ఎయిమ్స్‌ తరహాలో నాలుగు టిమ్స్‌లు

7 Dec, 2021 02:46 IST|Sakshi

నగరానికి నలువైపులా ఏర్పాటు 

గచ్చిబౌలి, సనత్‌నగర్, ఎల్బీనగర్, అల్వాల్‌లో సన్నాహాలు 

త్వరలో సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన 

మంత్రి హరీశ్‌రావు వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: టిమ్స్‌ (తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) తరహాలో హైదరాబాద్‌ నగరానికి నలువైపులా నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గచ్చిబౌలి, సనత్‌నగర్, ఎల్బీనగర్, అల్వాల్‌లో వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌ తరహాలో వీటి సేవలు ఉండాలని సూచించారు.

ఆయా ప్రాంతాల్లోని కంటోన్మెంట్, ఎయిర్‌పోర్టుల నిబంధనలు కూడా పరిగణనలోకి తీసుకొని నమూనాలు తయారు చేయాలని కోరారు. ఒక్కొక్కటి వెయ్యి పడకల సామర్ధ్యంతో కూడిన ఈ ఆసుపత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో శంకుస్థాపన చేస్తారని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి వివిధ అంశాలపై మంత్రి హరీశ్‌రావు సోమవారం వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు.  

వరంగల్‌ ఆసుపత్రికి టెండర్లు పూర్తి చేయండి 
వరంగల్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. జనవరి మొదటి వారంలో నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వరంగల్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తయితే రాష్ట్రానికి మెడికల్‌ హబ్‌గా మారుతుందని చెప్పారు. మరోవైపు పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలోని కార్మికులకు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందేలా మరో కొత్త ఆసుపత్రిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.

ఈ మేరకు త్వరగా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రూ.150 కోట్లతో 200 పడకల ఆసుపత్రి నిర్మాణానికి తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఎనిమిది కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాలు వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాకొక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు.  

20 ఆసుపత్రులకు సీవరేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్లు 
రాష్ట్రంలోని గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం, టిమ్స్, నీలోఫర్‌ సహా వివిధ జిల్లాల్లోని 20 ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీవరేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. సుమారు రూ.59.25 కోట్ల విలువైన పనులకు త్వరలో టెండర్లు పిలవాలని ఆదేశించారు. 

వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయండి 
రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. రెండో డోసుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. కరోనాకు సంబంధించి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

ఈ సమీక్షల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, వాణిజ్య పన్నుల శాఖ అధికారి నీతు కుమారి ప్రసాద్, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌ రెడ్డి, డీఎంఈ రమేష్‌ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్‌ రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, అధికారులు చంద్రశేఖర్‌ రెడ్డి, గణపతి రెడ్డి పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు