'అడ్డంకులు సృష్టిస్తున్నా ఆగని ప్రగతి.. కేంద్రం ఒత్తిళ్లకు తలొగ్గం'

13 Feb, 2023 07:20 IST|Sakshi

ప్రభుత్వరంగ ఆస్తులు విక్రయించే ప్రసక్తే లేదు

ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో మంత్రి హరీశ్‌రావు 

సాక్షి, హైదరాబాద్‌:  కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా రాష్ట్రాన్ని పురోభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం ఒత్తిడికి తలొగ్గబోమని, ప్రభుత్వ రంగ ఆస్తులు విక్రయించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆదివారం శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. కేంద్రం ఇప్పటివరకు రూ.4.06 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు అమ్మిందని చెప్పారు.

రాష్ట్రాలపై కూడా ఈ మేరకు ఒత్తిడి తెస్తోందని, అమ్మితే రాయితీలు ఇస్తామంటూ ప్రలోభ పెడుతోందని, అందుకు అంగీకరించకపోతే నిధులు రాకుండా అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర విద్యుత్‌ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టాలని, రైతుల బోర్లకు మీటర్లు పెట్టాలని వెంటబడ్డా తాము అంగీకరించలేదన్నారు. అలా చేస్తేనే రుణ పరిమితిని పెంచుతామన్నా తలొగ్గలేదని స్పష్టం చేశారు. కేంద్రం చెప్పినట్టు వింటే రూ.30 వేల కోట్లు వచ్చేవని, కానీ ప్రజల శ్రేయస్సే ముఖ్యమని భావించి తిరస్కరించామన్నారు.  

సీనియర్లు ఖండించాలి.. 
రాజకీయ పారీ్టల నేతలు ఇటీవల పేల్చేస్తాం, కూల్చేస్తామంటూ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, ఆయా పారీ్టల్లో టి.జీవన్‌రెడ్డి వంటి సీనియర్‌ నేతలు అటువంటి వ్యాఖ్యలను ఖండించాలని హరీశ్‌రావు సూచించారు. ఆ పారీ్టల విధ్వంస భాషను తెలంగాణ ప్రజలు మన్నించరని, వారికి పడే ఓట్లు కూడా పడవని పేర్కొన్నారు. మిగిలిపోయిన దాదాపు 9.5 కి.మీ శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పని ప్రస్తుత పద్ధతుల్లోనే వచ్చే సంవత్సరంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ.. టీచర్‌ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు.

ఉద్యోగుల జీతాలు ఒకటో తేదీనే ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే విద్యుత్‌ కొనుగోళ్లు వంటి వాటికి అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని చెప్పారు. వడ్డీలేని రుణాల చెల్లింపునకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాగా ద్రవ్యవినిమయబిల్లుకు ఆమోదం తెలిపాక సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు.

యూపీఏనే నయం.. 
మోదీ సర్కార్‌ కన్నా అంతకుముందు పాలించిన కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏనే కొంత నయమని హరీశ్‌రావు అన్నారు. మోదీ ఏలుబడిలో జీడీపీ తగ్గిందని, అప్పులు పెరిగాయని, ప్రైవేటీకరణతో ఉద్యోగాలు ఊడాయని చెప్పారు. మూలధనం పెంచడంలో మోదీ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజల సొమ్మును అదాని దారి మళ్లించిన తీరుపై హిడెన్‌ బర్గ్‌ నివేదిక సృష్టించిన కలకలానికి మోదీ సమాధానం చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. తప్పు చేయబట్టే ప్రజలకు సమాధానం ఇవ్వడం లేదని అన్నారు.
చదవండి: సభలో నవ్వులే నవ్వులు..ప్రధాని భజన బృందంపై పిట్ట కథను వినిపించిన సీఎం కేసీఆర్‌

మరిన్ని వార్తలు