ఒక్క రూపాయి కూడా వదలకుండా.. 

8 May, 2022 00:33 IST|Sakshi

వినియోగదారుల నుంచి విద్యుత్‌ బిల్లులు వసూలు చేస్తున్న డిస్కంలు

ఏప్రిల్‌ 1 నుంచి కొత్త టారిఫ్‌ అమల్లోకి వచ్చినా గత నెలలో పాత టారిఫ్‌తోనే బిల్లులు  

ఏప్రిల్‌లో పాత టారిఫ్‌ వేసిన రోజులకు తాజాగా కొత్త చార్జీలు వర్తింపు 

కట్టిన డబ్బు పోనూ రావాల్సిన అదనపు సొమ్మును బిల్లులో చేరుస్తున్న సంస్థలు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు వినియోగదారుల నుంచి ముక్కుపిండి మరీ విద్యుత్‌ బిల్లులను వసూలు చేస్తున్నాయి. ఒక్క రూపాయిని కూడా వదలకుండా తీసుకుంటున్నాయి. ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి విద్యుత్‌ చార్జీల పెంపు అమల్లోకి రాగా అప్పుడు ఏప్రిల్‌ 15లోపు ఏ తేదీ వరకైతే బిల్లు వేశారో దానికి పాత టారిఫ్‌నే అమలు చేశారు. అయితే ఏప్రిల్‌లో ఎన్ని రోజులకైతే పాత చార్జీలు వసూలు చేశారో ఆ రోజులకు తాజాగా కొత్త చార్జీలు వర్తింపజేసి మరీ రావాల్సిన అదనపు సొమ్మును వసూలు చేస్తున్నారు. 

టారిఫ్‌ డిఫరెన్స్‌ పేరుతో.. 
ప్రస్తుతం ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీలోగా మునుపటి నెల వినియోగానికి సంబంధించిన మీటర్‌ రీడింగ్‌ తీసి విద్యుత్‌ బిల్లులను జారీ చేస్తూ వస్తున్నారు. ఇదే తరహాలో గత మార్చి నెల విద్యుత్‌ బిల్లులను ఏప్రిల్‌ 1 నుంచి 15వ తేదీలోగా జారీ చేశారు. ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీల పెంపు అమల్లోకి వచ్చినా బిల్లులు జారీ చేసిన తేదీ వరకు పాత టారీఫ్‌నే వర్తింపజేశారు.

అంటే మార్చి 1–15 నుంచి ఏప్రిల్‌ 1–15 కాలాన్ని ఒక నెలగా పరిగణించి ఏప్రిల్‌లో బిల్లు జారీ చేశారు. ఒకే నెలలో రెండు వేర్వేరు టారిఫ్‌లు వర్తింపజేసి బిల్లు వసూలు చేయడం సాధ్యం కాదు కాబట్టి ఈ రకంగా చేయాల్సి వచ్చింది. అయితే ప్రస్తుత మే నెలలో జారీ చేస్తున్న గత ఏప్రిల్‌ నెలకు సంబంధించిన విద్యుత్‌ బిల్లుల్లో మాత్రం ‘ఏప్రిల్‌ 1–15’కాలానికి సైతం పెరిగిన విద్యుత్‌ టారిఫ్‌ను వర్తింపజేసి ‘టారిఫ్‌ డిఫరెన్స్‌’పేరుతో చార్జీలను డిస్కంలు విధిస్తున్నాయి.

ఉదాహరణకు మార్చి 1–15 నుంచి ఏప్రిల్‌ 1–15 మధ్య కాలంలో ఓ వినియోగదారుడు 200 యూనిట్లు వినియోగిస్తే అందులో ఏప్రిల్‌ 1–15 మధ్యన ఎన్ని యూనిట్లు వాడి ఉంటాడో సగటున లెక్క వేసి ఆ మేరకు యూనిట్లకు పెరిగిన విద్యుత్‌ చార్జీలను వర్తింపజేసి అదనంగా రావాల్సిన మొత్తాన్ని మే బిల్లులో వేస్తున్నాయి. ‘ఏప్రిల్‌ 1, 2022 నుంచి కొత్త టారిఫ్‌ ప్రకారం రావాల్సిన మొత్తాన్ని మే బిల్లులో వేయడం జరిగింది’అని బిల్లు కింద ముద్రిస్తున్నారు.

వాస్తవానికి ఏప్రిల్‌ 1–15 కాలానికి పాత విద్యుత్‌ చార్జీల ప్రకారం ఇప్పటికే వినియోగదారులు బిల్లులు చెల్లించారు. కొత్త విద్యుత్‌ చార్జీల ప్రకారం అదనంగా రావాల్సిన బిల్లులను ఇప్పుడు వసూలు చేసుకుంటున్నాయి. గతంలో విద్యుత్‌ చార్జీలు పెరిగిన సందర్భాల్లో ఇలా అదనపు చార్జీలు వసూలు చేసిన దాఖలాల్లేవని అధికారులు పేర్కొంటున్నారు.  

మరిన్ని వార్తలు