ఇదీ సంగతి: అర్హతలేని అధ్యాపకులు... అనుభవం లేని ప్రిన్సిపాళ్లు! 

8 Sep, 2021 00:53 IST|Sakshi

రాష్ట్రంలోని 90% ఇంజనీరింగ్‌ కాలేజీల్లో నాణ్యత డొల్ల

జేఎన్‌టీయూహెచ్‌ త్రిసభ్య కమిటీ పరిశీలనలో వెలుగులోకి

ఈసారికి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వంపై యాజమాన్యాల ఒత్తిడి

అఫిలియేషన్‌ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 90 శాతం ఇంజనీరింగ్‌ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు దారుణంగా ఉన్నాయని గుర్తించినట్లు జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ–హెచ్‌) వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి కాలేజీలకు ఈసారి గుర్తింపు ఇవ్వలేమని తేల్చి చెప్పాయి. అయితే ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి.

కరోనా నేపథ్యంలో నిబంధనల అమలు కచ్చితంగా పాటించడం సాధ్యం కాదని, ఈసారికి మినహాయింపు ఇవ్వాలంటున్నాయి. దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో జేఎన్‌టీయూ–హెచ్‌ అఫిలియేషన్‌ ప్రక్రియ మరికొంత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇది పూర్తయితేనే ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు జరుగుతుంది. 

కమిటీ తేల్చిందేంటి? 
రాష్ట్రవ్యాప్తంగా 148 ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉండగా వాటిల్లో 955 కోర్సులను నిర్వహిస్తున్నారు. 2021–22 లెక్కల ప్రకారం ఆయా కాలేజీల్లో 89,400 ఇంజనీరింగ్‌ సీట్లున్నాయి. వాటన్నింటికీ అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతి ఉంది. అయితే ఈ విద్యా సంవత్సరానికి జేఎన్‌టీయూ–హెచ్‌ అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో స్థితిగతులు తెలుసుకొనేందుకు ఎంసెట్‌ నిర్వహణకు ముందే జేఎన్‌టీయూ త్రిసభ్య కమిటీని నియమించింది.

ఈ కమిటీ ఇంజనీరింగ్‌ కాలేజీల్లోని మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల వివరాలను సేకరించింది. జేఎన్‌టీయూ వర్గాలు పేర్కొన్న దాని ప్రకారం త్రిసభ్య కమిటీ గుర్తించిన విషయాలు ఇవీ... 
రాష్ట్రంలోని 90 శాతం కాలేజీల్లో మౌలిక వసతుల లేమి కనిపించింది. సీఎస్‌ఈ కోర్సులకు కీలకమైన ఆధునిక కంప్యూటర్లు లేవు. అవసరమైన సాఫ్ట్‌వేర్‌ సైతం అందుబాటులో లేదు. కొన్ని కాలేజీల్లో ఇంకా కాలం చెల్లిన కంప్యూటర్లే కనిపించాయి. 
అనుభవం లేని అధ్యాపకులు, అర్హతల్లేని ప్రిన్సిపాళ్లతో మొక్కుబడిగా నడుస్తున్నాయి. 
చాలా కాలేజీలు అధికారికంగా చూపించే ఫ్యాకల్టీ అధ్యాపకులు కనిపించలేదు. 
దాదాపు ఐదేళ్లుగా పేరున్న ఒక్క కంపెనీ కూడా ఆయా కాలేజీల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టిన దాఖలాల్లేవు. 

ఏఐసీటీఈ నిబంధనలు ఏం చెబుతున్నాయి... 
కాలేజీ ప్రిన్సిపాల్‌ పీహెచ్‌డీ చేసి ఉండాలి. కనీసం 15 ఏళ్ల అధ్యాపక అనుభవం కలిగి ఉండాలి. ఇద్దరు పీహెచ్‌డీ విద్యార్థులకు మార్గదర్శిగా పనిచేసి ఉండాలి.  
సైన్స్, హ్యుమానిటీస్‌ సబ్జెక్టులు బోధించే అధ్యాపకులు తప్పనిసరిగా పీహెచ్‌డీ చేసి ఉండాలి. ఇది లేనప్పుడు నెట్, స్లెట్‌.. ఏదో ఒకటి చేసుండాలి. 
కాలేజీలు ఎంపిక చేసే అధ్యాపకులను అఫిలియేషన్‌ ఇచ్చే యూనివర్సిటీ పరిశీలించి, ఆమోదించాలి. బోధించే అర్హతలున్నాయా లేదా అని పరీక్షించిన తర్వాతే గుర్తింపు ఇవ్వాలి.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు