విలువలు, అవసరాలే లక్ష్యంగా..

12 Nov, 2022 03:45 IST|Sakshi
ఇంటర్‌ బోర్డు సమావేశంలో పాల్గొన్న మంత్రి సబిత, విద్యాశాఖ అధికారులు

ఇంటర్‌ విద్యలో కీలక మార్పులపై విద్యాశాఖ దృష్టి

ఉన్నతాధికారులతో మంత్రి సబితారెడ్డి సమీక్ష

పలు సబ్జెక్టుల్లో సమూల మార్పులకు ప్రతిపాదన

దీనిపై నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయం

విద్యా సంవత్సరం మొదలవక ముందే ప్రైవేటు కాలేజీలకు గుర్తింపు

వచ్చే ఏడాది నుంచి తప్పనిసరిగా బయోమెట్రిక్‌ హాజరు

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థుల్లో విలువలు పెంచడం.. మారుతున్న పరిస్థితులు, అవసరాలకు తగి­న­ట్టుగా కోర్సులు/సబ్జెక్టులను తీర్చిదిద్దడం లక్ష్యంగా ఇంటర్‌ విద్యలో కీలక మార్పులకు విద్యాశాఖ సిద్ధమైంది. బోధన ప్రణాళికను సమూలంగా మా­ర్చా­లని, ఇందుకోసం ఒక కమిటీ ఏర్పాటు చేయా­లని నిర్ణయించింది. దీనికి సంబంధించి శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో జరిగిన ఇంటర్‌ బోర్డు సమావేశంలో పలు ప్రతి­పా­దనలు చేశారు.

భేటీలో సుమారు 111 అంశాలపై క్షుణ్నంగా చర్చించారు. ప్రధానంగా ప్రైవేటు కాలే­జీలకు అనుబంధ గుర్తింపు, కోర్సుల్లో తీసుకురా­వాల్సిన మార్పులు, పాలనాపరమైన జాప్యాన్ని నివారించే అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టారు. కోవిడ్‌ పరిణామాల నేపథ్యంలో ఇంటర్‌ విద్యలో చోటు చేసుకున్న మార్పులను పరిశీలించిన మంత్రి.. ఈ ఏడాది ఇంటర్‌ ఫలితాలు మెరుగయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు.

కోర్సులపై నిపుణుల కమిటీ
కాలానికి అనుగుణంగా ఇంటర్‌ విద్య కోర్సుల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని సమావేశంలో మంత్రి, అధికారులు అభిప్రాయపడ్డారు. ఇప్ప­టికీ పలు కోర్సుల్లో సంబంధం లేని/అవసరం లేని సబ్జెక్టులు ఉన్నాయని.. వాటిని మార్చాల్సిన అవసరం ఉందని ఇంటర్‌ బోర్డు అధ్యయన నివేదికల­లో వెల్లడైన అంశాలు, ఆ దిశగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌ గ్రూపుల నవీకరణ కోసం నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

గుర్తింపుపై ఆలస్యమెందుకు?
ప్రైవేటు ఇంటర్‌ కాలేజీలకు బోర్డు గుర్తింపు ప్రక్రి­యపై కొన్నేళ్లుగా విమర్శలు వస్తుండటంపై సమా­వేశంలో చర్చించారు. కాలేజీలు తెరిచి నెలలు గడు­స్తున్నా అనుబంధ గుర్తింపు పెండింగ్‌లో పెట్టడం, తర్వాత అన్ని కాలేజీలకు ఇవ్వడం సాధారణ­మైపోయిందని కొందరు అధికారులు ప్రస్తావించారు. గుర్తింపు ఇచ్చే క్రమంలో గతంలో ముడుపు­లు చేతులు మారుతున్నాయన్న ఆరోపణ­లనూ గుర్తుచేశారు.

వీటన్నింటికీ పరిష్కారంగా కాలేజీలు తెరిచే నాటికే అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని, మేలోనే గుర్తింపు ఇచ్చేదీ లేనిదీ  తెలపాల్సిన అవసరం ఉందని మంత్రి అధికారు లకు సూచించారు. ఇక వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని తప్పనిసరిగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. దివ్యాంగ విద్యార్థులకు పరీక్ష రాసే అదనపు సమయాన్ని అరగంట నుంచి గంటకు పెంచాలని తీర్మానించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కాలేజీ విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, ఉస్మానియా, జేఎన్‌టీ­యూహెచ్, కాకతీయ, తెలంగాణ వర్సిటీల వైస్‌ చాన్సలర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కాలేజీలు తెరిచే నాటికే పుస్తకాలు: మంత్రి సబిత
ఇంటర్‌ కాలేజీలు తెరిచే నాటికే విద్యార్థులకు పుస్తకాలు అందుబాటులో ఉండాలని బోర్డు భేటీలో నిర్ణయించినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సమావేశం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. పేపర్‌ సకాలంలో అందని కారణంగా పాఠ్య పుస్తకాల ముద్రణ ఈ ఏడాది ఆలస్యమైందని.. వచ్చే ఏడాదికి కావాల్సిన పుస్తకాల కోసం టెన్త్‌ పరీక్షలు ముగిసిన వెంటనే ఆర్డర్‌ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు విషయంలో జాప్యం తగదని సూచించినట్టు తెలిపారు. 

మార్పుల ప్రతిపాదనలు ఇవీ..
►ఇంటర్‌లో ఉండే తెలుగు, హిందీ, ఇతర భాషా సబ్జెక్టుల్లో నైతిక విలువలు పెంపొందించే దిశగా సిలబస్‌లో మార్పులు తేవా­లని బోర్డు సమావేశంలో తీర్మానించారు.

►ఎంఈసీ, ఎంపీసీ గ్రూపులకు ఒకే విధమైన గణిత సబ్జెక్టులు ఉన్నాయని.. వాస్తవా­నికి మేథ్స్‌ విద్యార్థులతో సమానంగా ఎంఈసీ విద్యార్థులకు మేథ్స్‌ ఉండాల్సిన అవసరం లేదని బోర్డు భావనకు వచ్చింది. కామర్స్‌కు ఉపయోగపడే మేథమేటిక్స్‌కు సబ్జెక్టులో ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని నిర్ణయించింది.

►సీఈసీ గ్రూపులో సివిక్స్‌ కన్నా అకౌంటెన్సీకి ప్రాధాన్యం ఇవ్వాలని.. హెచ్‌ఈసీలో సివిక్స్‌ స్థానంలో పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టులో లోతైన అవగాహన పెంచేలా మార్పు చేయాలని ప్రతిపాదించింది.

►వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టాలని, తొలుత భాషా సబ్జెక్టులను ప్రయోగాత్మకంగా మూల్యాంకనం చేయాలని నిర్ణయించారు.  

మరిన్ని వార్తలు