19 ఏళ్ల క్రితంనాటి బిల్లు కట్టాల్సిందే!

13 May, 2022 04:08 IST|Sakshi
దాతారుపల్లిలో విద్యుత్‌ అధికారులను  నిలదీస్తున్న సక్కుబాయి, కుటుంబ సభ్యులు 

ఇల్లు కొనుగోలు చేసిన ఇన్నాళ్లకు బకాయి పేరిట ఒత్తిడి 

బిల్లు కట్టకపోవడంతో కరెంట్‌ కట్‌చేసిన అధికారులు 

యాదగిరిగుట్ట మండలం దాతారుపల్లిలో ఘటన 

యాదగిరిగుట్ట: వారు 19 ఏళ్ల క్రితం ఓ ఇల్లు కొనుగోలు చేశారు. పాత యజమాని పేరిట ఉన్న విద్యుత్‌ మీటర్‌ తొలగించి కొత్త మీటర్‌ బిగించుకున్నారు. అప్పటి నుంచి నెలనెలా బిల్లులు చెల్లిస్తున్నారు. అయితే, పాత యజమాని పేరిట ఉన్న రూ.10 వేల బకాయి కట్టాలంటూ ఇప్పుడు విద్యుత్‌ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. బిల్లు చెల్లించలేదని తాజాగా కరెంటు కనెక్షన్‌ కూడా తొలగించారు.

ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతారుపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల తెలిపిన వివరాల ప్రకారం... 19 ఏళ్ల క్రితం దాతారుపల్లిలో జయిని నాగరాజుకు చెందిన ఇంటిని రాంపల్లి సక్కుబాయి కొనుగోలు చేశారు. అప్పట్లోనే పాత విద్యుత్‌ మీటర్‌ తొలగించి, సక్కుబాయి కుటుంబసభ్యుల పేరుతో కొత్త మీటర్‌ తీసుకున్నారు.

అప్పటి నుంచి కరెంట్‌ బిల్లు రూ.500 కంటే తక్కువగానే వస్తోంది. కానీ, గత నెలలో విద్యుత్‌ అధికారులు వచ్చి గతంలో ఉన్న ఈ ఇంటి యజమాని పేరుతో బకాయి బిల్లు రూ.10 వేలు వచ్చింది, ఆ బిల్లు ఇప్పుడు కట్టాలని చెప్పారు. ఈ క్రమంలోనే గత నెల బిల్లు సక్కుబాయి కుటుంబసభ్యులు కట్టలేదు. దీంతో గురువారం విద్యుత్‌ అధికారులు దాతారుపల్లిలోని సక్కుబాయి ఇంటికి వెళ్లి ఈ నెల ఇంటి బిల్లుతోపాటు బకాయి ఉన్న బిల్లు కట్టాలని, లేకుంటే కరెంట్‌ కట్‌ చేస్తామంటూ కనెక్షన్‌ తొలగించారు.

ఇదెక్కడి అన్యాయం.. తాము ఇల్లు కొనుగోలు చేసి 19 ఏళ్లు అయింది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పాత బకాయి ఉందని విద్యుత్‌ అధికారులు చెప్పలేదని సక్కుబాయి ఆవేదన వ్యక్తం చేసింది. కానీ, ఇప్పుడు ఈ విధంగా విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించడమేమిటని ఆందోళన వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. 

మరిన్ని వార్తలు