పసుపే.. పోచమ్మ తల్లి.. 

21 Feb, 2023 01:23 IST|Sakshi

తరాలుగా పసుపునే సాగు చేస్తున్న రైతు కుటుంబాలు.. పంటను దేవతగా భావిస్తూ జాగ్రత్తలు 

స్నానం చేశాకే, చెప్పులు లేకుండా పొలంలోకి.. 

అంటు, ముట్టు ఉన్నప్పుడు పసుపు పంటకు దూరం 

నియమ నిష్టల మధ్య తొమ్మిది నెలల పాటు సాగు 

రాష్ట్రంలో సుమారు 2లక్షల ఎకరాల్లో పసుపు పంట..  

అత్యధికంగా నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్‌ జిల్లాల్లో సాగు 

నిజామాబాద్‌ మార్కెట్‌కు ఏటా 10 లక్షల క్వింటాళ్ల పసుపు 

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌
కర్మభూమిగా పేరున్న భారత ఉప ఖండంలో పసుపును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తుంటారు. శుభకార్యాల నుంచి పూజల దాకా అన్నింటా పసుపును ప్రత్యేకంగా వినియోగిస్తారు. మరి అలాంటి పసుపు పంటను పండించే రైతులు కూడా ఎంతో నియమ నిష్టలతో ఉంటారు. పసుపు పంటను పోచమ్మ తల్లిగా భావిస్తూ కచ్చితమైన పద్ధతులు, జాగ్రత్తలను పాటిస్తారు.

ఉదయమైనా, సాయంత్రమైనా స్నానం చేశాకే పంట చేనులోకి వెళతారు. చెప్పులను కూడా చేను బయటే వదిలేస్తారు. అంటు, ముట్టు వంటివి పాటించే సమయంలో సదరు రైతు కుటుంబాల వారు చేనులోకి అడుగుకూడా పెట్టరు. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్‌ తదితర జిల్లాల్లో తరతరాలుగా ఇలా పసుపును సాగు చేస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆశించిన లాభాలు రాకున్నా ‘పోచమ్మ తల్లి’పంటగా భావిస్తూ సంప్రదాయంగా సాగు చేస్తున్నవారు చాలా మంది ఉన్నారు. 

తాతముత్తాతల నాటి నుంచీ పండిస్తున్నాం.. 
మేం తాతముత్తాతల నాటి నుంచీ పసుపు పంట సాగు చేస్తున్నాం. పసుపు మా తల్లి పంట. పుట్టి పసుపు (రెండు క్వింటాళ్లు) అమ్మితే తులం బంగారం వచ్చేదని మా తాతలు చెప్పేవారు. ఇప్పటికీ ఇతర పంటల ఆదాయం ఖర్చులకు పోయినా పసుపుపై మిగులు ఉంటుందనే నమ్మకంతో సాగు చేస్తుంటాం. ధర లేకపోవడంతో ఈ సాగు కొంత తగ్గించాం. కానీ అసలు సాగు చేయకుండా మాత్రం ఉండలేం. తల్లి పంట కావడంతో ఒకసారి లాభం రాకున్నా మరోసారి వస్తుంది.
–గడ్డం కళావతి, మహిళా రైతు, రెంజర్ల, ముప్కాల్‌ మండలం, నిజామాబాద్‌ జిల్లా

నిజామాబాద్‌ మార్కెట్‌కు ఏటా 10 లక్షల క్వింటాళ్లు 
రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌కు ఏటా సుమారు 10 లక్షల క్వింటాళ్ల వరకు పసుపు పంట వస్తుంది. ఇక రాష్ట్రంలో మొత్తంగా సుమారు రెండు లక్షల ఎకరాల్లో పసుపు సాగవుతోంది. ఇందులో అత్య ధికంగా నిజామాబాద్‌ జిల్లాలో 35 వేల ఎకరా లు, జగిత్యాలలో 25,000, నిర్మల్‌లో 20,000, వరంగల్‌లో 6,000, మహబూబాబాద్‌ 4,500, వికారాబాద్‌లో 3,500, హన్మకొండ 2,800, భూపాలపల్లి 1,200 ఎకరాల్లోనూ, ఆదిలాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, కరీంనగర్‌ జిల్లాల్లో ఓ మోస్తరుగా పసుపు సాగవుతోంది. సాధార ణంగా ఎకరానికి 120 నుంచి 140 క్వింటాళ్ల పచ్చి పసుపు దిగుబడి వస్తుంది.

దానిని ఉడకబెట్టి పాలిష్‌ చేస్తే 22–25 క్వింటాళ్లు అవుతుంది. రాష్ట్రంలో సాధారణంగా పండించే పసుపు లో 3% వరకు ‘కర్క్యుమిన్‌’ (ఔషధ లక్షణా లున్న రసాయనం) ఉంటోంది. వైఎస్‌ సీఎంగా ఉన్న సమయంలో బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్‌పల్లిలో 30 ఎకరాల్లో వ్యవసాయ వర్సిటీకి అనుబంధంగా పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయించారు. ఆ పరిశోధన కేంద్రంలో 4% ‘కర్క్యుమిన్‌’వచ్చే దుగ్గిరాల ఎరుపు, పీసీటీ పసుపు వంగడాలను అభివృద్ధి చేశారు.

పోచమ్మ తల్లిగా భావిస్తాం.. 
పసుపు పంటను పోచమ్మ తల్లిగా భావిస్తాం. ఈ పంట ఉంటేనే మిగతా వ్యవసాయం కలసి వస్తుందనేది మా నమ్మకం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పసుపు సాగు చేయని ఏడాది లేదు. అంటు ముట్టు ఉన్నప్పుడు పసుపు తోటలోకి వెళ్లం. 
– కాశారం లత, మహిళా రైతు, మెండోరా 

మార్కెట్‌కు అనుగుణంగా సాగు చేస్తున్నా 
ఎనిమిదేళ్లుగా కొత్త వంగడాల పసుపు సాగు చేస్తున్నా. మార్కెట్‌ డిమాండ్‌కు తగినట్టుగా కర్క్యుమిన్‌ శాతం అధికంగా 4–5 శాతం ఉండే రాజేంద్ర సోనియా, ఏసీసీ–79, ప్రగతి, పీతాంబర్, రాజేంద్ర సోనాల, రాజపురి, బీఎస్సార్‌–2 రకాలను వేస్తున్నా. తెగుళ్లు సోకకుండా ఎత్తు మడుల పద్ధతి పాటిస్తున్నా. 
– నలిమెల చిన్నారెడ్డి, యువరైతు, మగ్గిడి, ఆర్మూర్‌ మండలం

రాష్ట్రంలో పెద్ద పసుపు మార్కెట్‌ ఇక్కడే.. 
నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌కు రాష్ట్రంలోనే అత్యధికంగా పసుపు వస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ప్రతి సీజన్‌లో భారీగానే పసుపు వస్తోంది. డిమాండ్‌కు అనుగుణంగా ధర లభిస్తోంది.     
– వెంకటేశం, మార్కెటింగ్‌ శాఖ ఉప సంచాలకుడు 

మరిన్ని వార్తలు