కోత కష్టం.. ఆగితే నష్టం

17 Oct, 2022 00:42 IST|Sakshi
మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం రామచంద్రాపూర్‌లో భారీ వర్షానికి నేలకొరిగిన వరి పంట  

పంటల్ని వెంటాడుతున్న వర్షం 

రాష్ట్రంలో కోత దశకు వచ్చిన వానాకాలం పంటలు 

వరి, మొక్కజొన్న, సోయాబీన్‌ కోతలు..పత్తి తీత మొదలు 

వదలకుండా కురుస్తున్న వర్షాలతో ఆటంకం 

పలు చోట్ల రంగు మారుతున్న ధాన్యం .. తడిసి ముద్దవుతున్న పత్తి 

చేతికొచ్చిన పంటలు పాడవుతుండటంతో రైతన్నల ఆందోళన 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో వానాకాలం పంటలు కోత దశకు వచ్చాయి. అనేకచోట్ల వరి, మొక్కజొన్న, సోయాబీన్‌ కోతలు, పత్తితీత మొదలైంది. ఇలాంటి సమయంలో కురుస్తున్న వర్షాలు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. వానాకాలం ప్రారంభదశలో సాగును దెబ్బతీసిన వర్షాలు, తీరా పంటలు చేతికొచ్చే దశలోనూ వెంటాడుతున్నాయి. వర్షాల వల్ల కోతదశలో ఉన్న పంటలు పాడవుతున్నాయి. వాటిని కోయడం కూడా సమస్యగానే మారుతోంది. కోయకుండా పొలాల్లో ఉంచడం వల్ల వరి ధాన్యం రంగు మారుతోంది.

కొన్నిచోట్ల కోతకొచ్చిన సోయాబీన్‌ను రైతులు చేలల్లోనే వదిలేస్తున్నారు. ఇక పత్తి పరిస్థితి ఘోరంగా మారింది. తీత దశల తడిసిపోతుండటంతో పంటదెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఈపంటను మొదటి నుంచీ వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. జూలై నుంచి వర్షాలు మొదలుకాగా అప్పటి నుంచి లక్షలాది ఎకరాల్లో పత్తి పాడైపోయింది. దీంతో ఈసారి పత్తి దిగుబడి గణనీయంగా తగ్గుతుందని అంటున్నారు.  

సీజన్‌ మొదట్లోనూ సమస్యలు 
ఈ ఏడాది వానాకాలంలో 1.43 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా (ఆల్‌టైం రికార్డు) 1.36 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వరి  సాగు లక్ష్యం 45 లక్షల ఎకరాలు కాగా, రికార్డు స్థాయిలో   64.54 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి  సాగు లక్ష్యం 70 లక్షల ఎకరాలు కాగా, 50 లక్షల ఎకరాలకే పరిమితమైంది. వర్షాలతో పత్తి సాగు తగ్గింది. జూలై, ఆగస్టుల్లో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరి నార్లు కొట్టుకు పోయాయి.  

సరఫరా కాని యంత్రాలు... 
రైతులకు వరికోత మిషన్లు అందించడంలో వ్యవసాయ శాఖ విఫలమైంది. ఈ ఏడాది బడ్జెట్లో వ్యవసాయ యంత్రాలకు రూ.500 కోట్లు కేటాయించినా యంత్రాలు సరఫరా కాలేదు.   ఇప్పుడు వరినాటు యంత్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అనుకున్నారు. దీంతో కంపెనీలు 5 వేల వరికోత యంత్రాలను సిద్ధం చేశాయి. ఒక్కో యంత్రం ధర కంపెనీని బట్టి రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది.

అయితే ఈ యంత్రాలను సబ్సిడీపై రైతులకు అందజేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంలో వ్యవసాయశాఖ విఫలమయ్యింది. ఓలా, ఉబర్‌ మాదిరి వ్యవసాయానికి సంబంధించిన భారీ కోత యంత్రాలు బుక్‌ చేసుకుంటే అద్దెకు పంపించేలా కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని వ్యవసాయ శాఖ గతంలో చెప్పినా ఆచరణకు నోచుకోలేదు.  

వరి కోత యంత్రాల కొరత 
ప్రస్తుతం పలు ప్రాంతాల్లో పంటలు కోతకు సిద్ధమయ్యాయి. ఇప్పుడు కూడా వర్షాలు కురుస్తుండటంతో.. ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌గర్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌ తదితర జిల్లాల్లో వేలాది ఎకరాల్లో చేతికొచ్చిన పంట తడిసిపోతోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు వరికోత యంత్రాలు లేకపోవడం సమస్యగా మారింది. వరి రికార్డు స్థాయిలో సాగవడంతో కోత యంత్రాలకు కొరత ఏర్పడుతోంది.  

చేలల్లోనే సోయా.. మొక్కజొన్న మొలకలు 
ఆదిలాబాద్‌ జిల్లాలో కోతకు వచ్చిన సోయా పంటను చేలల్లోనే వదిలేస్తున్నారు. పత్తి తీసే దశకు రాగా వానలకు తడిసి ముద్దయిపోతోంది. కొన్నిచోట్ల తీత మొదలైంది. అక్కడక్కడ కొనుగోళ్లు జరుగుతున్నాయి. కానీ వానల కారణంగా అంతరాయం కలుగుతోంది. జగిత్యాల జిల్లాలో వరి కోతలు ప్రారంభం కాలేదు. కానీ వర్షాలతో భూమి తేమగా మారడంతో పాటు కాలువల ద్వారా నీటిని వదులుతుండటం, వ్యవసాయ బావుల్లో నుండి నీరు ఉబికి వస్తుండటం ఇబ్బందికరంగా మారింది.

టైర్‌ కోత యంత్రాలు (హార్వెస్టర్లు) నడిచే పరిస్థితి లేకుండా పోయింది. చైన్‌ హార్వేస్టర్లు సరిపడా లేవు. ఇక వర్షాల్లో పత్తి తీస్తే ఆరబెట్టడం కష్టం. కాబట్టి ఉష్ణోగ్రతలు పెరిగేవరకు తీసే పరిస్థితి కనిపించడంలేదు. దిగుబడి కూడా గణనీయంగా తగ్గే పరిస్థితి కన్పిస్తోంది. మొక్కజొన్న పంట కోతకు రావడంతో కంకుల బూరు తీసి ఆరబెడుతున్నారు. వర్షాలకు తడవడంతో మొలకలు వస్తున్నాయి.

వరి ఎక్కువగా సాగయ్యే నిజామాబాద్‌ జిల్లాలో ప్రస్తుతం కోతలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 20 శాతం కోతలు పూర్తయ్యాయి. అయితే వర్షాల కారణంగా కోతలు ఆలస్యం అవుతున్నాయి. కోసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ఇబ్బందులెదురవుతున్నాయి. రోడ్లు, కళ్లాల్లో అరబెట్టిన ధాన్యం తడుస్తోంది. కోత కోయని పంట పొలాల్లోనే నేలకొరుగుతోంది. సోయా, మొక్కజొన్న పంటల కోత మాత్రం పూర్తయ్యింది. అధిక వర్షాల వల్ల పత్తిలో ఎదుగుదల లోపించిందని రైతులు చెబుతున్నారు. 

వరి కోసే పరిస్థితి లేదు  
నేను నాలుగు ఎకరాల్లో వరి వేశా. ప్రస్తుతం పంట కోతకు వచ్చింది. కానీ కోయించలేని పరిస్థితి నెలకొంది. జూలై నుండి ఇప్పటివరకు కురిసిన వర్షాల కారణంగా పొలమంతా నీరు పైకి ఉబికి వస్తోంది. టైర్‌ హార్వెస్టర్లు నడిచే పరిస్థితి లేదు. చైన్‌ హార్వెస్టర్లు లేవు. ఒకవేళ దొరికినా గంటకు రూ.3,500 వరకు కిరాయి ఇవ్వాల్సి వస్తుంది. ఏం చేయాలో అర్ధం కావడం లేదు.  
– బందెల మల్లయ్య, చల్‌గల్, జగిత్యాల రూరల్‌ మండలం 

మరిన్ని వార్తలు