1,500 ఏళ్ల క్రితమే పట్నం చిత్రాలు?

17 Jan, 2022 03:17 IST|Sakshi

సిరిసిల్ల జిల్లాలో అంతుచిక్కని రాక్‌ఆర్ట్‌

సాక్షి, హైదరాబాద్‌: కొమురవెల్లి మల్లికార్జున దేవాలయం, ఇతర దేవాలయాల్లోనూ జాతరలసమయంలో పట్నం ముగ్గు వేయడం ఆచారం. అయితే దాదాపు 1,500 ఏళ్ల కిందటే ఈ తరహా చిత్రాలను ఓ పెద్ద బండరాతిపై వేసిన విషయం తాజాగా వెలుగు చూసింది. చూడడానికి కొంత భిన్నంగా ఉన్నా.. అది పట్నం ముగ్గు లాంటిదేనని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. ఆదిమానవులు బండ రాళ్లపై చెట్ల పసరు, జంతు రక్తం, చమురు, రంగురాళ్ల పొడితో ఎర్ర రంగు తయారుచేసి గీసిన బొమ్మలు చాలాచోట్ల వెలుగు చూశాయి.

అలాగే ఇక్కడ కూడా ఎర్ర రంగుతో ఈ చిత్రాలు వేసి ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా పోతిరెడ్డిపల్లె గ్రామ శివారులోని అడవిలో శితారి (చిత్తారు)గట్టు మైసమ్మ గుట్టమీద వీటిని గుర్తించారు. వీటిని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు శివానంద వెలుగులోకి తెచ్చారని ఆ బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ వెల్లడించారు. అందులో వృత్తం, వాటిలోపల మళ్లీ వృత్తాలు, మధ్యలో చేతులెత్తి నిలబడ్డ మనిషి ఆకృతిని పోలిన చిత్రం, వృత్తం నుంచి బయటకు పొడుచుకొచ్చినట్టుగా కిరణాలు గీశారు. స్థానికులు దీన్ని మైసమ్మగా కొలుస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇవి మత, ధార్మిక విశ్వాసాలకు సంబంధించినవని, 1,500 ఏళ్లకు పూర్వం గీసినవై ఉంటాయని హరగోపాల్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు