టీఆర్‌ఎస్‌ చెప్పుచేతల్లో పోలీస్‌ వ్యవస్థ: డీకే అరుణ 

1 Apr, 2022 02:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు వ్యవస్థ పని తీరుపై బీజేపీ తీవ్రస్థాయిలో మండి పడింది. తెలంగాణలో పోలీస్‌ వ్యవస్థ టీఆర్‌ఎస్‌ నేతల చెప్పుచేతల్లో పనిచేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలంలో మినీ కూరగాయల మార్కెట్‌ ప్రారంభోత్సవానికి వెళ్లిన దుబ్బాక  ఎమ్మెల్యే రఘునందన్‌ రావును టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకుంటుంటే పోలీసులు ప్రేక్షకుల్లా మారిపోయి చోద్యం చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై ఎమ్మెల్యే ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై ప్రశ్నిస్తే సిబ్బంది కొరత ఉందని పోలీసులు చెప్పడం సిగ్గుచేటని, కార్పొరేషన్‌ చైర్మన్లకు, హోదా లేని వారికి ఎస్కార్ట్‌ ఇచ్చేందుకు సిబ్బంది కొరత ఉండదా అని అరుణ ప్రశ్నించారు. ఉన్నతాధికారులు స్పందించి ఎమ్మెల్యేకు బందోబస్తు కల్పించడంలో విఫలమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు