కనీస ఫీజు రూ.45 వేలు!

21 Jul, 2022 03:03 IST|Sakshi

ఇంజనీరింగ్‌ ఫీజులపై నెలాఖరులో ఎఫ్‌ఆర్‌సీ నిర్ణయం

గరిష్టంగా 30% వరకు ఫీజుల్లో పెంపుదల!

ప్రతిపాదనలను ఆమోదించిన తర్వాత ప్రభుత్వ ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజుల పెంపు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కాలేజీల యాజమాన్యాలతో అధికారుల చర్చలు మరో రెండురోజుల్లో ముగియనున్నాయి. తర్వాత ఈ నెలాఖరున జరిపే భేటీలో ఫీజుల పెంపుపై తుది నిర్ణయానికి వస్తామని రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎస్‌ ఎఫ్‌ఆర్‌సీ) వర్గాలు తెలిపాయి.

ఈ మేరకు తమ నివేదికను ప్రభుత్వం ఆమోదించి, ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని ఎఫ్‌ఆర్‌సీ అధికారులు చెప్పారు. ఇంజనీరింగ్‌ ప్రవేశాల నాటికి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడే వీలుందని తెలిపారు. కనీస ఫీజు రూ.45 వేలకు పెంచే అవకాశం ఉందని, గరిష్టంగా 30 శాతం వరకు ఫీజులు పెరగవచ్చని తెలుస్తోంది.

కాలేజీల వారీగా పెంపు!
ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజులను చివరిసారిగా 2019లో ఖరారు చేశారు. ఇవి 2021–22 విద్యా సంవత్సరం వరకు అమల్లో ఉన్నాయి. కాగా 2022–23కు కొత్త ఫీజుల ఖరారుపై ఎఫ్‌ఆర్‌సీ గత రెండు నెలలుగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే కాలేజీల యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతోంది. కాలేజీ వారీగా ఫీజుల పెంపుపై ముందుకెళ్ళే యోచనలో కమిటీ ఉంది. సంబంధిత యాజమాన్యాలు ఆదాయ, వ్యయాలపై సమర్పించిన ఆడిట్‌ నివేదికలను పరిగనలోనికి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. సీబీఐటీ వంటి అగ్రశ్రేణి కాలేజీలు వార్షిక ట్యూషన్‌ ఫీజును రూ. 2.15 లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేశాయి.

కానీ ఎఫ్‌ఆర్‌సీతో చర్చల అనంతరం రూ.1.71 లక్షలకు అంగీకరించినట్టు తెలిసింది. ఎంజీఐటీ కూడా రూ.1.90 లక్షలకు పెంచాలని కోరినప్పటికీ, ఎఫ్‌ఆర్‌సీ రూ.1.60 లక్షలకు ఒప్పుకున్నట్టు తెలిసింది. ఇవి కూడా ప్రభుత్వం అనుమతిస్తేనని కమిటీ స్పష్టం చేసినట్టు తెలిసింది. మిగతా కాలేజీల్లో కనీస ఫీజును రూ.35 వేల నుంచి రూ.45 వేలకు పెంచే అవకాశం ఉందని ఎఫ్‌ఆర్‌సీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఫీజులు గరిష్టంగా 30 శాతం వరకూ పెరిగే వీలుందని సమాచారం. 

గరిష్ట ఫీజు రూ.1.71 లక్షలు!
రాష్ట్రంలో 158 ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలున్నాయి. వీటిల్లో ప్రస్తుతం 20 కాలేజీల్లో మాత్రమే ట్యూషన్‌ ఫీజు రూ.35 వేలుగా ఉంది. పెంపునకు ప్రభుత్వం అంగీకరిస్తే ఇప్పుడది రూ.45 వేలకు పెరిగే వీలుంది. ఇక 110 కాలేజీల్లో రూ.80 వేల వరకు ఉండగా రూ.లక్ష దాటే అవకాశం కన్పిస్తోంది. మిగతా కాలేజీల్లో రూ.1.40 లక్షల నుంచి రూ.1.71 లక్షల వరకు పెరిగే వీలుందని ఎఫ్‌ఆర్‌సీ వర్గాలు అంటున్నాయి. 

సంబంధం లేని ఖర్చులూ ప్రతిపాదనల్లో..
పలు కాలేజీలు నిబంధనల్లో లేని లెక్కలను ఆడిట్‌ రిపోర్టులో చూపినట్టు ఎఫ్‌ఆర్‌సీ వర్గాలు చెబుతున్నాయి. కాలేజీల తప్పిదాల వల్ల విద్యార్థులు కోర్టుకెళితే, దానికయ్యే లీగల్‌ ఖర్చులను కూడా ఫీజు పెంపు ప్రతిపాదనల్లో పెట్టినట్టు తెలిసింది. వీటిని కమిటీ అనుమతించలేదు. కొన్ని కాలేజీలు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు రాకపోతే దానిపై కోర్టుకెళ్ళాయి. ఈ ఖర్చులనూ తమ ఆడిట్‌ రిపోర్టుల్లో పేర్కొన్నాయి. వీటిని కూడా ఎఫ్‌ఆర్‌సీ తిరస్కరించింది.

రీయింబర్స్‌మెంట్‌ భారమెంత?
రాష్ట్రంలో మూడు కాలేజీలు ఇప్పుడున్న కనీస ట్యూషన్‌ ఫీజును (రూ.35 వేలు) పెంచవద్దని ఎఫ్‌ఆర్‌సీని కోరాయి. ఫీజుల పెంపు నేపథ్యంలో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చించాల్సి ఉంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలవుతోంది. ఎంసెట్‌లో 10 వేల లోపు ర్యాంకు వచ్చిన బీసీలకూ పూర్తి రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నారు.

ఆ తర్వాత ర్యాంకు వచ్చిన వారికి కళాశాల ఫీజు ఎంతున్నా గరిష్టంగా రూ.35 వేలు మాత్రమే రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది. కన్వీనర్‌ కోటా కింద ఏటా 48 వేల నుంచి 50 వేల మంది వరకు విద్యార్థులు చేరుతున్నారు. వారిలో సుమారు 70 శాతం వరకు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులవుతు న్నారు. ఈ నేపథ్యంలో ఫీజుల పెంపు అనివార్యమైతే ఏ మేరకు భారం పడుతుందనేది ఆర్థిక శాఖ పరిశీలించాల్సి ఉంది.   

మరిన్ని వార్తలు