సాగు పనులకు కూలీలు దొరకట్లేదు

1 Aug, 2021 03:31 IST|Sakshi
పెద్దపల్లి జిల్లా ఓదెలలో వరినాట్లు వేస్తున్న ఉత్తరప్రదేశ్‌ కూలీలు

రాష్ట్రవ్యాప్తంగా ఊపందుకున్న వ్యవసాయ పనులు 

కూలీలు దొరక్క ఇబ్బందులు పడుతున్న రైతులు 

డిమాండ్‌ పెరగడంతో ఎక్కువ చెల్లిస్తేనే వస్తున్న కూలీలు 

కూలీల భారం పెరుగుతుందంటూ రైతుల ఆవేదన 

పక్క ఊర్ల నుంచి వాహనాల్లో తెచ్చుకుంటున్న పరిస్థితి 

యంత్రాల వైపు కొందరు రైతన్నల మొగ్గు 

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి, నెట్‌వర్క్‌: ముందస్తు వర్షాలు కురవడం, ఇప్పటికే ఆయా ప్రాజెక్టుల్లో నీరు నిల్వ ఉండటంతో పంట సాగుపై రైతన్న భారీ ఆశలు పెట్టుకున్నాడు. నీరు, విత్తనాలు, ఎరువులు ఉన్నా వ్యవసాయ కూలీలు దొరక్క రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు. నాట్లు వేయడానికి కూలీ లేక పంట సాగు ఆలస్యం అవుతోంది. పంట వేయడంలో ఆలస్యమైతే సరైన దిగుబడి రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంతూళ్లలో కూలీలు దొరక్కపోతే పక్క ఊర్లకు నుంచి వాహనాల్లో తీసుకొచ్చుకుని, పని అయిపోయాక తిరిగి వాళ్ల ఊర్లలో దించిరావాలి. పైగా కూలీల రేట్లు కూడా పెరిగిపోయాయి. తీవ్రత అధికంగా ఉండటంతో ఎక్కువ కూలీ చెల్లించాల్సి వస్తోంది. ఈ పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఉంది. కూలీల కొరతపై పలు జిల్లాల్లో ఉన్న పరిస్థితులపై ప్రత్యేక కథనం.. 

ఇతర రాష్ట్రాల కూలీలతో వరినాట్లు.. 
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వ్యవసాయ కూలీల కొరత తీవ్రంగా ఉంది. నాట్లు వేసేందుకు ఒక్కో మహిళా కూలీకి రోజుకు రూ.400 నుంచి రూ.500 చెల్లిస్తున్నారు. కనీసం 10 మంది కూలీల అవసరం ఉంటోందని, ఎకరానికి కనీసం రూ.5 వేల నుంచి రూ.6 వేలు ఖర్చు వస్తోంది. స్థానికంగా కూలీలు దొరక్కపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలతో వరినాట్లు వేయిస్తున్నారు. మెదక్, హవేలీఘణపురం, నిజాంపేట్‌ తదితర మండలాల్లో బిహార్, ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చిన కూలీలు నాట్లు వేస్తున్నారు. కూలీల కొరతను అధిగమించేందుకు డ్రమ్‌ సీడర్లను వినియోగిస్తున్నారు. 

ప్రత్యామ్నాయ పద్ధతుల్లో.. 
నిజామాబాద్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 2,86,160 ఎకరాలు కాగా, 3,82,800 ఎకరాల్లో సాగవుతుందని ప్రతిపాదించారు. ఇప్పటికే 2.95 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. కామారెడ్డిలో సాధారణ వరి విస్తీర్ణం 1.62 లక్షలు కాగా, 2.18 లక్షల ఎకరాల్లో వరి సాగుకు ప్రతిపాదించారు. ఇందులో 1.07 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. వరిసాగు పెరుగుతుండటంతో కూలీల కొరత తీవ్రంగా ఉంది. మాల్తుమ్మెద వ్యవసాయ క్షేత్రంలో వరి నాటుకు కూలీల సమస్య ఉంది. దీంతో జిల్లాలోని రైతులు వరినాటు యంత్రం, పవర్‌ టిల్లర్‌ ద్వారా, పొడి దుక్కుల్లో వరి విత్తనాలు వెదజల్లే పద్ధతిలో వరి నాట్లు వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల నుంచి పురుషులు నాట్లు వేస్తున్నారు. 

యంత్రాల వైపు రైతన్న మొగ్గు.. 
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనూ కూలీల కొరత రైతులను వేధిస్తోంది. దీంతో చాలామంది రైతులు యంత్రాలను వినియోగించుకుంటున్నారు. యం త్రాలు నడిపే డ్రైవర్లు కూడా ఏడాదికి లక్ష నుంచి 2 లక్షల వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. పంట దిగుబడి కంటే డ్రైవర్ల వేతనం ఎక్కువగా ఉంటుండటంతో వ్యవసాయ యంత్రాలను గం టల చొప్పున అద్దెకు తెచ్చుకుంటున్నారు. చత్తీస్‌గఢ్, ఒడిశాల నుంచి కూలీలను 30 రోజులకు ఒ ప్పందం చేసుకుని పనులు చేయించుకుంటున్నారు. 

సాగుపై కూలీ భారం.. 
ఇటీవల వర్షాలు పడటంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ అయిపోయారు. ఒకేసారి పనులు ఊపందుకోవడంతో కూలీలకు డిమాండ్‌ పెరిగింది. సాధారణంగా రూ.200 నుంచి రూ.300 వరకు ఒకరోజు కూలీ ఉంటుంది. ప్రస్తుతం కూలీల కొరతతో రూ.500 నుంచి రూ.700 వరకు చెల్లించాల్సి వస్తోంది. కూలీల రవాణా చార్జీలు కూడా రైతులే చెల్లిస్తున్నారు. కూలీల కొరత కారణంగా డ్రమ్‌ సీడర్‌ విధానానికి రైతులు మొగ్గుచూపుతున్నారు. దీనిపై అవగాహన లేక ఆపరేట్‌ చేయడానికి తమిళనాడు నుంచి కూలీలను తీసుకొస్తున్నారు.  

నాగర్‌కర్నూలులో ఇబ్బందులు.. 
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కూలీల కొరత పెద్దగా లేదు. నాగర్‌కర్నూల్‌ జిల్లా మారుమూల ప్రాంతం కావడంతో అక్కడి రైతులు కాస్త ఇబ్బంది పడుతున్నారు. పక్క మండలాల నుంచి ఒక్కో కూలీకి రూ.400–500 చెల్లించి రప్పించుకుంటున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో సీడ్‌ పత్తికి సంబంధించి క్రాసింగ్‌ చేసేందుకు కర్ణాటక నుంచి కూలీలను పిలిపిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో వరి నారుమడుల దశలో ఉండటంతో మరో 10–15 రోజుల్లో కూలీల అవసరం ఏర్పడనుంది. 

మహిళకు రూ.400.. పురుషులకు రూ.700 
గతంలో వ్యవసాయ పొలాల్లో పనిచేయడానికి మహిళలకు రూ.200, పురుషులకు రూ.400 కూలీ ఇచ్చేవారు. ప్రసుత్తం ఆడవారికి రూ.400, మగవారికి రూ.700 నుంచి వెయ్యి వరకు ఇవ్వాల్సి వస్తోంది. కాగా, కూలీలు దొరక్కపోవడంతో ఎకరానికి ఇంత అని రైతులు గంపగుత్తగా ఇస్తున్నారు. గంపగుత్తగా ఇవ్వడం ద్వారాæ పని త్వరగా అవుతుందని రైతులు చెబుతున్నారు. వ్యవసాయ పనులకు గ్రా మాల్లో ట్రాక్టర్లకు భలే డిమాండ్‌ ఏర్పడింది. ముందస్తుగా అడ్వాన్సులు ఇచ్చినా ట్రాక్టర్లు దొరకట్లేదు. 

కూలీలు దొరకట్లేదు.. 
మా గ్రామంలో కూలీల కొరత తీవ్రంగా ఉంది. పంటల్లో కలుపు తీయడానికి, ఇతర పనులకు ఇబ్బందులు పడుతున్నాం. కూలీల రేట్లు పెరగడంతో పాటు దూరప్రాంతాల నుంచి తీసుకురావడంతో ఖర్చులు పెరుగుతున్నాయి. ఇంకా మాకు యంత్రాల వినియోగం అలవాటు కాలేదు. 
– రేగుల రవి, రైతు, అక్కంపేట, ఆత్మకూరు, వరంగల్‌ రూరల్‌ జిల్లా 

మోయలేని భారం.. 
మా దగ్గర కూలీల కొరత బాగా ఉంది. మా ఊర్లో ఉపాధి పనులకు వెళ్తుండటంతో వ్యవసాయ పనులకు దొరకట్లేదు. వరంగల్‌ నుంచి కూలీలు వస్తున్నారు. వీరికి రూ.200తో పాటు రవాణా ఖర్చులు ఇవ్వాల్సి వస్తోంది. 
– ఉప్పుల సుదర్శన్, రైతు, ఆత్మకూరు, వరంగల్‌ రూరల్‌ జిల్లా 

రోజుకు వెయ్యి ఇస్తున్నారు..  
మాది ఉత్తరప్రదేశ్‌లోని బలిమి జిల్లా. మాకు అక్కడ పెద్దగా పనిలేదు. జీవనోపాధి కోసం ఇక్కడికి వచ్చినం. నాట్లు వేస్తే రోజుకు రూ.వెయ్యి కూలీ గిట్టుబాటవుతంది. భార్యాపిల్లలు అక్కడే ఉన్నరు. ఉదయం వంట చేసుకొని 6 గంటలకు నాటు వేయడానికి పొలానికి వెళ్తానం. 
– ప్రేమ్‌దాస్, ఉత్తరప్రదేశ్‌ కూలీ  

డ్రమ్‌ సీడర్‌తో.. 
పెద్దపల్లి జిల్లాలో 2,93,441 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతుండగా.. అందులో 2,05,089 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. వరి సాగు అధికంగా ఉండటం, వర్షాలు ఆశాజనకంగా కురుస్తుండటంతో నాట్లు వేగం పుంజుకున్నాయి. దీంతో కూలీల కొరత రైతులను వేధిస్తోంది. జిల్లాలో కొందరు వెదజల్లే పద్ధతి, డ్రమ్‌సీడర్‌ సాయంతో నాట్లు వేస్తున్నారు. ఓదెల మండలంలో కూలీల కొరత తీవ్రంగా ఉండటంతో ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చిన కూలీలతో వరినాట్లు వేయిస్తున్నారు.  

మరిన్ని వార్తలు