Telangana: వీఆర్‌ఏల సమ్మె విరమణ

13 Oct, 2022 04:09 IST|Sakshi

డిమాండ్లను పరిష్కరిస్తామన్న సీఎస్‌ హామీ మేరకు నిర్ణయం

నేటి నుంచి విధుల్లోకి వీఆర్‌ఏలు

సాక్షి, హైదరాబాద్‌: 83 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించాలని వీఆర్‌ఏలు నిర్ణయించారు. వీఆర్‌ ఏల పట్ల ప్రభుత్వం సానుభూతితో ఉందని, ప్రస్తుతం అమలులో ఉన్న ఎన్నికల నియమావళి ఎత్తివేయగానే వారి డిమాండ్లను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ హామీ ఇచ్చారు. వీఆర్‌ఏలందరూ తక్షణమే విధులకు హాజరు కావాలని సూచించారు. దీంతో గురువారం నుంచి విధులకు హాజరవుతామని వీఆర్‌ఏలు చెప్పారు. వీఆర్‌ఏల ప్రతినిధులు, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) నాయకులతో సోమేశ్‌కుమార్‌ బుధవారం బీఆర్కేఆర్‌ భవన్‌లో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా  వీఆర్‌ఏలు తమ డిమాండ్లను సీఎస్‌కు విన్నవించారు. పే స్కేల్‌ వర్తింపు, సర్వీస్‌ నిబంధనలు, ప్రమోషన్లు, సమ్మె కాలానికి వేతనం, కేసుల ఎత్తివేత, సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా ప్రకటించడం, సమ్మెకాలంలో మరణించిన వీఆర్‌ఏల కుటుంబాలకు పరిహారం చెల్లింపు, వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం తదితర డిమాండ్లను వివరించారు. ఈ సమావేశంలో ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌ కుమార్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, వీఆర్‌ఏ జేఏసీ సెక్రెటరీ జనరల్‌ దాదే మియా, కన్వీనర్‌ డి.సాయన్న తదితరులు పాల్గొన్నారు.

హామీ ఇచ్చారు: ట్రెసా అధ్యక్షులు రవీందర్‌ రెడ్డి
‘వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరిస్తామని సీఎస్‌ హామీ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక దృష్ట్యా నవంబరు 7 తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వీఆర్‌ఏలు గురువారం నుంచి విధులకు హాజరవుతారు’అని సీఎస్‌తో చర్చల అనంతరం ట్రెసా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి తెలిపారు. 

చదవండి: Munugode Bypoll: తగ్గేదేలే..!.. ఇప్పటికే రూ.150 కోట్లు ఖర్చు

మరిన్ని వార్తలు