‘సర్వే’త్రా నిరీక్షణ!  

1 Aug, 2020 04:51 IST|Sakshi

ఏళ్ల తరబడి భూముల సర్వేకు ఎదురుచూపులు 

భూవివాదాల పెండింగ్‌కు సర్వే విభాగమే కారణమన్న విమర్శలు 

సర్వేయర్లకు వాహన సౌకర్యం, ఇతర సేవలూ రైతుల వంతే.. 

రాష్ట్రవ్యాప్తంగా 1,697 పోస్టుల్లో 732 ఖాళీ

సాక్షి, హైదరాబాద్‌: గట్టు తగవుల గుట్టు విప్పాలన్నా... భూవివాదాలకు తెరదించాలన్నా.. శిఖం పంచాయితీలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలన్నా... ఆక్రమణల నిగ్గు తేల్చాలన్నా... భూసేకరణ చేపట్టాలన్నా... అన్నింటికీ సర్వరోగ నివారిణి భూసర్వేనే. కానీ, రాష్ట్రంలో సర్వేత్రా సర్వేయర్ల కొరత పీడిస్తోంది. భూముల కొలతల చిక్కులకు శాశ్వత పరిష్కారం చూపే సర్వే వ్యవస్థే పరోక్షంగా భూవివాదాలకు కారణమవుతోందన్న విమర్శలున్నాయి.

సర్వే ప్రక్రియ పూర్తి చేస్తే కొలిక్కి వచ్చే వివాదాలు కూడా సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉంటున్నాయి. భూసర్వే, రికార్డుల (సర్వే, ల్యాండ్‌ రికార్డ్స్‌) అనే ఈ కీలక విభాగాన్ని పాలకులు గాలికి వదిలేశారని రైతులు విమర్శిస్తున్నారు. సర్వేయర్ల భర్తీ, అవసరమైన సామగ్రి, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చడం వంటి అంశాలను ప్రభుత్వాలు ఏళ్లుగా పట్టించుకోవడంలేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా రైతుగానీ, పరిశ్రమల స్థాపనకుగానీ భూసర్వే చేయించుకోవడం గగనమైపోయింది. చాలాచోట్ల సర్వేయర్లు దొరకడంలేదు, దొరికినా.. వారి గొంతెమ్మ కోర్కెలు తీరిస్తేగానీ భూముల సర్వే జరిగే పరిస్థితి లేకుండాపోయింది.  

సగం పోస్టులు ఖాళీ..! 
రాష్ట్రవ్యాప్తంగా సగటున మూడు మండలాలకు ఒక సర్వేయర్‌ ఉన్నారు. అంటే... సర్వేయర్ల కొరత ఎంత తీవ్రంగా ఉందో దీనిని బట్టి అర్థమవుతోంది. ఇక మండలానికి ఇద్దరు చొప్పున ఉండాల్సిన చైన్‌మెన్ల జాడేలేదు. 35 ఏళ్ల క్రితం ఉన్న ఉద్యోగుల నిష్పత్తినే ఇంకా కొనసాగిస్తుండటం, ఆ పోస్టుల్లోనూ భారీగా ఖాళీలు ఉండటం భూముల సర్వేపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 1985లో మండల వ్యవస్థ పురుడుపోసుకోవడంతో అప్పటివరకు తాలూకాకు కొనసాగిన ఒక సర్వేయర్‌ను కాస్త మండల పరిధిలో చేర్చారు.

ఒక మండల విధులేగాకుండా పాత తాలూకా పరిధిలోని అన్ని మండలాల బాధ్యతలను ఆ సర్వేయర్‌కే అప్పగించారు. అదే స్థితిని నేటికీ కొనసాగిస్తుండటంతో భూముల సర్వేలో ఎడతెగని జాప్యం ఏర్పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో 1,697 పోస్టులుండగా ఇందులో 965 మందే పనిచేస్తున్నారు. మిగతా 732 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏడాది క్రితం పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా 253 మంది ఎంపిక కాగా, ఇందులో 130 మంది ఇతర ఉద్యోగాలకు వెళ్లిపోయారు. 

అప్పట్లో వివాదాలు.. విధులు తక్కువే
నాలుగైదు దశాబ్దాల క్రితం వరకు భూవివాదాల సంఖ్య అంతంత మాత్రమే. దీంతో భూముల సర్వేలో పెద్దగా తలనొప్పులుండేవికావు. కాలక్రమేణా భూముల విలువలు అమాంతం పెరిగిపోవడంతో సర్వేయర్లపై కూడా పనిభారం పెరిగింది. గజం జాగాకు కూడా పోటీపడటం.. భూ ఆక్రమణలు, దాయాదుల మధ్య వివాదాలు, సరిహద్దు తగాదాలు, సర్వేనంబర్‌ ఒకచోట భూమి మరోచోట ఉండటం, భూముల పంపకంలో తేడాలతో ఒక్కసారిగా భూముల సర్వేకు డిమాండ్‌ పెరిగింది.

ఈ నేపథ్యంలోనే భూముల వాటా లెక్క తేల్చాలని, సరిహద్దులు గుర్తించాలని, హద్దురాళ్లు ఏర్పాటు చేయాలని భూరికార్డుల సర్వే విభాగాన్ని ఆశ్రయించేవారి సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. జిల్లాల పునర్విభజన జరిగినా, కొత్త జిల్లాలకు అనుగుణంగా సిబ్బందిని ప్రభుత్వం కేటాయించనేలేదు. పాత జిల్లాల సిబ్బందినే సర్దుబాటు చేసింది. కొత్త జిల్లా కేంద్రాల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లోనూ భూముల విలువ విపరీతంగా పెరిగింది. గతంలో ఉన్న సమస్యలకు ఇవి కూడా జత కలిశాయి.  

నాలుగోవంతు మండలాల్లో కొరత 
ఒక మండలాన్ని పరిశీలిస్తే సగటున సర్వేయర్, ఇద్దరు చైన్‌మన్లు ఉండాలి. కానీ, రాష్ట్రంలో నాలుగోవంతు మండలాల్లో సర్వేయర్ల కొరత ఉంది. దీంతో ఆయా మండల సర్వేయర్లకే అదనపు బాధ్యతలు అప్పగించడం, ఒక్కో సర్వేయర్‌ పరిధిలో మూడు, నాలుగు మండలాలు ఉండటంతో సర్వే దరఖాస్తులను పరిశీలించడానికి కూడా సమయం సరిపోవడం లేదు. సర్వేయర్‌ను ఫీల్డ్‌కు తీసుకొచ్చి సర్వే చేయించుకోవడానికి రైతులు ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి దాపురించింది. ‘మూలిగే నక్కపై తాటిపండు పడిన’చందంగా.. ప్రభుత్వం సాగునీటి, ఫార్మా, పవర్‌ ప్రాజెక్టుల భూసేకరణకు ఈ సర్వేయర్లను మళ్లించడంతో సమస్య మరింత జటిలమైంది.

రహదారుల విస్తరణ, వక్ఫ్, దేవాదాయ, అటవీ, భూదాన్‌ తదితర కేటగిరీ వారీగా భూముల సర్వే చేపట్టడం కూడా సర్వే సిబ్బందిపై అదనపు భారంగా మారింది. ప్రభుత్వ ప్రాధాన్యత సర్వేలను మొదటగా చేపట్టాల్సి రావడంతో రైతుల భూసర్వేలను పక్కనపెట్టాల్సి వస్తోంది.  క్రమపద్ధతిలో దరఖాస్తులను పరిశీలించి సర్వే నిర్వహించాల్సిన సర్వేయర్లు కొందరు ఇవేవీ పట్టించుకోకుండా పలుకుబడి కలిగిన మోతుబరులు, చేయి తడిపేవారికి సంబంధించిన సర్వేలను ముందు కానిచ్చేస్తున్నారు. ఏమీ ఇచ్చుకోలేని చిన్న, సన్నకారు రైతన్నలు నెలల తరబడి తిరిగితే తప్ప సర్వే చేయించుకోలేకపోతున్నారు. సర్వే నిమిత్తం భూమి వద్దకు రావాలంటే సదరు సర్వేయర్‌కు వాహన సౌకర్యం, గొలుసు ఇతరత్రా సేవలను రైతులే సమకూర్చాల్సి వస్తోంది.

మరిన్ని వార్తలు