అన్‌లాక్‌.. కరోనాకు ‘ప్లస్‌’!

26 Jun, 2021 08:05 IST|Sakshi

పొరుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న డెల్టా ప్లస్‌ కేసులు 

రాష్ట్ర సరిహద్దుల్లో కానరాని కోవిడ్‌ చెక్‌పోస్టులు 

మహారాష్ట్ర, కర్ణాటక నుంచి విస్తారంగా రాకపోకలు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/మంచిర్యాల/ బోధన్‌ రూరల్‌(బోధన్‌)/ మద్నూర్‌ (జుక్కల్‌): కరోనా డెల్టా వేరియంట్‌ ఇప్పటికే దేశాన్ని అతలాకుతలం చేయగా.. ఇప్పుడు దాని నుంచి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ పుట్టింది. తెలంగాణలో ఇప్పటివరకు ఒక్క కేసు రాకున్నా.. పొరుగు రాష్ట్రాల్లో వరుసగా నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రాలకు దగ్గరగా ఉన్న సరిహద్దు జిల్లాల ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. నిజానికి లాక్‌డౌన్‌ సమయంలో పోలీసు బందోబస్తు, రెవెన్యూ, వైద్య సిబ్బందితో కోవిడ్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వచ్చీపోయే వారిలో అనుమానితులకు కోవిడ్‌ పరీక్షలు చేయించి పాజిటివ్‌ వస్తే ఐసోలేషన్‌కు పంపారు. లాక్‌డౌన్‌ ఎత్తివేశాక చెక్‌పోస్టులు తొలగించడంతో విస్తారంగా రాకపోకలు జరుగుతున్నాయి. దీంతో కొత్త వేరియంట్‌ ఎక్కడ కమ్ముకుంటుందోనని స్థానికులు వాపోతున్నారు. 

దేశంలో నమోదైన డెల్టా ప్లస్‌ కేసుల్లో ఎక్కువగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాలకు రాకపోకలు ఎక్కువ. సెకండ్‌ వేవ్‌ సమయంలోనూ ఈ జిల్లాల్లో కేసులు భారీగా వచ్చాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఎత్తివేసినప్పటి నుంచీ రాకపోకలు మళ్లీ పెరిగాయి. ఆదిలాబాద్‌ జిల్లా ఎన్‌హెచ్‌ 44 భోరజ్‌ సరిహద్దు, నిర్మల్‌ జిల్లా తానూరు సరిహద్దులో ఎటువంటి పరీక్షలు నిర్వహించడం లేదు. ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండలం గోయగాం సమీపంలో కోవిడ్‌ చెక్‌పోస్టు ఎత్తేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ప్రాణహిత బ్రిడ్జి సమీపం లోని రాపన్‌పల్లి చెక్‌పోస్ట్‌ వద్ద మాత్రం మావోయిస్టులు వైద్యం కోసం వస్తున్నారనే సమాచారంతో చెక్‌పోస్టు కొనసాగుతోంది. ఇక నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం సాలూర, కామారెడ్డి జిల్లా  సలాబత్‌పూర్‌ చెక్‌పోస్టుల వద్ద వాహనాల రాకపోకలు యథేచ్ఛగా సాగుతున్నాయి. 

జాతీయ రహదారిపై.. 
రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలకు కర్ణాటకతో సరిహద్దులు ఉన్నాయి. గద్వాల పరిధిలోని బల్గెర–ఎర్రగేర, నందిన్నె–సింగనేడి, నారాయణపేట పరిధిలో గుడెబల్లూరు–దేవసుగురు, కానుకుర్తి ద్వారా రాకపోకలు జరుగుతాయి. ఇక 44వ జాతీయ రహదారి మీదుగా కర్ణాటకతోపాటు ఏపీ, తమిళనాడు, కేరళ ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. లాక్‌డౌన్‌ సమయంలో ఈ సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. ఇప్పుడు ఎక్కడా కట్టడి లేదు.

మళ్లీ కరోనా వస్తే ఎలా? 
రెండేళ్లలో కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. మహారాష్ట్ర వల్ల మా గ్రామంలో చాలా కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో డెల్టా ప్లస్‌ అని కొత్తరకం వస్తోందని చెప్తున్నారు. చాలా వాహనాలు వస్తున్నాయి. జనం వచ్చిపోతున్నారు. మహా రాష్ట్ర వల్ల మళ్లీ ఇక్కడ కరోనా కేసులు రాకుండా చర్యలు తీసుకోవాలి. –కె.నారాయణ, రైతు, పంచాక్షరి, ప్రైవేటు లెక్చరర్‌ సాలూర గ్రామం, బోధన్‌ మండలం

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు