సొమ్ము లేకుండా సాగేదెలా?

22 Jun, 2022 01:02 IST|Sakshi

పంట పెట్టుబడుల కోసం అన్నదాతల ఇబ్బందులు

రైతుబంధు సొమ్ము కోసం ఎదురుచూపులు.. మొదలుకాని బ్యాంకుల పంట రుణాలు

ప్రైవేటు అప్పులతో పంటల సాగు 

రైతులు ఇప్పటికే రూ. 2వేల కోట్లకుపైగా అప్పులు చేసినట్టు అంచనా

సాక్షి, హైదరాబాద్‌: వానాకాలం మొదలైంది. పంటల సాగుకు సమయం వచ్చేసింది. కానీ రైతుల చేతిలో చిల్లిగవ్వ లేక.. వ్యవసాయ పెట్టుబడి కోసం అగచాట్లు పడుతున్నారు. రైతుబంధు కోసం ఓవైపు.. పంట రుణాల కోసం మరోవైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం  రైతుబంధు సొమ్ము ఎప్పుడు వేస్తుందన్నదానిపై ఇంకా స్పష్టత లేదని, బ్యాంకులు రుణాలివ్వడం ప్రారంభించలేదని.. దీంతో సీజన్‌ మొదట్లోనే అడ్డగోలు వడ్డీ కింద ప్రైవేటు అప్పులు చేయాల్సి వస్తోందని అన్నదా తలు వాపోతున్నారు. రైతుబంధు సొమ్ము వెం టనే ఇవ్వడంతోపాటు బ్యాంకులు రుణాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

సాగు మొదలైనా..
రాష్ట్రవ్యాప్తంగా వానలు పడుతుండటంతో రైతులు వ్యవసాయ పనుల్లో పడ్డారు. కొందరు రైతులు ఇప్పటికే పత్తి, కంది విత్తనాలు వేశారు. వ్యవసాయ శాఖ తాజా అంచనా ప్రకారం దాదాపు ఐదు లక్షల ఎకరాల్లో పంటల సాగు మొదలైంది. ఇందులో అత్యధికం గా 4 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. మరో లక్ష ఎకరాల్లో కంది, సోయాబీన్‌ వంటి పంటలు వేశారు. వానలు మరింతగా విస్తరించగానే సాగు జోరందుకోనుంది.

రైతు బంధుపై అస్పష్టత
ఏటా వానాకాలం సీజన్‌ ప్రారంభమయ్యే నాటికే అన్నదాతలకు రైతుబంధు సొమ్ము చేతికందుతోంది. గతేడాది కూడా జూన్‌ 15 నాటికి రైతుబంధు ఇచ్చారు. ఈసారి 20వ తేదీ దాటుతున్నా సొమ్ము విడుదల కాలేదు. వ్యవసాయ వర్గాలు కూడా ఇంకా రైతుబంధు విడుదలకు సంబంధించి ప్రభుత్వం నుంచి సమాచారమేదీ లేదని చెప్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2022–23 బడ్జెట్‌లో వానాకాలం, యాసంగి సీజన్లకు కలిపి రైతుబంధు కోసం రూ.14,800 కోట్లు కేటాయించింది.

అందులో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో కోటిన్నర ఎకరాలకుపైగా భూములకు సంబంధించి 63.25 లక్షల మందికి రైతుబంధు ఇవ్వాల్సి ఉం టుందని.. ఇందుకు రూ.7,508.78 కోట్లు అవసరమని వ్యవసాయశాఖ అంచనా వేసింది. 2021–22 వ్యవసాయ సీజన్‌లో ప్రభుత్వం మొత్తం రూ.14,772 కోట్లను రైతుబంధు కింద అందజేసింది. ఈసారి మాత్రం ఇప్పటికీ స్పష్టత రాకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అందని బ్యాంకు రుణాలు
వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండటం లేదు. నిజానికి ఈ ఏడాది రూ.1.01 లక్షల కోట్ల మేర వ్యవసాయం, అనుబంధ రంగాలకు రుణాలు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) నిర్ణయించింది. అందులో వానాకాలం సీజన్‌కు రూ. 51,229.98 కోట్లు, యాసంగికి రూ.34,153.32 కోట్లు పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఎస్‌ఎల్‌బీసీ సమావేశాన్ని ఇటీవలే నిర్వహించి, లక్ష్యాన్ని నిర్ణయించుకోవడంతో.. ఇంకా పంట రుణాల జారీ మొదలుకాలేదు. రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా స్పందన రావడం లేదు. రుణమాఫీ జరగకపోవడం, పాత పంట రుణ బకాయిలు ఉండటంతో బ్యాంకులు రుణాలు నిరాకరించడానికి కారణమని రైతులు అంటున్నారు. ఇటు రైతు బంధు సొమ్ము రాక, అటు బ్యాంకులు రుణాలివ్వక ప్రైవేట్‌ అప్పులు తీసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. 

రుణం దొరికినా అవసరం కంటే తక్కువే..
సాధారణంగా ఏ పంటకు ఎంత పెట్టుబడి అవసరం, ఎంత రుణం ఇవ్వాలన్న దానిపై ప్రభుత్వం ‘స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌’ను ఖరారు చేసింది. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కాబ్‌) దానిని రూపొందించి.. అన్ని బ్యాంకులకు పంపింది. పత్తి, వరి పంటలకు ఎకరానికి రూ.40 వేల మేర పంట రుణాలు ఇవ్వాలని సూచించింది. ఏటా ఇలా కనీస రుణాలను నిర్ణయిస్తున్నా.. బ్యాంకులు మాత్రం తక్కువ మొత్తంలోనే రుణాలే ఇస్తున్నాయి. అవి పంట పెట్టుబడులకు సరిపోక రైతులు బయట మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది.

పంట పెట్టుబడికి డబ్బుల్లేక..
నాకున్న మూడెకరాల్లో గతేడాది 2 ఎకరాల్లో వరి, ఎకరంలో పత్తి వేశా. పత్తి పూర్తిగా దెబ్బతింది. వరికి నష్టం వచ్చి.. రెండెకరాలకు 18 క్వింటాళ్ల ధాన్యమే వ చ్చింది. అప్పటికే బిడ్డ పెళ్లికోసం చేసిన రూ.4 లక్షల అప్పు ఉండగా.. పంట పెట్టుబడి అప్పు కూడా మీదపడింది. అప్పులకు వడ్డీ పెరిగిపోతోందని కొంత భూమి అ మ్మేసి కట్టిన. ఇప్పుడు విత్తనాలు వేద్దామం టే పెట్టుబడికి డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నా. రైతుబంధు ఇప్పటివరకు రాలేదు.    
– సింగిరెడ్డి సుధాకర్‌రెడ్డి, అమీనాపురం, కేసముద్రం

రైతుబంధు కోసం ఎదురుచూస్తున్నా..
నాకు ఏడెకరాల భూమి ఉంది. అం దులో రెండున్నర ఎకరాలు పత్తి, మరో రెం డున్నర ఎకరాల్లో మిర్చి, మిగతా రెండెకరా ల్లో వరి వేస్తాను. వివిధ కర్చులు కలిపి ఎకరానికి రూ.8,500 వరకు ఖర్చవుతాయి. ఇప్పటివరకు రైతుబంధు సొమ్ము రాలేదు. గతంలో ఈ సమయానికే అందేది. పాత బకాయిలు పేరుకుపోవ డం, రుణమాఫీ జరగకపోవడంతో బ్యాం కర్లు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. దీంతో అడ్డగోలు వడ్డీకి ప్రైవేట్‌ అప్పులు తీసుకోవాల్సి వస్తోంది. డబ్బులకోసం వేచి చూస్తున్నా.
– ఇందుర్తి రంగారెడ్డి, రైతు, పోచారం, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా 

మరిన్ని వార్తలు