భారీ మోసం: సెలైన్‌ నింపి రెమిడెసివిర్‌గా బురిడీ

2 May, 2021 14:46 IST|Sakshi

ఒక్కో ఇంజెక్షన్‌ రూ. 30 వేలకు విక్రయం 

ఇద్దరు నిందితుల అరెస్టు

నిజామాబాద్‌ అర్బన్‌: రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌ ఖాళీ బాటిల్‌లో సెలైన్‌ వాటర్‌ నింపి బ్లాక్‌లో రూ.30 వేలకు విక్రయించిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రిలో జరిగింది. జిల్లాలోని ఆర్మూర్‌ మండలం చేపూర్‌ గ్రామానికి చెందిన మహేశ్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఇటీవల కరోనా వైరస్‌ సోకగా ఆర్మూర్‌లోని లైఫ్‌లైన్‌ ఆస్పత్రిలో ఈనెల 22న చేరాడు. చికిత్స పొందుతున్న సమయంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తీసుకెళ్లిపోవాలని ఆస్పత్రి వైద్యులు చెప్పారు. దీంతో బాధితుడి బంధువులు మహేశ్‌ను నిజామాబాద్‌లోని అంకం ప్రైవేటు ఆస్పత్రిలో ఈ నెల 24న చేర్చారు. అక్కడి వైద్యులు రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌ తెచ్చుకోవాలని చెప్పడంతో.. మహేశ్‌ తమ్ముడు రంజిత్‌ ఇంజెక్షన్ల కోసం ఆర్మూర్‌లోని లైఫ్‌లైన్‌ ఆస్పత్రిని సంప్రదించాడు.

అక్కడి వైద్యుడు సాయికృష్ణనాయుడు నిజామాబాద్‌లోని శ్రీకాంత్‌గౌడ్‌ను కలవాలని సూచించాడు. నిజామాబాద్‌లోని తిరుమల ప్రైవేటు ఆస్పత్రిలో శ్రీకాంత్‌గౌడ్‌ రోజువారీ వేతనంతో మేల్‌ స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తున్నాడు. శ్రీకాంత్‌గౌడ్‌ను రంజిత్‌ కలవగా రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌ ఒక్కోటి రూ.30 వేలు ఉంటుందని చెప్పాడు. గత్యంతరం లేక మూడు ఇంజెక్షన్లను రూ.90 వేలకు కొనుగోలు చేశాడు. అనంతరం మళ్లీ మరో 3 ఇంజెక్షన్లను రూ.90 వేలకు కొన్నాడు. రెండోసారి కొనుగోలు చేసిన మూడు ఇంజెక్షన్లు నకిలీవని అంకం ఆస్పత్రి వైద్యుడు అనుమానించాడు. ఆ ఇంజెక్షన్లు వాడినట్లు మార్క్‌లు కన్పించడంతో పరిశీలించి అందులో సెలైన్‌ వాటర్‌ ఉన్నట్లు గుర్తించాడు. ఈ విషయాన్ని కరోనా బాధితుడు మహేశ్‌కు తెలిపాడు. మహేశ్‌ తన తమ్ముడు రంజిత్‌కు చెప్పగా, ఆయన వెళ్లి శ్రీకాంత్‌గౌడ్‌ను నిలదీశాడు.

దీంతో ఆ మూడు ఇంజెక్షన్ల డబ్బులు వెనక్కి ఇచ్చేశాడు. అయితే ఈ సంఘటనపై ఒకటో టౌన్‌ పోలీసులకు రంజిత్‌ ఈ నెల 26న ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన టౌన్‌ ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు తిరుమల ఆస్పత్రిపై దాడి చేసి శ్రీకాంత్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో నిజం ఒప్పుకొన్నాడు. తిరుమల ఆస్పత్రిలో వాడిపారేసిన రెమిడెసివిర్‌ ఖాళీ బాటిల్‌లో నిందితుడు సెలైన్‌ వాటర్‌ నింపినట్లు గుర్తించారు. లైఫ్‌లైన్‌ ఆస్పత్రి వైద్యుడు సాయికృష్ణనాయుడు, ఇంజెక్షన్లు విక్రయించిన శ్రీకాంత్‌గౌడ్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి మూడు నకిలీ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఎంతమందికి సెలైన్‌ వాటర్‌ను రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లుగా విక్రయించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

.

చదవండి: ఘోరం.. 577 మంది టీచర్లు కరోనాకు బలి
చదవండి: ఇప్పటివరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే..


నిజామాబాద్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్న సెలైన్‌ వాటర్‌తో నింపిన రెమెడిసివర్‌ వ్యాక్సిన్‌

>
మరిన్ని వార్తలు