Telangana: సంక్షేమం.. ‘సప్త’పథం

2 Jun, 2021 05:51 IST|Sakshi

ఏడేళ్ల పాలనపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రగతి నివేదన 

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు.. 

పింఛన్లకే ఏటా రూ.10 వేల కోట్లకుపైగా ఖర్చు 

16 వేల మెగావాట్లకు పైగా విద్యుత్‌ సామర్థ్యం 

ఏడేండ్లలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 5 వేల వరకు అదనపు బెడ్లు 

ఇప్పటివరకు రైతు బంధు కింద రూ.35 వేల కోట్లకుపైగా సాయం 

సాక్షి, హైదరాబాద్‌:  ‘తెలంగాణ.. ఏర్పాటైన ఏడేళ్లలోనే ప్రగతి పథంలో దూసుకుపోయింది. సంక్షేమం, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, పరిశ్రమలు, వైద్యారోగ్య రంగం, విద్య, ఉద్యోగాలు.. ఇలా ప్రతి రంగంలో దేశంలో ఏ రాష్ట్రానికీ తీసిపోని విధంగా ఏడేళ్ల అభివృద్ధి ప్రస్థానం కొనసాగింది. 2014–15తో పోలిస్తే 2021–22 నాటికి అన్ని రంగాల్లోనూ పురోగతి కనిపిస్తోంది. ఇదంతా ఏడేండ్ల స్వతంత్ర పాలన.. రాష్ట్రం విషయంలో చిత్తశుద్ధి ఇచ్చిన ఆలంబన’.. అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ఏర్పాటై ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రం సాధించిన అభివృద్ధి, విజయాలపై సోమవారం ప్రగతి నివేదన పత్రాన్ని విడుదల చేసింది. అందులోని ప్రధాన అంశాలివీ.. 


సంక్షేమానికి ప్రాధాన్యం 
రాష్ట్రంలో 39,07,818 మందికి ప్రతి నెలా ఆసరా పింఛన్లు అందుతున్నాయి. ప్రభుత్వం నెలకు రూ.855 కోట్ల చొప్పున ఏటా రూ.10,266 కోట్ల మేర వారికి చెల్లిస్తోంది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల ద్వారా పేద కుటుంబాల్లో అమ్మాయిల వివాహాలకు సాయం కింద ఇప్పటివరకు రూ.5,556 కోట్లు అందించింది. రాష్ట్రంలో 87 లక్షలకుపైగా కుటుంబాల్లోని 2.83 కోట్ల మందికి ఏటా 1,78,754 టన్నుల బియ్యాన్ని రూపాయికి కిలో చొప్పున పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలోని 3,854 సంక్షేమ హాస్టళ్లు, 28,623 ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు 12 వేల టన్నుల సన్న బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఇక ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద 2014 నుంచి ఇప్పటివరకు రూ.41,253.66 కోట్లు ఖర్చు చేసింది. 


ఆరోగ్యానికి చేయూత 
ప్రజారోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోంది. పీహెచ్‌సీల నుంచి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ వరకు వసతులు పెంచింది. ల్యాబ్‌లు, పరికరాలు, ఆపరేషన్‌ థియేటర్లను ఆధునీకరించింది. తెలంగాణ వచ్చే నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో 17 వేల వరకు బెడ్స్‌ ఉండేవి. ఇప్పుడు మరో 5,000 పడకలు, వసతులు అదనంగా సమకూరాయి. తొలుత 5 మెడికల్‌ కాలేజీలే ఉండగా.. కొత్తగా 4 కాలేజీలు ఏర్పాటయ్యాయి. తాజాగా మరో ఏడు మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. 

విద్యుత్‌లో స్వయం సమృద్ధి 
రాష్ట్రంలో 13 వేల మెగావాట్లకుపైగా డిమాండ్‌ వచ్చినా ఎలాంటి కోతల్లేకుండా విద్యుత్‌ సరఫరా చేసిన ఘనతను తెలంగాణ విద్యుత్‌ సంస్థలు దక్కించుకున్నాయి. ఏర్పాటయ్యే నాటికి విద్యుత్‌ కొరతతో ఉన్న రాష్ట్రాన్ని.. మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చేందుకు ఏడేళ్లలో ఎన్నో ప్రణాళికలు అమలు చేశారు. తెలంగాణ ఏర్పడే నాటికి 7,778 మెగావాట్లు స్థాపిత సామర్థ్యం ఉండగా.. ఇప్పుడు 16,245 మెగావాట్లు అందుబాటులోకి వచ్చింది. 

వ్యవ ‘సాయం’ 
వ్యవసాయ రంగానికి 2013–14 బడ్జెట్‌లో మొత్తం ఉమ్మడి ఏపీకి కేటాయించింది కేవలం రూ.4,040 కోట్లు. అందులో తెలంగాణ వాటా 1,697 కోట్లు మాత్రమే. అలాంటిది తెలంగాణ ప్రభుత్వం ఒక్క 2019–20 ఏడాదిలో వ్యవసాయ రంగానికి రూ.33,125 కోట్లు కేటాయించింది. రాష్ట్రం పంటల ఉత్పత్తిలో 23.7 శాతం వృద్ధి సాధించింది. ప్రభుత్వం తొలిదశలో రూ.16,124.37 కోట్ల మేర రైతుల రుణాలు మాఫీ చేసింది. తర్వాత 2018 డిసెంబర్‌లో మరో రూ.25,936 కోట్లు రుణమాఫీకి నిర్ణయించింది. పంట పెట్టుబడుల కోసం ఏటా రూ.10వేల కోట్లకుపైగా రైతు బంధు సాయం అందిస్తోంది. ఇప్పటివరకు రూ.35,676.22 కోట్లను రైతులకు అందజేసింది.

కోటి ఎకరాల మాగాణి దిశగా.. 
కృష్ణా, గోదావరి నీటిని సమర్ధంగా వినియోగించుకుంటూ కోటి ఎకరాల మాగాణ దిశగా తెలంగాణ అడుగులు వేసింది. ఇప్పటికే ప్రాజెక్టుల కింద 72.55 లక్షల ఎకరాలు సాగవుతుండగా.. వచ్చే రెండు, మూడేళ్లలో మరో 52.11 లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చేలా ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టిస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల కోసం ఏకంగా రూ.1.59 లక్షల కోట్లు ఖర్చు చేసిన రాష్ట్రంగా తెలంగాణ కొత్త చరిత్ర సృష్టించింది. కాళేశ్వరం దాదాపు పూర్తికాగా.. పాలమూరు– రంగారెడ్డి, డిండి, సీతమ్మసాగర్, సమ్మక్క సాగర్, చనాకా–కోరాట బ్యారేజీ, సదర్‌మాట్‌ బ్యారేజీ పనుల పూర్తికి చర్యలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 46 వేల చెరువులను మిషన్‌ కాకతీయ కింద పునరుద్ధరించారు. మిషన్‌ భగీరథ ద్వారా రాష్ట్రంలోని మెజారిటీ గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ నల్లా నీళ్లు అందుతున్నాయి.  

విద్యా రంగంలో ప్రగతి 
రాష్ట్రంలో కొత్తగా 618 రెసిడెన్షియల్‌ పాఠశాలలు, 53 డిగ్రీ కాలేజీలు ఏర్పాటయ్యాయి. సర్కారీ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధన, హైదరాబాద్‌లో ఏరో యూనివర్సిటీ, కొత్తగా 15 కేంద్రీయ విద్యాలయాలు, నిజామాబాద్‌లో ఫుడ్‌ అండ్‌ సైన్స్‌ టెక్నాలజీ కాలేజీ, వరంగల్‌లో సైనిక్‌ స్కూల్, ములుగులో ట్రైబల్‌ వర్సిటీ వంటివి రాష్ట్ర విద్యారంగ అభివృద్ధికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. కొత్తగా 11 పాలిటెక్నిక్‌ లు ప్రారంభించారు. 

ఉద్యోగాల భర్తీపై దృష్టి 
రాష్ట్రంలో 2014 నుంచి 2021 మార్చి వరకు 1,32,899 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 128.37 శాతం పెరిగాయి. మొత్తం 6,48,560 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా.. వారి జీతాలకే ఏటా రూ.39,121 కోట్లు ఖర్చు చేస్తోంది. 2013–14లో జీతాల ఖర్చు రూ.17,130 కోట్లు మాత్రమే. 2,27,782 మంది తాత్కాలిక ఉద్యోగుల వేతనాలకు ఏటా రూ.1,023.43 కోట్ల ఖర్చు అవుతోంది. 

పరిశ్రమలకు ఊతం 
రాష్ట్రంలో 2019–20 నాటికి కొత్తగా 250 ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. 2013–14లో రూ.57,258 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు (8 శాతం వృద్ధి రేటుతో) జరగ్గా.. 2019–20లో రూ.1,28,807 కోట్ల ఎగుమతులు (17.93 శాతం వృద్ధితో) జరిగాయి. అమెజాన్‌ భారీ పెట్టుబడి, టీ–హబ్, వీ–హబ్, టీ–ఫైబర్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలలో ఐటీ ఇంక్యుబేషన్‌ కేంద్రాలు, వరంగల్‌లో సైయంట్, టెక్‌ మహీంద్రా క్యాంపస్‌లు, ఈ గవర్నెన్స్‌ సేవల్లో తెలంగాణ నంబర్‌ వన్‌గా నిలవడం, జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్స్‌ వంటివి పారిశ్రామికాభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 2021 మే నాటికి రూ.2,15,450 కోట్ల పెట్టుబడులతో.. 15,64,804 మంది ఉపాధి అందించే 16,129 పరిశ్రమలకు అనుమతులు మంజూరయ్యాయి. 

రెవెన్యూలో సంస్కరణలు 
రెవెన్యూ వ్యవస్థలో అవినీతిని రూపుమాపేందుకు ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసింది. ధరణి పోర్టల్‌ రూపొందించి.. భూరికార్డులు ఎవరూ మార్చలేని విధంగా పకడ్బందీ చర్యలు తీసుకుంది. రిజిస్ట్రేషన్ల వ్యవస్థలోనూ మార్పులు తెచ్చింది. 

గ్రామీణాభివృద్ధిలో ముందంజ! 
తెలంగాణ గ్రామాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర గ్రామీణ విధానాన్ని అమలు చేస్తోంది. ఇందుకోసం గ్రామాలకు నిధులు ఇవ్వడంతోపాటు పల్లె ప్రగతి పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే మూడు విడతలుగా చేపట్టిన కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలను మార్చగలిగింది. ప్రతీ గ్రామంలో మొక్కలు నాటి, సంరక్షించడం,  ప్రతిరోజు పారిశుధ్య పనులు చేయడం, నర్సరీలు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాల నిర్మాణం, సురక్షిత తాగునీటి సరఫరా వంటివి చేపట్టింది. ఊరికో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్‌ సమకూరింది.

2014–15 బడ్జెట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.13,877 కోట్లు కేటాయిస్తే.. 2021–22లో ఏకంగా రూ.29,291 కోట్లు కేటాయించింది. ప్రతి నెలా పంచాయతీల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.308 కోట్లు విడుదల చేస్తోంది. ఉపాధి హామీ పథకం అమల్లో తెలంగాణ దేశంలోనే ఉత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరంలో 15.05 కోట్ల పనిదినాలు కల్పించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రూ.463 కోట్లతో 2,601 రైతు వేదికల నిర్మాణాలు చేపట్టారు. రూ.743 కోట్ల వ్యయంతో 93,328 కల్లాలను మంజూరు చేశారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు