కొనసాగుతున్న తెలంగాణ ఈసెట్‌

31 Aug, 2020 09:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈసెట్‌ నేటి ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 వరకు ముగుస్తుంది. మరొక సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు కొనసాగుతుంది. ఇక కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. విద్యార్థుల భద్రతపై అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా, ఉదయం పరీక్షకు 14,415 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం పరీక్షకు 13,600 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు పరీక్షలు నిర్వహిస్తున్న జేఎన్‌టీయూ అధికారులు తెలిపారు.

తెలంగాణలో 56, ఏపీలో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. మాస్క్‌, శానిటైజర్‌ తప్పనిసరి చేశామని, పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరిస్తామని అధికారులు ఇదివరకే స్పష్టం చేశారు. కాగా, కోవిడ్‌ కారణంగా వాయిదాపడిన ఈసెట్‌, వైరస్‌ విజృంభణ అనంతరం నిర్వహిస్తున్న తొలి కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు కావడం గమనార్హం. పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తయిన విద్యార్థులకు బీటెక్‌ సెకండియర్‌లో ప్రవేశాల కోసం ఈసెట్‌ పరీక్షలు నిర్వహిస్తారు.
(చదవండి: అనుమతి లేకున్నా కరోనా టెస్టులు!)

రేపు జేఈఈ మెయిన్‌
దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం మంగళవారం నుంచి సెప్టెంబర్‌ 6 వరకు జేఈఈ మెయిన్‌ పరీక్షలు జరగనున్నాయి. దీనికోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశా రు. ఐఐటీ ఢిల్లీ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు (సీబీటీ) విధానంలో ఒక్కరోజులో 85 వేలమంది మెయిన్‌ పరీక్షలకు హాజరుకానున్నా రు. తెలంగాణ నుంచి 67,319 మంది, దేశవ్యాప్తంగా 8.58 లక్షల మంది పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌తోపాటు రంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాల్లో పరీక్షా కేంద్రాలున్నాయి.
(చదవండి: జేఈఈ, నీట్‌ పరీక్షలపై సందేహాలెన్నో!?)

మరిన్ని వార్తలు