విద్యుత్‌ సిబ్బందిని బంధించిన రైతులు 

1 Feb, 2023 01:44 IST|Sakshi
 కరెంటు కోతలను నిరసిస్తూ కోరుట్లలో ఆందోళన చేస్తున్న రైతులు   

అప్రకటిత విద్యుత్‌ కోతలపై నిరసన  

కోరుట్ల రూరల్‌: అప్రకటిత విద్యుత్‌ కోతలకు నిరసనగా ధర్మారం రైతులు మంగళవారం సబ్‌స్టేషన్‌ సిబ్బందిని కార్యాలయం గదిలో బంధించి తాళం వేశారు. అనంతరం సబ్‌స్టేషన్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. వ్యవసాయ రంగానికి 24గంటల పాటు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యుత్‌ కోతలతో నీళ్లు అందక వరి, మక్క, కూరగాయల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కోరుట్ల–మల్లాపూర్‌ మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. మల్లాపూర్‌ ఏడీఈ శ్రీనివాసరావు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో సిబ్బందిని విడుదల చేసి ఆందోళన విరమించారు.  

మరిన్ని వార్తలు