‘స్మాల్‌ క్రెడిట్‌–బడ్డీ క్యాష్‌’ యాప్‌ను నమ్మొద్దు

15 Jan, 2023 01:34 IST|Sakshi

మోసపూరితమైనదని ప్రకటించిన పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ లోన్‌యాప్‌ల దురాగతాలు కొనసాగుతూనే ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు చాలామంది యువత, నిరుద్యోగులు, చిరు వ్యాపారులు ఈ లోన్‌యాప్‌లకు చిక్కుకుంటున్నారు. తమకు తెలియకుండానే ఈ యాప్‌లకు వ్యక్తిగత సమాచారం, ఇతర వివరాలు ఇస్తున్నారు. అప్పు తీర్చిన తర్వాత కూడా ఈ యాప్‌ నిర్వాహకులు అదనపు డబ్బు కోసం మానసికవ్యథకు గురిచేస్తున్నారు.

అయితే, ఇదే తరహాకు చెందిన ఒక యాప్‌ గురించి తెలంగాణ సైబర్‌ క్రైం పోలీసు విభాగం హెచ్చరిక జారీ చేసింది. ‘స్మాల్‌ క్రెడిట్‌–బడ్డీ క్యాష్‌’యాప్‌ మోసపూరితమైందని సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ ట్విట్టర్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ను పెట్టింది. ‘ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటే మీ వ్యక్తిగత వివరాలు దొంగిలించి, మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర నుంచి డబ్బులు కాజేస్తారు’అని ఆ ట్వీట్‌లో సైబర్‌ క్రైం పోలీసులు పేర్కొన్నారు. సైబర్‌ క్రైం ఫిర్యాదులకుగాను 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయాలని వారు సూచించారు.   

>
మరిన్ని వార్తలు