ఎలక్ట్రానిక్‌ క్లస్టర్లు... ఎనర్జీ పార్కులు

22 Aug, 2021 01:55 IST|Sakshi

ఎలక్ట్రానిక్స్‌ రంగానికి గమ్యస్థానంగా తెలంగాణ

ఆరేళ్లలో రూ. 23 వేల కోట్లకుపైగా పెట్టుబడులు

వచ్చే నాలుగేళ్లలో రూ. 73 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యం  

సాక్షి, హైదరాబాద్‌: ఎలక్ట్రానిక్స్‌ పరిశోధన, అభివృద్ధి, తయారీ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో వస్తున్న పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కూడా ఎలక్ట్రానిక్స్‌ రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2016లోనే ఎలక్ట్రానిక్స్‌ పాలసీని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం... పెట్టుబడులు, ప్రోత్సాహకాలకు సంబంధించి ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశంలో ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగంలో తెలంగాణ వాటా ప్రస్తుతం 7 శాతంకాగా వచ్చే నాలుగేళ్లలో అగ్రస్థానానికి చేరాలని భావిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఎలక్ట్రానిక్‌ క్లస్టర్లు, ఈవీ పార్కులకు తోడుగా కొత్త ఎలక్ట్రానిక్‌ క్లస్టర్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు అవసరమైన మౌలికవసతులను మెరుగుపరచడం ద్వారా వచ్చే నాలుగేళ్లలో రూ. 73 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని, 3 లక్షల ఉద్యోగాలు లభించేలా చూడాలని భావిస్తోంది. ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌ డిజైన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ (ఈఎస్‌డీఎం) హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు తెలంగాణ నైపుణ్య శిక్షణ అకాడమీ (టాస్క్‌) ద్వారా యువతకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

కొత్తగా ఈవీ క్లస్టర్లు, ఎనర్జీ పార్కులు... 
ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్‌ వాహన రంగం కోసం ప్రస్తుతం రాష్ట్రంలో ఔటర్‌ రింగురోడ్డు సమీపంలోని రావిర్యాలలో ‘ఈ–సిటీ’, మహేశ్వరంలో హార్డ్‌వేర్‌ పార్క్‌ 912 ఎకరాల్లో ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఎల్‌ఈడీ పార్కులో 10 సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించగా ఈవీ, ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమల అవసరాల కోసం మరో 3 కొత్త పార్కులు/క్లస్టర్లు ఏర్పాటు ప్రక్రియ కొలిక్కి వస్తోంది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లిలో ఎలక్ట్రిక్‌ వాహనాల విడిభాగాల కోసం ఈవీ క్లస్టర్‌ను టీఎస్‌ఐఐసీ అభివృద్ధి చేస్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లిలోనూ 378 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఎనర్జీ పార్కు ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ పార్కులో లిథియం–అయాన్‌ బ్యాటరీలు, సోలార్‌ సెల్స్, మాడ్యూల్స్‌ తయారీ యూనిట్లు ఏర్పాటవుతాయి. కొత్తగా దుండిగల్‌లోనూ 511 ఎకరాల్లో కొత్త ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ను టీఎస్‌ఐఐసీ ప్రతిపాదించింది. వాటితోపాటు ప్రపంచస్థాయి ప్రమాణాలతో ప్రొటోటైపింగ్, టెస్టింగ్‌ వసతులతో కూడిన కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ ఏర్పాటు కానుంది. 

ఏడాదిలోనే రూ. 4,500 కోట్ల పెట్టుబడులు... 
ఎలక్ట్రానిక్స్‌ రంగంలో పేరొందిన ఇంటెల్, మైక్రాన్, క్వాల్‌కామ్, మోటరోలా, ఏఎండీ, సిడాక్, యాపిల్‌ వంటి కంపెనీలతోపాటు మైక్రోమ్యాక్స్, స్కైవర్త్, ఒప్పో, వన్‌ప్లస్‌ వంటి మొబైల్‌ఫోన్‌ తయారీ కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. గతేడాది ఎలక్ట్రానిక్స్‌ రంగంలో రూ. 4,500 కోట్ల పెట్టుబడులతోపాటు 15 వేల మందికి ఉపాధి లభించినట్లు పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన కంపెనీలు కార్యకలాపాలను విస్తరిస్తుండటంతో ఐదేళ్లపాటు విద్యుత్‌పై 25 శాతం, పెట్టుబడులపై 20 శాతం చొప్పున సబ్సిడీ, ఏడేళ్లపాటు జీఎస్టీలో 100 శాతం మినహాయింపులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమల్లో మూడు షిఫ్టుల్లో మహిళలు పనిచేసేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు