Telangana : మద్యం దుకాణాలకు ‘రోస్టర్‌ పాయింట్లు’

8 Nov, 2021 01:48 IST|Sakshi

రిజర్వేషన్ల అమలు విధివిధానాలను ప్రకటించిన ఎక్సైజ్‌ శాఖ

మొదటి టోకెన్‌ ఎస్టీలకు, ఆ తర్వాత ఎస్సీ, గౌడలకు వరుసగా కేటాయింపు

డ్రా పద్ధతిలోనే రిజర్వ్‌డ్‌ దుకాణాలు

మిగిలినవి అన్ని వర్గాలకు ఓపెన్‌..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లను రోస్టర్‌ పాయింట్ల పద్ధతిలో అమలు జరపాలని ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనలను రూపొందించింది. ఎక్సైజ్‌ శాఖ రూపొందించిన నిబంధనల ప్రకారం 2021–23 సంవత్సరాలకు గాను రాష్ట్రంలోని వైన్‌ (ఏ4) షాపుల్లో 30 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఇందులో గౌడ్‌లకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తారు. ఈ రిజర్వేషన్లను అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్లు ముందుగా డ్రాలు తీయాల్సి ఉంటుంది.

జిల్లా ఎక్సైజ్‌ అధికారి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులతో కూడిన కమిటీ ముందు వీడియో చిత్రీకరణ చేస్తూ ఈ డ్రాలు తీయాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ఆ డ్రాలలో వచ్చిన షాపులను ఈ మూడు వర్గాలకు కోటా మేరకు కేటాయిస్తారు. కోటా పూర్తయిన తర్వాత మిగిలిన షాపులను ఓపెన్‌ కేటగిరిలో అన్ని వర్గాలకు అందుబాటులో ఉంచుతారు. ఎక్సైజ్‌ శాఖ రూపొందించిన నిబంధనల ప్రకారం.. ముందుగా జిల్లాలో ఉన్న షాపులన్నింటికీ నంబర్లు కేటాయించి టోకెన్ల రూపంలో ఒక ఖాళీ డబ్బాలో పోయాలి. ఆ డబ్బా నుంచి ఒక్కో టోకెన్‌ బయటకు తీయాలి. మొదటి టోకెన్‌ షాపును ఎస్టీలకు, ఆ తర్వాత వచ్చే టోకెన్‌ను ఎస్సీలకు, ఆ తర్వాతి దాన్ని గౌడ సామాజిక వర్గాలకు కేటాయించాలి. ఈ కోటా పూర్తయిన తర్వాత డబ్బాలో మిగిలిన టోకెన్‌ నంబర్లున్న షాపులను ఓపెన్‌ కేటగిరీ డ్రాల కోసం నోటిఫై చేస్తారు. 

షెడ్యూల్డ్‌ ఏరియాలో అన్నీ ఎస్టీలకే..
రాష్ట్రంలోని షెడ్యూల్డ్‌ ప్రాంతాల పరిధిలోనికి వచ్చే షాపులన్నింటినీ గిరిజనులకే కేటాయించాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ షాపులన్నీ ఎస్టీలకు రిజర్వ్‌ చేయనున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లోని షాపులను సాధారణ డ్రా నుంచి మినహాయించనున్నారు. ఈ షాపులకు ఎస్టీలకు ఇస్తున్నందున మైదాన ప్రాంతాల్లోని షాపుల్లో ఎస్టీలకు పరిమిత సంఖ్యలో మాత్రమే కేటాయించనున్నారు. 

మరిన్ని వార్తలు