భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టుగా నిర్మిద్దాం

1 Dec, 2021 03:28 IST|Sakshi

మెడికల్‌ కాలేజీలపై ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకొక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇందులో భాగంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న వరంగల్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి సహా 8 మెడికల్‌ కాలేజీల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నూతన మెడికల్‌ కాలేజీల నిర్మాణంపై మంగళవారం బీఅర్‌కే భవన్‌లో వైద్య ఆరోగ్య, అర్‌అండ్‌బీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

మెడికల్‌ కాలేజీలు త్వరగా పూర్తి చేస్తే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని, నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ నిబంధనల ప్రకారం అన్ని కాలేజీలు ఉండాలని అన్నారు. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునే విధంగా నిర్మాణాలు ఉండాలని సూచించారు. ప్రతి పేద బిడ్డకు జిల్లా పరిధిలోనే నాణ్యమైన వైద్య సేవలు అందాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలను సాకారం చేసేలా పనులు వేగవంతం చేయాలని కోరారు.

నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో లక్ష్యాన్ని చేరుకుంటున్న నేపథ్యంలో.. విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పల్లె దవాఖానాల ద్వారా గ్రామీణులకు ఎంబీబీఎస్‌ వైద్యుల సేవలు, మెడికల్‌ కాలేజీల ద్వారా సమీపంలోనే సూపర్‌ స్పెషాలిటీ వైద్యుల సేవలు అందుతాయన్నారు. దీంతో ప్రాథమిక దశలోనే రోగాలకు చికిత్స అందించడం సాధ్యమవుతుందని చెప్పారు. సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్‌రెడ్డి, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ గణపతిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు