక్సిన్లు వేయగా, కొమురం భీం జిల్లాలో అత్యంత తక్కువగా 80 శాతం మందికి వేశారు. ఇక రెండో డోస్‌ హైదరాబాద్‌లో 76 శాతం, కరీంనగర్‌ జిల్లాలో 75 శాతం, రంగారెడ్డి జిల్లాలో 72 శాతం మందికి వేశారు. అత్యంత తక్కువగా కొమురం భీం జిల్లాలో 17 శాతం మంది రెండో డోస్‌ తీసుకున్నారు. 

వ్యాక్సినేషన్‌లో ముఖ్యాంశాలు... 
165: రాష్ట్రంలో కోటి టీకాలు వేయడానికి పట్టిన రోజులు. 
78: కోటి నుంచి 2 కోట్ల వరకు డోస్‌లు వేయడానికి పట్టిన రోజులు. 
27: 2 కోట్ల నుంచి 3 కోట్ల డోస్‌లు వేయడానికి పట్టిన రోజులు. 
38: 3 కోట్ల డోస్‌ల నుంచి 4 కోట్ల డోస్‌లకు చేరుకోవడానికి పట్టిన కాలం. 
57.80 లక్షలు: ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కరోనా టీకా డోస్‌లు. 
180: కరోనా టీకాలు వేసేందుకు పనిచేసిన మొబైల్‌ టీమ్‌ల సంఖ్య. 
35,000: వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగస్వాములవుతున్న సిబ్బంది సంఖ్య. 
24 గంటలు: పగలూరాత్రీ నిరంతరం వ్యాక్సిన్‌ కేంద్రంగా పనిచేస్తున్న హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని కాజాగూడ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌. త్వరలోనే మరొకటి ప్రారంభం కానుంది.   

మరిన్ని వార్తలు