ఆడవాళ్లదీ.. అదే దైన్యం! 

23 Apr, 2022 03:15 IST|Sakshi
ఖమ్మం జిల్లాలో చంటిపాపతో డ్యూటీకి వచ్చి నిలబడే భోజనం చేస్తున్న మహిళా వీఆర్‌ఏ  

ప్రసూతి సెలవు లేదు. పాలిచ్చే సమయమూ లేదు 

పిల్లా పాపలతోనే నైట్‌ షిప్ట్‌లు, ఇసుక డ్యూటీలు 

మహిళా వీఆర్‌ఏల మనోవేదన 

సాక్షి నెట్‌వర్క్‌: ‘ప్రసూతి కోసం వెళ్లినా జీతం కట్‌.. పిల్లకు పాలిద్దామన్నా గంట సమయం కూడా ఇవ్వరు. పనిచేస్తున్న ప్రదేశంలోనే పాలిచ్చే పరిస్థితి. ఊరందరి సమస్యను మా  సమస్యగా భావించే మేము, మా సమస్య వచ్చే సరికి ఎవరికీ కాకుండా పోయాం..’ఇదీ రాష్ట్రంలో పనిచేస్తున్న సుమారు రెండువేల మంది మహిళా వీఆర్‌ఏల మనోవేదన. 2014లో  నిర్వహించిన వీఆర్‌ఏ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌లో సుమారు 55 శాతం మంది మహిళలే ఎంపికయ్యారు.

తాజాగా కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత, వీఆర్‌ఏలకు సర్వీస్‌ రూల్స్, డ్యూటీ చార్ట్‌లేవీ అమల్లోకి రాలేదు. దీంతో మహిళా వీఆర్‌ఏలకు నైట్‌ డ్యూటీలు, ఇసుక రవాణాను అడ్డుకునే డ్యూటీలు వేస్తుండటం వివాదాస్పదం అవుతోంది. ఇటీవల సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌లో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న వీఆర్‌ఏపై కొందరు దాడికి దిగారు.  

జీతాల్లో కోత పెడుతున్నారు.. 
వీఆర్‌ఏల సర్వీస్‌ క్రమబద్ధీకరణ ఆలస్యం అవుతుండటంతో సెలవులు, పని గంటలు అనేవి ఏవీ లేకుండాపోయాయి.పై అధికారి అనుమతితో సెలవుపై వెళితే జీతంలో కోత విధిస్తున్నారని చెబుతున్నారు. తల్లులు చంటిపిల్లలతో విధుల్లో పాల్గొనాల్సి వస్తోందని కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ మహిళా వీఆర్‌ఏ శుక్రవారం సాక్షి ప్రతినిధితో తన గోడు వెళ్లబోసుకున్నారు. ఇదే జిల్లాలోని కొందరు తహశీల్దార్లు తమతో కొప్పులు, జడలు వేయించుకుంటున్నారని మరో మహిళా వీఆర్‌ఏ వాపోయారు. 

మరిన్ని వార్తలు