రుణమాఫీ బిల్లులకు బ్రేక్‌ 

12 Apr, 2022 02:56 IST|Sakshi

రైతులకు ఇవ్వాల్సిన రూ. 857 కోట్ల నిధుల నిలిపివేత

అవన్నీ రూ. 37 వేల నుంచి రూ. 50 వేలలోపు మాఫీవే

నిధులు లేకపోవడమే కారణమంటున్న వ్యవసాయశాఖ 

దాదాపు 2 లక్షల మంది రైతుల ఎదురుచూపు

సాక్షి, హైదరాబాద్‌: రైతు రుణమాఫీ సొమ్ము విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. గతేడాది మాఫీ చేయాల్సిన సొమ్ములో కొంత మేరకు ఆర్థిక శాఖ నిలిపేయడమే ఇందుకు కారణం. మార్చి 31 నాటికే రూ. 50 వేలలోపు రైతుల పంట రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ. 37 వేలలోపు ఉన్న పంట రుణాలనే ప్రభుత్వం మాఫీ చేసింది. రూ. 37 వేల నుంచి రూ. 50 వేల వరకు ఉన్న రుణాల మాఫీ కోసం మరో రూ. 857 కోట్లు అవసరం ఉంది.

ఈ సొమ్ము విడుదలకు సంబంధించి ఆర్థిక శాఖకు బిల్లులు సమర్పించగా నిధుల కొరత వల్ల ఫైల్‌ నిలిచిపోయిందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో ప్రభుత్వం రెండోదశ రుణమాఫీ కూడా ఇప్పటివరకు పూర్తి చేయలేకపోయింది. మరోవైపు తమకు మాఫీ సొమ్ము బ్యాంకు ఖాతాల్లో రాలేదంటూ అనేక మంది రైతులు వ్యవసాయశాఖ చుట్టూ తిరుగుతున్నారు. 

మాఫీ అయింది రూ.1,144.38 కోట్లే... 
2018 ఎన్నికల సమయంలో రూ. లక్ష వరకు ఉన్న రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చింది. దీని ప్రకారం మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ. 19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ నాలుగేళ్లలో రుణమాఫీ కోసం రూ. 20,164.20 కోట్లు కేటాయించినా అందులో కేవలం రూ. 1,144.38 కోట్లనే విడుదల చేసింది. వాటితో 5.66 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయగా మరో 31 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. 2020లో రూ. 25 వేలలోపు రుణాల కోసం రూ. 408.38 కోట్లు రుణమాఫీకి బదిలీ చేసింది.

2021 ఆగస్టులో రూ. 25 వేల నుంచి రూ. 50 వేల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం రూ. 1,790 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు రూ. 25 వేల నుంచి రూ. 37 వేల లోపు రైతులకు చెందిన రూ. 763 కోట్ల రుణాలనే మాఫీ చేసింది. ఇంకా రూ. 1,027 కోట్ల నిధులు అందించి రైతులకు మాఫీ చేయాల్సి ఉంది. అందులో రూ. 857 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండగా మిగిలిన వాటికి బిల్లులు ఇవ్వాల్సి ఉంది. 
 

మరిన్ని వార్తలు