తెలంగాణ రైతుల మెడపై.. ‘డిఫాల్టర్‌ కత్తి’!.. ఇప్పుడెలా?

21 May, 2022 01:29 IST|Sakshi

వానాకాలం సీజన్‌ సమీపిస్తుండటంతో పెట్టుబడి కోసం రైతుల ప్రయత్నాలు 

కొత్త రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న బ్యాంకులు 

16 లక్షల మంది రైతులపై ‘డిఫాల్టర్‌’ ముద్ర.. రుణమాఫీ సజావుగా సాగక ఇబ్బందులు 

36.68 లక్షల మంది అర్హుల్లో 5.66 లక్షల మందికే మాఫీ 

సాక్షి, హైదరాబాద్‌: మరో పదిరోజుల్లో వానాకాలం సీజన్‌ ప్రారంభం కానుంది. దీంతో రైతులు సాగుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అవసరమైన పెట్టుబడుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదే క్రమంలో చాలామంది రైతులు బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. కానీ బ్యాంకులు వారికి రుణాలిచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. రైతులను రుణ ఎగవేతదారులుగా (డిఫాల్టర్లు) ముద్ర వేస్తున్న బ్యాంకులు..వారు కొత్త రుణాలు పొందేందుకు అనర్హులుగా పేర్కొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 16 లక్షల మంది రైతుల మెడపై ఈ విధమైన ‘డిఫాల్టర్‌ కత్తి’ వేలాడుతోంది.   

రుణమాఫీ జరగక..రైతులు చెల్లించక 
బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు ఉపశమనం కోసం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని అధికార టీఆర్‌ఎస్‌ 2018 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అయితే ఈ రుణమాఫీ ప్రక్రియ సజావుగా సాగడం లేదు. రుణమాఫీ జరుగుతుందనే ఉద్దేశంతో రైతులు బకాయిలు చెల్లించలేదు. ఇలా రుణమాఫీ కాక కొందరు, అంతకుముందు పాత బకాయిలు పేరుకుపోయి మరికొందరు రైతులు బ్యాంకు డిఫాల్టర్లుగా మారిపోయారు.

రాష్ట్రంలో ప్రతి ఏటా సగటున 42 లక్షల మంది వరకు రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటారు. రుణం తీసుకున్న రైతులు మూడు సీజన్లలోగా పూర్తి బకాయిలు చెల్లిస్తేనే తదుపరి రుణం తీసుకోవడానికి అర్హులవుతారు. అయితే ప్రభుత్వం 2018లో రుణమాఫీని ప్రకటించినా నిధులు తగినంతగా విడుదల చేయలేదు. మరోవైపు రైతులు తమ బకాయిలను చెల్లించలేదు. మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ.19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.

ఈ నాలుగేళ్లలో రుణమాఫీ కోసం రూ. 20,164.20 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినా, అందులో రూ.1,171.38 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. 2021 ఆగస్టులో రూ.25 వేల నుంచి రూ. 50 వేల మధ్య రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం రూ. 1,790 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు (రూ.25 వేల నుంచి రూ.37 వేల లోపు రుణాలు) రూ.763 కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేసింది. ఇవి కాకుండా లక్షలోపు రుణాల కోసం ఇంకా రూ.18 వేల కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉంది. మొత్తంగా ఇప్పటివరకు 5.66 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ కాగా, మరో 31 లక్షల మందికి చెల్లించాల్సి ఉంది. 

బకాయిలు చెల్లించాలని సర్కారు విన్నపం... 
కేవలం రూ.37 వేల వరకు మాత్రమే రుణమాఫీ జరగ్గా మిగిలిన వారికి రెన్యువల్‌ సమస్య వచ్చింది. రెన్యువల్‌ చేసుకోకపోతే డిఫాల్టర్లుగా మారతారు. అయితే చాలామంది రైతుల నుంచి రైతుబంధు సొమ్మును బ్యాంకులు బకాయిల కింద జమ చేసుకున్నాయి. మరోవైపు రుణం పొందాలంటే రెన్యువల్‌ చేయాల్సి ఉంటుంది కాబట్టి రైతులు తొలుత బకాయిలు చెల్లించాలని, తర్వాత రుణమాఫీ సొమ్మును వారి ఖాతాలో వేస్తామని ప్రభుత్వం సూచించింది.

ఈ మేరకు కొందరు రైతులు అలా చెల్లించగా, మరి కొందరు రైతులు మాత్రం డబ్బులు లేకపోవడంతో బ్యాంకులకు చెల్లించలేకపోయారు. ఇలా 10 లక్షల మంది వరకు రైతులు డిఫాల్టర్లుగా మిగిలినట్లు అంచనా. వీరుగాక మరో ఆరు లక్షల మంది రైతులు రుణమాఫీ ప్రకటన వర్తింపు తేదీకి ముందు తీసుకున్న రుణాలను చెల్లించకపోవడంతో డిఫాల్టర్లుగా మారారు.  

మరిన్ని వార్తలు