World Laughter Day: రోజుకు 10 నిమిషాలు నవ్వితే.. ఎన్ని కేలరీల కొవ్వు కరుగుతుందో తెలుసా!

1 May, 2022 16:28 IST|Sakshi

చిరునవ్వుతో మానసికంగా, శారీరకంగా ప్రశాంతత 

ఒత్తిడిని అధిగమించి రోగనిరోధక శక్తి పెంపునకు దోహదం 

యోగా చివరలో 2 నిమిషాలు లాఫింగ్‌ థెరపీ 

సాక్షి, జడ్చర్ల టౌన్‌: ‘నవ్వుతూ బతకాలిరా తమ్ముడు.. నవ్వుతూ చావాలిరా.. చచ్చినాక నవ్వలేమురా.. ఎంత ఏడ్చినా బతికిరామురా.. అంటూ ఆచార్య ఆత్రేయ రాసిన గీతం అక్షరసత్యం. అసలు ఈ పాట గురించి ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా.. మీ సందేహం సబబే. ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవం అందుకే ఆ ఉపోద్ఘాతం. నవ్వు గురించి చెబుదామనిపించి అలా ఆ గీతంతో మొదలుపెట్టాం. నవ్వడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ప్రజలకు అవగాహన కల్పించడం కోసం నవ్వుల దినోత్సవం ఏర్పాటయ్యింది. నవ్వడం వల్ల మానసికంగా, శారీరకంగా మేలు జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు కాస్త నవ్వుకుంటూ నవ్వు వెనకాల ఉన్న చరిత్రను తెలుసుకుందాం పదండి. 

నవ్వులకూ ఓ శాస్త్రం 
నవ్వడం వల్ల శరీరంలో కలిగే ప్రభావాలపై అధ్యయనం చేసేందుకు మానసిక వైద్యశాస్త్రంలో జిలోటాలజి అనే ప్రత్యేక విభాగం కూడా ఉంది. 

మహబూబ్‌నగర్, జడ్చర్లలో.. 
మహబూబ్‌నగర్, జడ్చర్లలోనూ లాఫింగ్‌ క్లబ్‌లు ఉన్నాయి. అయితే కరోనా కారణంగా మూడేళ్లుగా ఈ క్లబ్‌లు నామమాత్రంగా పనిచేస్తున్నాయి. క్లబ్‌ సభ్యులు ప్రతిరోజు పరిమితంగా కలుసుకోవడం, హాయిగా జోకులు వేసుకుంటూ నవ్వడం చేస్తున్నారు. నవ్వడం, నవ్వించడం ఓ కళగా క్లబ్‌ సభ్యులు చెబుతుంటారు. యోగాసనాలు వేశాక చివరగా రెండు నిమిషాలు తప్పనిసరిగా లాఫింగ్‌ థెరపీ చేస్తుంటారు. తద్వారా అప్పటి వరకు యోగాసనాలతో మానసిక, శారీరకమైన అలసట నుంచి బయట పడేందుకు అలా చేస్తుంటారు. 

ఇవీ ఆరోగ్య ప్రయోజనాలు 
► నవ్వు యోగా కామెడీ కాదని ఆరోగ్య శ్రేయస్సు కోసం నిర్వహించే వ్యాయామ ప్రక్రియగా చెబుతున్నారు. 
► నవ్వడం వల్ల శారీరక విశ్రాంతి లభిస్తుంది. హాయిగా నవ్వడం వల్ల అలా నవ్విన వ్యక్తికి 45 నిమిషాలపాటు కండరాలు సడలించబడి ఒత్తిడిని తగ్గిస్తుంది.  
► నవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా ఒత్తిడి హార్మోన్లు తగ్గి రోగనిరోధక కణాలు పెరుగుతాయి. 
► నవ్వు రక్తనాళాల పనితీరు మెరుగుపరచడం వల్ల రక్తప్రసరణ పెరిగేలా చేసి గుండెపోటు రాకుండా కాపాడుతుంది. 
► రోజుకు 10 నిమిషాలు నవ్వడం వల్ల శరీరంలోని 40 కేలరీల కొవ్వును కరిగిస్తుంది. కోపాన్ని తగ్గింపజేసి ఆయుష్షును పెంచడానికి దోహదపడుతుంది.  

మరిన్ని వార్తలు