నూతన విధానానికి కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం.. ఎక్కడున్నా ఓటు పక్కా!

25 Feb, 2023 17:14 IST|Sakshi

సాక్షి,షాబాద్‌(హైదరాబాద్‌): వలసదారుల ఓటు హక్కు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. స్వగ్రామంలో ఓటు హక్కు ఉన్నా బతుకు దెరువు కోసం సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఎన్నికల సమయంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల రాలేకపోవడం.. ఓటు హక్కు వినియోగించుకోలేకపోవడం వంటి కారణాలను గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి వారు ఉన్నచోటే ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించనుంది. దీంతో జిల్లా నుంచి వలస వెళ్లిన వ్యక్తులకు ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు అవకాశం లభించనుంది.

వ్యవసాయాధారిత జిల్లా కావడం పల్లెలు ఎక్కువగా ఉండడం.. వ్యవసాయ పనులు లేని సమయంలో పొట్టచేత పట్టుకుని హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్వగ్రామానికి వచ్చేందుకు ఆర్థిక భారం పడటం.. సుదూర ప్రాంతాల నుంచి రాలేక ఓటు వేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఓటింగ్‌ శాతం పడిపోయిన సందర్భాలున్నాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకురానున్న నూతన విధానం వల్ల ఉన్న చోటు నుంచే ఓటు వేసే రిమోట్‌ ఓటింగ్‌ సిస్టం ద్వారా అధిక శాతం నమోదుకు ఎన్నికల కమిషన్‌ ప్రయతి్నస్తోంది. ఓటర్లు తాము ఉంటున్న ప్రాంతాల నుంచే ముందస్తుగా ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు.  

పెరగనున్న ఓటింగ్‌
కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొస్తున్న నూతన విధానం వల్ల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఓటింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రతీ ఎన్నికల సమయంలో ఆయా నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు ఇతర ప్రాంతాల్లో నివసిస్తుండటం వల్ల ఓటు హక్కు వినియోగించుకోలేక పోతున్నారు. కేంద్రం తీసుకొచ్చే నూతన విధానం ఓటర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

చదవండి: ఆమె కేవలం ఫ్రెండ్‌ అంతే!: నవీన్‌ తండ్రి

మరిన్ని వార్తలు