వైరల్‌: ‘మీ మాట నమ్మిన.. కన్నతండ్రి లెక్క’

24 Oct, 2020 18:31 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటలు నమ్మి తీవ్రంగా నష్ట పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశాడో రైతు. తమను ఆదుకోవాలని, లేకుంటే చావే శరణ్యమని కంటతడి పెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన రైతు, టీఆర్‌ఎస్‌ కార్యకర్త మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పిలుపు మేరకు సన్నరకం వరి తెలంగాణ సోనా సాగు చేశాడు. దీంతో తీవ్రంగా నష్టపోయాడు. మూడున్నర ఎకరాల్లో సన్న వరి సాగు చేసి, ఎకరానికి 50 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాడు. దోమపోటు, అగ్గితెగులు, కాటుక రోగం సోకి పంట విపరీతంగా పాడైంది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన ఓ వీడియో ద్వారా తన ఆవేదనను వెల్లబోసుకున్నాడు. దొడ్డు వరి సాగు చేస్తే ఎకరానికి 20 వేల రూపాయల పెట్టుబడి మాత్రమే అయ్యేదని, ఇంత నష్టం జరిగేది కాదని తెలిపాడు. (‘కేసీఆర్‌ను ఓడిస్తేనే అన్ని అమలు అవుతాయి’)

సన్న వరి సాగుచేసి అప్పులపాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్నాడు.‌ ఇప్పటికైనా అధికారులను క్షేత్ర స్థాయిలోకి పంపించి పంట నష్టాన్ని పరిశీలించి రైతులను ఆదుకోవాలని, లేకుంటే చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో పంట నష్టం జరిగితే ఎంతో కొంత పరిహారం చెల్లించి రైతులను ఆదుకున్నారని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నాడు. పార్టీల పరంగా మాట్లాడడం లేదని, ఒక రైతుగా ఆవేదనను చెబుతున్నానని అన్నాడు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా