QR Code Scam: కాల్‌ చేసి స్కాన్‌ చేయాలని తొందరపెడుతున్నారా? పిన్‌ కూడా ఎంటర్‌ చేయమని ఒత్తిడి చేస్తున్నారా?

21 Jan, 2023 01:52 IST|Sakshi

గందరగోళానికి గురిచేసి, కంగారు పెడుతూ దోపిడీ 

క్యూఆర్‌ కోడ్‌ పంపి స్కాన్‌ చేయాలని, పిన్‌ ఎంటర్‌ చేయమంటూ ఒత్తిడి 

నేరగాళ్లు చెప్పినట్టు చేసి మోసపోతున్న జనం 

నగదు మన బ్యాంకు ఖాతాలోకి రావాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ క్యూఆర్‌ కోడ్‌ చేయకూడదంటున్న నిపుణులు 

కొండాపూర్‌కు చెందిన స్వామినాథన్‌ తన 3 బీహెచ్‌కే ఇంటిని నెలకు రూ.20 వేలకు అద్దెకు ఇస్తానంటూ రియల్‌ ఎస్టేట్‌ వెబ్‌సైట్‌లో యాడ్‌ ఇచ్చారు. రెండురోజుల తర్వాత ఒక వ్యక్తి తాను సీఐఎస్‌ఎఫ్‌ అధికారి రాజ్‌దీప్‌సింగ్‌ అని, తనకు పుణే నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయ్యిందంటూ పరిచయం చేసుకున్నాడు.

ఇంటి అద్దె అడ్వాన్స్‌ చెల్లిస్తానని చెప్పి తొలుత కొంత డబ్బు పంపాడు. ఆ తర్వాత మిగతా డబ్బు పంపిస్తానంటూ స్వామినాథన్‌ను గందరగోళానికి గురిచేసి, తాను పంపిన క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి, పిన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలంటూ తొందరపెట్టాడు. స్వామినాథన్‌ అలానే చేయడంతో అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.2.5 లక్షలు అవతలి వ్యక్తికి బదిలీ అయిపోయాయి.  

బల్క్‌ ఆర్డర్ల పేరిట ఒకేసారి 20 ఫ్రిజ్‌లు కావాలని ఓ షోరూం నిర్వాహకులకు ఒక అపరిచిత వ్యక్తి కాల్‌ చేశాడు. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తానంటూ వాళ్లు 
పంపిన క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తొలుత కొంత డబ్బు పంపాడు. ఆ తర్వాత మరోసారి డబ్బులు పంపించానని, ఆ నగదు మధ్యలో ఆగిపోయిందని చెబుతూ తాను పంపే క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి పిన్‌ ఎంటర్‌ చేయాలంటూ కంగారు పెట్టాడు. అతడు చెప్పినట్టు చేసిన షోరూం నిర్వాహకులు రూ.10 లక్షలు పోగొట్టుకున్నారు.  

సాక్షి, హైదరాబాద్‌: నగదు లావాదేవీల్లో భాగంగా ఆన్‌లైన్‌ చెల్లింపులు పెరిగిపోయాయి. కొందరు అసలు నగదు అనే మాటే లేకుండా లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనే చేసేస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని సైబర్‌ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతూ డబ్బులు కొల్లగొడుతున్నా­రు. ఆన్‌లైన్‌ పరిజ్ఞానం అంతగా లేని అమాయకుల్ని మాటలతో మభ్యపెట్టి, గందరగోళానికి గురిచేసి, కంగారు పెట్టేస్తూ బోల్తా కొట్టిస్తున్నారు.

రెగ్యులర్‌గా ఆన్‌లైన్‌ లావాదేవీలు నిర్వహించే వారు కూడా కొన్నిసార్లు వీరి బారిన పడుతూ వేలు, లక్షల రూపాయలు నష్టపోతున్నారు. కేటుగాళ్లు కూర్చున్న చోటు నుంచి కదలకుండానే తమ జేబులు నింపుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు అనుసరిస్తున్న సైబర్‌ నేరగాళ్లు.. తాజాగా క్యూఆర్‌ (క్విక్‌ రెస్పాన్స్‌) కోడ్‌ స్కానింగ్‌తో చేసే చెల్లింపులు ఆధారంగా చేసుకుని బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.  

సరికొత్త మోసం.. క్యూరిషింగ్‌ 
ఇటీవలి కాలంలో క్యూఆర్‌ కోడ్‌ వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. జేబులో నగదు ఉండాల్సిన పనిలేదు. బ్యాంకులో డబ్బు, చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు. పెద్ద షోరూంలు మొదలుకుని చిన్న కిరాణా షాపుల్లో కూడా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం ద్వారా చెల్లింపులు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. నగదు చెల్లింపులకే కాదు..

పెద్ద కంపెనీలు తమ వెబ్‌సైట్లు, బిజినెస్‌ కార్డులు, బ్రోచర్లు, ఇలా ప్రతి సమాచారమూ స్కాన్‌ చేస్తే చాలు వచ్చేలా క్యూఆర్‌ కోడ్‌ ఆప్షన్‌ ఇస్తున్నాయి. దీంతో సైబర్‌ దోపిడీగాళ్లు క్యూఆర్‌ కోడ్‌పై దృష్టి పెట్టారు. దీన్ని వినియోగిస్తూ బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును, అది కుదరకపోతే ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని కొట్టేస్తున్నారు. ఈ సరికొత్త సైబర్‌ మోసాన్ని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు క్యూరిషింగ్‌గా చెబుతున్నారు.  

అప్రమత్తంగా వ్యవహరించాలి
క్యూఆర్‌ కోడ్‌ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని నిపుణు­లు సూచిస్తున్నారు. ‘సైబర్‌ నేరగాళ్లు క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా మోసాలకు పా­ల్పడుతున్నారు. నకిలీ క్యూఆర్‌ కోడ్‌లను సృష్టిస్తున్నారు. వీటిని ఉపయోగించి మన వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నారు. అనుమానాస్పద క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేసినప్పుడు మనకు తెలియకుండానే మన మొబైల్‌ ఫోన్‌లోకి కొన్ని సాఫ్ట్‌వేర్స్‌ ఇన్‌స్టాల్‌ అవుతుంటాయి. లేదంటే క్యూఆర్‌ కోడ్‌ను మనం స్కాన్‌ చేయగానే మనల్ని అవి అన్‌సేఫ్‌ (సైబర్‌ నేరగాళ్ల అధీనంలో ఉండే) వెబ్‌సైట్లలోకి తీసుకెళ్లేలా యూఆర్‌ఎల్‌ లింకులు జత చేసి ఉంటున్నాయి’అని చెబుతున్నారు. 

క్యూఆర్‌ కోడ్‌ మోసాలకు ఇక్కడే ఎక్కువ..  
►గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం, ఫ్రీ రీచార్జ్‌ వంటి యూపీఐ యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌లలో జరిగే లావాదేవీలను నేరగాళ్లు టార్గెట్‌ చేస్తున్నారు.  

►వెబ్‌సైట్‌లో వస్తువుల అమ్మకాల విషయంలో ఎక్కువగా ఈ తరహా మోసాలు జరుగుతున్నాయి. 

►కోవిడ్‌ వెరిఫికేషన్‌ పేరిట కూడా సైబర్‌ నేరగాళ్లు ఫేక్‌ క్యూఆర్‌ కోడ్‌లను పోస్ట్‌ చేస్తున్నారు.  

► బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్కింగ్‌ ప్రదేశాల్లో, ఇతర కంపెనీలకు సంబంధించిన క్యూఆర్‌ కోడ్‌ పోస్టర్లపైనా నకిలీ క్యూఆర్‌ కోడ్‌ లింక్‌లు పెడుతున్నారు.  

ఇలా చేస్తే మేలు..  
►అపరిచితులు పంపే ఈ మెయిల్స్, వాట్సాప్, ఇతర డాక్యుమెంట్లలోని క్యూఆర్‌ కోడ్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ స్కాన్‌ చేయవద్దు. 

►క్యూఆర్‌ కోడ్‌ కింద రాసి ఉన్న యూఆర్‌ఎల్‌ లింక్, మనం స్కాన్‌ చేసిన తర్వాత వచ్చిన వివరాలు ఒకేలా ఉన్నాయా లేదా? అన్నది సరిచూసుకోవాలి. 

►యూపీఐ ఐడీలు, బ్యాంక్‌ ఖాతాల వివరాలు అపరిచితులతో ఎట్టిపరిస్థితుల్లో షేర్‌ చేసుకోవద్దు.  

►ఓఎల్‌ఎక్స్‌ లేదా ఇతర వెబ్‌సైట్లలో వస్తువుల క్రయ, విక్రయాలు చేసేటప్పుడు వీలైనంత వరకు ఆన్‌లైన్‌ చెల్లింపుల కంటే నగదు లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వాలి.  

ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో తొందరపడొద్దు 
ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లలో కొనుగోళ్లు చేసేటప్పుడు తొందరపడొద్దు. అవతలి వ్యక్తులు మనల్ని క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయాలని, పిన్‌ ఎంటర్‌ చేయాలని గందరగోళ పెడుతున్నట్లయితే అది మోసమని గ్రహించాలి. మనకు పంపే క్యూఆర్‌ కోడ్‌ను గమనించినా..మన బ్యాంకు ఖాతా నుంచే డబ్బులు కోతకు గురవుతాయని గుర్తించవచ్చు. 
– బి.రవికుమార్‌రెడ్డి, డీఎస్పీ, సీఐడీ సైబర్‌ క్రైమ్స్‌  

మరిన్ని వార్తలు