యాదాద్రీశుడిని దర్శించుకున్న సీఎస్‌

20 Nov, 2021 04:49 IST|Sakshi
సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న పూజారులు  

మార్చి నాటికి ఆలయ పనులు పూర్తవుతాయని వెల్లడి  

యాదగిరిగుట్ట: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ శుక్రవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. బాలాలయం వద్ద సోమేశ్‌కు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రతిష్టా బంగారు కవచమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజలు చేశారు. సీఎస్‌కు ఆలయ ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి లడ్డూ ప్రసాదం అందజేశారు.

అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సోమేశ్‌ ప్రధానాలయ పునఃనిర్మాణ పనులను పరిశీలించారు. కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రజలంతా క్షేమంగా ఉండాలని స్వామిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.  ఇప్పటికే ప్రధానాలయం దాదాపు పూర్తయిందని, కొండ కింద రోడ్లు, తదితర పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి 28న జరిగే ప్రధానాలయ ఉద్ఘాటన సమయానికి పనులన్నీ పూర్తవుతాయని చెప్పారు.  

మరిన్ని వార్తలు