Dalit Bandhu: మళ్లీ ఎమ్మెల్యేలకే పగ్గాలు! 

18 Apr, 2022 03:28 IST|Sakshi

ఎమ్మెల్యేలకు ఎంపిక బాధ్యతలపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత

సాక్షి, హైదరాబాద్‌: దళితబంధు లబ్ధిదారుల ఎంపికను ఈసారి కూడా ఎమ్మెల్యేలకే అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ ప్రతిపాదనలు రూపొందిస్తోంది. 2021–22 సంవత్సరంలో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు 100 యూనిట్లు మంజూరు చేయగా సంబంధిత శాసనసభ్యులే ప్రత్యేక చొరవతో లబ్ధిదారుల ఎంపిక చేపట్టారు.

ఈసారి ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 1,500 యూనిట్లు మంజూరు చేయడంతో ఈ దఫా కూడా ఎమ్మెల్యేలకు ఎంపిక బాధ్యత అప్పగిస్తే బాగుంటుందని ప్రభుత్వానికి ఎస్సీ కార్పొరేషన్‌ సూచిస్తోంది. కార్యాచరణ ప్రణాళికలో ఎమ్మెల్యేల ద్వారా ఎంపికకు ప్రాధాన్యం ఇవ్వాలంటోంది. అయితే ఎమ్మెల్యేలకు ఎంపిక బాధ్యతపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 

పథకానికి అనూహ్య స్పందన రావడంతో.. 
2021–22లో తొలుత హుజూరాబాద్‌లో, ఆ తర్వాత మరో 4 మండలాల్లో దళితబంధు పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 100 చొప్పున యూనిట్లు మం జూరు చేసి లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించింది. యుద్ధ ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా ఆదేశించారు.

దీంతో దాదాపు నెల వ్యవధిలో  అన్ని నియోజకవర్గాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్యను 100 నుంచి 1,500కు పెంచింది. ఈ బడ్జెట్‌లో  పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించింది. హుజూరాబాద్‌ మినహా మిగతా 118 అసెంబ్లీ సెగ్మెంట్లలో పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. 

ఉన్నతాధికారులకు బాధ్యతలు ఇవ్వాలంటూ.. 
వాస్తవానికి ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు. ఎమ్మెల్యేలు సైతం పేర్లను ఎంపిక చేసి ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించారు. అయితే ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉంటున్న వ్యక్తులకే దళితబంధు కట్టబెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యేలకు కాకుండా ప్రభుత్వ అధికారులకే బాధ్యతలు ఇవ్వాలని కొందరు  సూచనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.   

మరిన్ని వార్తలు