నచ్చిన రంగాల్లో యువత రాణించాలి

24 Feb, 2023 02:59 IST|Sakshi
కార్యక్రమంలో పాల్గొన్న సతీష్‌రెడ్డి, జయేశ్‌రంజన్, వివేక్‌ తదితరులు 

డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి సూచన 

ప్రభుత్వం తరఫున సహకరిస్తామని వెల్లడి 

వెంగళరావునగర్‌ (హైదరాబాద్‌): స్వయంశక్తితో వ్యాపార రంగంలో ఎదగాలనుకునే యువతకు ప్రభుత్వం తరఫున అన్నిరకాల సహాయ సహకారాలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని రక్షణ మంత్రిత్వ శాఖ శాస్త్రీయ సలహాదారు డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి తెలిపారు. యువత నేటి కాలానికి అనుగుణంగా అన్నిరకాల నైపుణ్యాలను కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న చేయూతను అందిపుచ్చుకుని యువతీ యువకులు తమలో ఉన్న నైపుణ్యాలను వెలికితీయాలని, తమకు నచ్చిన రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు.

యూసుఫ్‌గూడలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (నిమ్స్‌మే) శిక్షణ సంస్థలో స్వయంశక్తితో ఎదగాలనుకునే యువతకు శిక్షణలో భాగంగా  గురువారం జాతీయ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సతీష్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత తమకు నచ్చిన రంగాల్లో శిక్షణ తీసుకున్నట్టైతే.. ప్రభుత్వం బ్యాంకుల తరఫున రుణాలను మంజూరు చేస్తుందని, తద్వారా చిన్న, మధ్యతరహా, భారీ వ్యాపారాలను చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.

ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకుని యువత వ్యాపార రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. బ్యాంకర్లు కూడా యువతలోని నైపుణ్యాన్ని గ్రహించి వారిని నిరుత్సాహ పరచకుండా ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆర్థిక చేయూతను అందించి ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్, మాజీ ఎంపీ వివేక్, నిమ్స్‌మే డైరెక్టర్‌ జనరల్‌ గ్లోరీ స్వరూప తదితరులు పాల్గొన్నారు. కాగా నిమ్స్‌మేలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్‌ను సతీష్‌రెడ్డి ప్రారంభించారు.

మరిన్ని వార్తలు