Telangana: కృష్ణా వినియోగం తక్కువే

4 Sep, 2021 02:19 IST|Sakshi

ఈ సీజన్‌లో వాడుకుంది 58 టీఎంసీలే..

ప్రధాన ఎత్తిపోతలు అందుబాటులోకి రాకపోవడమే కారణం

బోర్డుకు సమర్పించిన నివేదికలో రాష్ట్రం వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత నీటి సంవత్సరంలో రాష్ట్రంలో కృష్ణా నదీజలాల వినియోగం తక్కువగా ఉంది. మూడు నెలల వ్యవధిలో మొత్తంగా 58 టీఎంసీ ల నీటిని మాత్రమే వినియోగించుకోగలిగింది. ప్రస్తుత సీజన్‌కు సైతం ప్రధాన ఎత్తిపోతల పథకాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.  నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ కింద మాత్రమే ఇప్పటివరకు గరిష్ట జలాల వినియోగం జరిగినట్లు రికార్దులు చెబుతున్నాయి. 

వరద జలాలు ఒడిసి పట్టలేక..
కృష్ణా బేసిన్‌లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల మేర నికర జలాల కేటాయింపులున్న విషయం తెలిసిందే. ఈ వాటాలకు అనుగుణంగా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఉండగా, వరద జలాలపై ఆధారపడి తెలంగాణ నెట్టెంపాడు(20 టీఎంసీలు), కల్వకుర్తి (40 టీఎంసీలు), ఏఎంఆర్‌పీ (30 టీఎంసీలు), పాలమూరు–రంగారెడ్డి (90 టీఎంసీ లు), డిండి (30 టీఎంసీలు) ప్రాజెక్టులు చేపట్టింది. అయితే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులకు సంబంధించి బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ అవార్డు కాకపోవడంతో కృష్ణా బేసిన్‌లో ఎంత నీరొచ్చినా, దానిని రెండు రాష్ట్రాలు 66ః34 నిష్పత్తిలో వాడు కోవాలని నిర్ణయించుకున్నాయి.

తమకు వచ్చే వాటా లకు అనుగుణంగా నీటిని రాష్ట్రాలు తమ పరీవా హకంలో ఎక్కడైనా వినియోగించుకునేలా ఒప్పందం చేసుకుని ఆ మేరకు వాడుకుంటున్నాయి. ఈ విధంగా గత మూడు నెలల్లో కృష్ణా బేసిన్‌లో ఏపీ 113 టీఎంసీలు వినియోగించుకోగా తెలంగాణ 58 టీఎంసీ లు మాత్రమే వినియోగించుకుందని కృష్ణా బోర్డుకు సమర్పించిన లెక్కల్లో తెలంగాణ పేర్కొంది.  సాగర్‌ ఎడమ కాల్వ కింద 14.68 టీఎంసీల వినియోగం జరగ్గా, జూరాల కింద 8, నెట్టెంపాడు కింద 4, బీమా కింద 4.60, కోయిల్‌సాగర్‌ కింద 2, కల్వ కుర్తి కింద 5 టీఎంసీల నీటిని తెలంగాణ వినియోగించింది. వీటితోపాటు హైదరాబాద్‌ తాగునీటి అవసరాలు, ఏఎంఆర్‌పీ కింది అవసరాలకు కలిపి మరో 11 టీఎంసీల మేర నీటిని వాడగా, మధ్యతరహా ప్రాజెక్టుల కింద వినియోగం మరో 3 టీఎంసీల మేర ఉంది.

కల్వకుర్తి కింది మూడు దశల్లో పూర్తి స్థాయిలో జరగని ఎత్తిపోతలకు తోడు, నిల్వలు చేసేందుకు రిజర్వాయర్లు లేక పోవడం, పాలమూరు, డిండి ప్రాజెక్టుల నిర్మాణం పాక్షికంగా అయినా పూర్తి కాకపోవడంతో నీటినిల్వకు అవకాశం లేకుండా పోయింది. దీంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీ గా వరదలు వస్తున్నా ఒడిసి పట్టలేక పోయింది. దీంతో ఈ ఏడాది   205 టీఎంసీల నీరు వృ«థాగా సముద్రం లోకి వెళ్లింది. గతేడాది  కృష్ణా జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాలు రికార్డులు సృష్టించాయి. గత ఏడాది సీజన్‌ ఏపీ 647.559, తెలంగాణ 272.846 టీఎంసీలు ఉపయోగించుకున్నాయి.   

మరిన్ని వార్తలు