ఆ రాబడులే రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు కీలకం

5 Feb, 2021 02:59 IST|Sakshi

ఆర్థిక సంవత్సరంలో చివరి మూడు నెలలే కీలకం.. జనవరి–మార్చిపై ఆధారపడిన రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు

ఈ కాలంలో వచ్చే రాబడులనుబట్టే 2021–22 బడ్జెట్‌ అంచనాలు

జీఎస్టీ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల ఆదాయమే ముఖ్యం.. వీటి ద్వారా రూ.15 వేల కోట్లు వస్తాయనే అంచనా

మొత్తం రూ.1.35 లక్షల కోట్లు రావచ్చంటున్న ఆర్థిక శాఖ వర్గాలు

2020–21 బడ్జెట్‌ను రూ.1.43 లక్షల కోట్ల వరకు సవరించే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఆర్థిక సంవత్సరంలోని చివరి మూడు నెలల రాబడులే రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు కీలకం కానున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగుల పీఆర్సీతో పాటు నిరుద్యోగ భృతి అమలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వచ్చే ఆదాయాన్ని బట్టి 2021–22 బడ్జెట్‌ అంచనాలు, కేటాయింపులు ఉంటాయని ఆర్థిక శాఖ చెబుతోంది. ఇప్పటివరకు 2020–21 బడ్జెట్‌లో అప్పులు, ఆదాయం మొత్తం కలిపి రూ.1.04 లక్షల కోట్లు ఖజానాకు చేరగా, జీఎస్టీ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల ఆదాయం నిలకడగా వస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం రూ.1.35 లక్షల కోట్ల వరకు చేరవచ్చని ఆ శాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు. మరికొంత మొత్తం అప్పుల రూపంలో సమకూరినప్పటికీ 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను రూ.1.83 లక్షల కోట్ల నుంచి రూ.1.43 లక్షల కోట్ల వరకు సవరించాల్సి ఉంటుందని వారంటున్నారు. 

అంచనాలు తలకిందులు
కరోనా కొట్టిన దెబ్బతో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అంచనాలు తలకిందులయ్యాయి. అంతా సవ్యంగా ఉంటే మరో రూ.30 వేల కోట్ల వరకు సొంత పన్నుల ఆదాయం పెరిగేది. ఈ పరపతి భవిష్యత్‌ ఆర్థిక వ్యవస్థకు మరింత ఉపయోగపడేది. కానీ, కరోనా కాటుతో కీలక రంగాలు దెబ్బ తినడం, ఉపాధి రంగంపై తీవ్ర ప్రభావం చూపడంతో ఆర్థిక ఆశలు ఆవిరి అయ్యాయి. అయితే గత ఆరు నెలలుగా (జూలై, 2020 నుంచి) వస్తుసేవల పన్ను (జీఎస్టీ), ఎక్సైజ్‌ ఆదాయం నిలకడగా ఉండడం, ఈ రెండూ కలిపి సగటున రూ.4,000 కోట్ల వరకు ఆదాయం వస్తుండడంతో కొంత మేర ప్రభుత్వ ఖజానా ఊపిరి పీల్చుకుంది. వీటికి తోడు గత రెండు నెలలుగా స్టాంపు, రిజిస్ట్రేషన్ల గల్లా కూడా కళకళలాడుతోంది. డిసెంబర్‌లో రూ.661 కోట్లు, జనవరిలో రూ.800 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ల ద్వారా సమకూరాయి. దీంతో ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో రూ.2 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. మొత్తం మీద ఈ మూడు శాఖల ద్వారా నెలకు సగటున రూ.5వేల కోట్ల చొప్పున రూ.15 వేల కోట్ల వరకు వస్తాయని ఆ శాఖ లెక్కలు కడుతోంది. 

సగటున రూ.10 వేల కోట్ల రాబడి
గత 3 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ రాబడులను పరిశీ లిస్తే సగటున నెలకు రూ.10 వేల కోట్ల వరకు ఖజానాకు సమకూరుతోంది. అక్టోబర్‌లో రూ.10,178 కోట్లు, నవంబర్‌లో రూ.10,239 కోట్లు, డిసెంబర్‌లో రూ.20,103 కోట్లు వచ్చాయి. అయితే, డిసెంబర్‌లో సొంత పన్నులు, కేంద్ర సాయం, ఇతర ఆదాయాలు కలిపి రూ.10 వేల కోట్లకు పైగా ఉండగా, మరో రూ.10 వేల కోట్లు అప్పులు కింద సమకూర్చుకోవాల్సి వచ్చింది. ఈ లెక్కన జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా సగటున రూ.10 వేల కోట్లు చొప్పున మూడు నెలల్లో రూ.30 వేల కోట్ల వరకు వస్తాయని, అప్పులు ఇంకో రూ.7–8 వేల కోట్ల వరకు తెచ్చుకున్నా, అంతా కలిపి రూ.1.45 లక్షల కోట్ల వరకు బడ్జెట్‌ చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అధికారులు లెక్కలు గడుతున్నారు. ఈ నేపథ్యంలోనే 2020–21 వార్షిక బడ్జెట్‌ను రూ.1.43 లక్షల కోట్ల వరకు సవరించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మరోవైపు 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను వచ్చే నెలలో శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ఆర్థిక శాఖ జనవరి, ఫిబ్రవరి రాబడులను బట్టి కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలని భావిస్తోంది. 

ఈ ఆర్థిక సంవత్సరంలో వసూలైన జీఎస్టీ, ఎక్సైజ్‌ ఆదాయాలు నెలల వారీగా..(రూ.కోట్లలో)

(మొత్తం వార్షిక బడ్జెట్‌ అంచనాల్లో డిసెంబర్‌ నెలాఖరు వరకు జీఎస్టీ 53.7% రాగా, ఎక్సైజ్‌ డ్యూటీ ఆదాయం 65.27 శాతానికి చేరింది)
   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు