దళితబంధు నిధుల విడుదల: వాసాలమర్రిలో కొత్త పండుగ! 

6 Aug, 2021 11:29 IST|Sakshi
వాసాలమర్రి దళితవాడలో సంబరాలు 

దళితబంధు అమలుతో ఊరంతా సంబరాలు 

సాక్షి, యాదాద్రి, తుర్కపల్లి:  ‘దళితబంధు’ పథకం అమలుతో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో పండుగ వాతావరణం నెలకొంది. బుధవారం గ్రామంలోని దళిత కుటుంబాలతో సమావేశమైన సీఎం కేసీఆర్‌.. వాసాలమర్రిలోనే దళితబంధు పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారులు గురువారం సాయంత్రం గ్రామంలోని దళితులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రా«థమిక వివరాలను సేకరించారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకునే యూనిట్ల గ్రౌండింగ్, శిక్షణ అనంతరం వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమ చేయనున్నారు. వీలైనంత త్వరగా సొమ్ము జమ చేస్తామని కలెక్టర్‌ ప్రకటించారు. 

డప్పు దరువులతో కోలాహలం 
వాసాలమర్రి గ్రామంలోని దళితులు గురువారం ఉదయం నుంచే సంబరాల్లో మునిగారు. వ్యవసాయం, రోజుకూలి, ఇతర పనులకు వెళ్లేవారు గ్రామంలోనే ఉండిపోయారు. సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు పాలతో అభిషేకాలు చేశారు. పూలమాలలు వేశారు. గ్రామ సర్పంచ్‌ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ సభ్యుడు పలుగుల నవీన్‌తోపాటు దళితులంతా  రంగులు చల్లుకున్నారు. డప్పుదరువులతో కోలాటం ఆడారు. కేసీఆర్‌ను స్తుతిస్తూ బతుకమ్మ పాటలు పాడారు. బాణసంచా కాల్చారు. మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి కేసీఆర్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. ‘దళితబంధు’తో తమ బతుకులు మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం కనిపించింది. 

కూరగాయల సాగు చేస్తాం.. 
దళితుల బతుకుల్లో వెలుగులు నింపుతున్న అభినవ అంబేడ్కర్‌ కేసీఆర్‌. మా అమ్మ కూరగాయలు అమ్ముతుంటుంది. దళితబంధు నిధులతో మా ఎకరం భూమిలో బోరు వేసుకొని, డ్రిప్‌ పద్ధతిలో కూరగాయల సాగు చేసుకుంటాం. పాడి పశువులు పెంచాలన్న ఆలోచనలో ఉన్నాం.  – చెన్నూరి మమత, బీటెక్‌ 

వ్యాపారం చేయాలని ఉంది 
కేసీఆర్‌ సార్‌ మా ఇంటికొచ్చి నా భుజం మీద చెయ్యి వేసి మాట్లాడిండు. మా సంగతులన్నీ చెప్పిన. వ్యాపారం చేస్తనన్న. ‘ఆలోచించి ముందుకు దిగు. పైసా పైసా పెరిగేటట్టు చూసుకో. నీ బతుకు మారుతది’ అని ఓ అన్న లెక్క చెప్పిండు. దళిత బంధు పైసలతో వ్యాపారం చేసి ఆర్థికంగా స్థిరపడతా.  –బొట్టు నరేశ్‌

ఇసొంటి సీఎంను సినిమాల్లోనే చూసిన 
మేం ఆరుగురం.. చిన్న గుడిసెలో ఉంటం. చేసిన కష్టం తిండికే సరిపోతోంది. సీఎం సార్‌ మా ఇంటికి వచ్చిండు. ఇల్లు కట్టిస్త అని చెప్పిండు.పది లక్షల రూపాయలు ఇస్త ఏంచేస్తరన్నడు. అది విని నోట మాట రాలే, ఇసోంటి సీఎంను సినిమాల్లోనే చూసినం. –చెన్నూరి కవిత

మరిన్ని వార్తలు