గ్రూప్‌–1 పరీక్షకు ఏర్పాట్లు చేయండి

12 Oct, 2022 01:31 IST|Sakshi

కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పరీక్ష నిర్వహణపై మంగళవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌ నుంచి జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ బి.జనార్దన్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు పాల్గొన్నారు.

ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా 1,019 కేంద్రాల్లో 3.8 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు సీఎస్‌ వివరించారు. స్ట్రాంగ్‌రూమ్‌లను గుర్తించి పోలీసు రక్షణ ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి పరీక్షాకేంద్రాల వద్ద తాగునీరు, పారిశుధ్యం వంటి ఏర్పాట్లు చేయాలన్నారు.

స్ట్రాంగ్‌రూమ్‌ ఇన్‌చార్జీలు, రూట్‌ ఆఫీసర్లు, లైజన్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ లైజన్‌ ఆఫీసర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్లు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఇచ్చిన చెక్‌ లిస్ట్‌ ప్రకారం సూచనలను పాటించాలని ఆదేశించారు. టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్‌రూం కూడా ఏర్పాటు చేయాలన్నారు. ప్రిలిమినరీ టెస్ట్‌ కోసం అభ్యర్థులు హాల్‌టికెట్లను టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

అభ్యర్థులు చివరి నిమిషంలో కాకుండా నిర్ణీత సమయం కంటే ముందుగానే పరీక్షాకేంద్రానికి చేరుకోవాలన్నారు. టెలికాన్ఫరెన్స్‌లో టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్, జీఏడీ సెక్రటరీ శేషాద్రి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు