Bathukamma: 25 నుంచి బతుకమ్మ ఉత్సవాలు 

20 Sep, 2022 03:04 IST|Sakshi

విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ తెలిపారు. ఈనెల 25 నుంచి అక్టోబర్‌ 3 వరకు జరగనున్న బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై సోమవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో సమీక్ష నిర్వహించారు. సద్దుల బతుకమ్మ జరిగే అక్టోబర్‌ 3న ట్యాంక్‌బండ్‌ వద్ద విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

బతుకమ్మ ఘాట్, ట్యాంక్‌ బండ్, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలన్నారు. ఎల్బీ స్టేడియం, నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మ లోగోలను ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్‌ నిర్వహణ, ట్యాంక్‌ బండ్‌ వద్ద విద్యుత్‌ దీపాలంకరణ, బారికేడింగ్, మంచినీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్స్‌ సరఫరా, మొబైల్‌ టాయిలెట్స్, నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రసార మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. మహిళలు ఉత్సవాల్లో భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశమున్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను నియమించాలన్నారు. బతుకమ్మ పండుగపై ఆకర్షణీయమైన డిజైన్లతో మెట్రో పిల్లర్లను అలంకరించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలు 25 నుంచి ప్రారంభం కానున్నాయని, బతుకమ్మ ఉత్సవాలు కూడా అదే రోజున ప్రారంభం అవుతాయని తెలిపారు.   

మరిన్ని వార్తలు