Omicron Variant: స్పైక్‌ ప్రోటీన్‌లో విపరీతమైన మార్పులు, అందుకే..

6 Dec, 2021 15:56 IST|Sakshi

టీకాలు తీసుకున్నా ఒమిక్రాన్‌ సోకే అవకాశం

అందుకే ప్రపంచమంతా కలవరం

మెడికవర్‌ హాస్పిటల్స్‌ సీఎండీ డాక్టర్‌ అనిల్‌ కృష్ణ

సాక్షి, హైదరాబాద్‌: కరోనా ఒమిక్రాన్‌ (బీ.1.1.529) వేరియంట్‌ రూపు మార్చుకున్న విధానం గురించే ప్రస్తుతం ప్రపంచమంతా కలవరపడుతోందని మెడికవర్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనిల్‌ కృష్ణ పేర్కొన్నారు. ‘‘ఈ వైరస్‌ జన్యుపరమైన విశ్లేషణలను చేసినప్పుడు స్పైక్‌ ప్రోటీన్‌లో విపరీతమైన మార్పులు ఉన్నాయి.

ఇది మనిషి రోగనిరోధక వ్యవస్థను సైతం ఏమార్చగల శక్తిని సంతరించుకుంది. టీకాలు తీసుకున్న వారికి సైతం ఇది సోకే అవకాశాలున్నాయి. ఈ వైరస్‌ బారిన చాలా మందిలో ఇదే విషయం నిరూపితమైంది’’అని అనిల్‌ కృష్ణ తెలిపారు.

తీవ్రతపై అధ్యయనం అవసరం...
‘‘ఈ వైరస్‌ వ్యాప్తి, చికిత్స ఫలితాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇప్పుడు భయంకరమైనదనుకుంటున్న డెల్టా వేరియంట్‌ వ్యాప్తి రేటు 1.47గా ఉంటే ఒమిక్రాన్‌ వ్యాప్తి రేటు 1.97గా ఉంది. అయితే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనే దానిపై ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంది.

నిపుణులు చెప్పే దాని ప్రకారం డెల్టా వేరియంట్‌లో చక్కటి ఫలితాలను ఇచ్చిన మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్సలు ఈ వేరియంట్‌లో ఎంత మేరకు పనిచేస్తాయన్నది అధ్యయనం చేయాల్సి ఉంది’’ అని అనిల్‌ కృష్ణ పేర్కొన్నారు. అయితే ప్రజలంతా ఇకనైనా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లను వేయించుకోవడంతోపాటు తప్పనిసరిగా భౌతికదూరం నిబంధన పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు.  

మరిన్ని వార్తలు