వరికి, పత్తికి ఎకరాకు రూ.40 వేల రుణం

27 Apr, 2022 03:37 IST|Sakshi

వచ్చే సీజన్‌కు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఖరారు

మిర్చికి రూ. 75 వేలు.. ఆయిల్‌ పామ్‌కు రూ. 42 వేల రుణం నిర్ధారణ.. 

పంటలకు రుణ పరిమితి ఖరారు

సాక్షి, హైదరాబాద్‌: వరి, పత్తి, ఆయిల్‌పాం, మొక్కజొన్న, సోయాబీన్, మిర్చి తదితర పంటలకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ (రుణ పరిమితి) పెరిగింది. వచ్చే వ్యవసాయ సీజన్‌కు రుణ పరిమితిని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కాబ్‌) ఖరారు చేసింది. రాష్ట్రంలో పండించే 120 రకాల పంటలకు 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఎంతెంత రుణాలు ఇవ్వాలన్న దానిపై టెస్కాబ్‌ భారీ కసరత్తు చేసింది.

సాగు ఖర్చు, ఉత్పాదకత, నీటి వసతి ఆధారంగా రుణ నిర్ధారణ చేసింది. రుణ పరిమితి నివేదికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ)కి పంపిం చింది. తాము ఖరారు చేసినట్లుగా రైతులకు పంట రుణా లు ఇవ్వాలని సూచించింది. రాష్ట్రంలో అత్యధికంగా సాగు చేసే పత్తి, వరి పంటలకు ఎకరానికి రూ.40 వేలు ఖరారు చేసింది. సాగునీటి ప్రాజెక్టులు ఉన్నచోట వరికి గతేడాది రూ.34 వేల నుంచి రూ. 38 వేల వరకున్న పంట రుణా లను, ఈసారి రూ.36 వేల–రూ. 40 వేలకు పెంచింది. అంటే గతేడాది కంటే రూ.2 వేలు అధికంగా పెంచింది.

శ్రీ పద్ధతిలో సాగు చేసే వరికి రూ.34 వేల నుంచి రూ. 36 వేలు ఖరారు చేసింది. గరిష్ట పరిమితి గతేడాదితో సమానంగా ఉంది. అలాగే వరి విత్తనోత్పత్తికి గతేడాది మాదిరిగానే రూ. 42 వేల నుంచి రూ.45 వేలుగా ఖరారు చేసింది. ఇక పత్తికి గతేడాది రుణ పరిమితి రూ.35 వేల నుంచి రూ. 38 వేలు ఉండగా, ఈసారి దాన్ని రూ.38 వేల నుంచి రూ.40 వేలకు పెంచింది. ఈసారి 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ పెరుగుదల రైతులకు ఉపయోగపడనుంది. 

ఆయిల్‌పామ్‌కు రూ. 42 వేల రుణం...
►ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈసారి ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనికోసం బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయిల్‌పామ్‌ రుణాన్ని పెంచాలని నిర్ణయించినట్లు టెస్కాబ్‌ వర్గాలు తెలిపాయి. గతేడాది ఆయిల్‌పామ్‌ పంటలు సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.38 వేల వరకు రుణ పరిమితి ఉండగా, ఈసారి దాన్ని రూ.40 వేల నుంచి రూ.42 వేలకు పెంచడం గమనార్హం. 
►సాగునీటి వసతి ఉన్నచోట మినుము పంటకు ఎకరాకు రూ. 18–21 వేలు, సాగునీటి వసతి లేని చోట 15–17వేలు ఖరారు చేశారు. సేంద్రియ విధానంలో పండించే మినుముకు 18–21 వేలు ఖరారు చేశారు. 
►పెసరకు సాగునీటి వసతి ఉన్నచోట రూ.18–21 వేలు, సాగునీటి వసతి లేనిచోట రూ. 15–17 వేలు ఖరారు చేశారు. సేంద్రియ విధానంలో పండించే పెసరకు రూ. 18–21 వేలు నిర్దారించారు. 
►శనగకు రూ. 22–24 వేలు చేశారు. 
►సాగునీటి వసతి ఉన్న చోటమొక్కజొన్నకు రూ. 28–32 వేలు, నీటి వసతి లేని చోట రూ. 24–26 వేలు చేశారు. 
►సాధారణ పద్ధతిలో పండించే కందికి సాగునీటి వసతి ప్రాంతాల్లో రూ.18–21 వేలు, సాగునీటి వసతి లేని చోట రూ.16–19 వేలు ఖరారు చేశారు. ఆర్గానిక్‌లో పండించే కందికి రూ. 18–21 వేలు ఖరారు చేశారు. 
►సోయాబీన్‌కు రూ. 24 వేల నుంచి రూ. 26 వేలు ఇస్తారు. సోయా విత్తనోత్పత్తి రైతులకు రూ. 30 వేల నుంచి రూ. 32 వేల వరకు ఇస్తారు. 
►మెడికల్, ఎరోమాటిక్‌ ప్లాంట్స్‌కు రూ. 37,500 నుంచి రూ. 42,500 వరకు ఇస్తారు. 
►రూఫ్‌ గార్డెన్‌కు దశలవారీగా మొదటిసారి రూ. 28,500 నుంచి రూ. 31,500 వరకు ఇస్తారు. రెండో దశలో రూ.19 వేల నుంచి 21 వేలు, మూడోదశలో 9,500 నుంచి రూ. 10,500 వరకు ఇవ్వాలని నిర్ణయించారు. 
►ఇక డ్రాగన్‌ ఫ్రూట్‌కు రూ. 65 వేల నుంచి రూ. 75 వేల వరకు ఇస్తారు. విత్తన రహిత ద్రాక్షకు రూ.1.25 లక్షల నుంచి రూ. 1.30 లక్షల రుణం ఇవ్వనున్నారు.
►పత్తి విత్తనాన్ని సాగు చేస్తే రూ.1.10 లక్షల నుంచి రూ.1.40 లక్షలకు ఖరారు చేశారు.
►పసుపు సాగుకు 75వేల నుంచి 80 వేల వరకు ఇస్తారు. 
►ఉల్లిగడ్డ సాగుకు ఎకరానికి రూ.37 వేల నుంచి రూ.42 వేలు ఇస్తారు.  

మరిన్ని వార్తలు